Burning Topic: ప్రకృతి ప్రళయాలపై అప్రమత్తమైన ఉత్తర ఖండ్ ప్రభుత్వం!
Burning Topic: నేపాల్ హిమపాత విపత్తు నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం గ్లేసియర్ సరస్సుల వద్ద అత్యాధునిక ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది.
Burning Topic: ప్రకృతి ప్రళయాలపై అప్రమత్తమైన ఉత్తర ఖండ్ ప్రభుత్వం!
Burning Topic: హిమాలయాలు పైకి ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంటాయి.. కానీ వాతావరణంలో అనుకోని మార్పులు జరిగితే ఒక్కసారిగా ఉగ్రరూపం దాలుస్తాయి.. నేపాల్‌లో ఇటీవల జరిగిన హిమపాత విస్ఫోటనం దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ విపత్తులో 12 వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతయ్యారు.
హిమాలయ పర్వతాలు నేపాల్, టిబెట్ తో పాటు మన దేశంలో ప్రధానంగా 11 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. వీటిని 'ఇండియన్ హిమాలయన్ రీజియన్' అని పిలుస్తారు. కాగా తాజాగా నేపాల్‌లో సంభవించిన విపత్తుల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
అక్కడి భౌగోళిక పరిస్థితులు కూడా నేపాల్‌ను పోలి ఉండటంతో ముందస్తు రక్షణ చర్యలను వేగవంతం చేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం హిమాలయ ప్రాంతాల్లోని సున్నితమైన గ్లేసియర్ సరస్సుల దగ్గర వద్ద అత్యాధునిక ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ఏర్పాటు చేస్తోంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వందల సంఖ్యలో హిమానీ నదాలు, సరస్సులు ఉన్నాయి. వీటిలో 1000 చదరపు మీటర్లకుపైగా విస్తీర్ణం ఉన్న సరస్సులే 426 ఉన్నాయి. వీటిలో చాలా సరస్సులను ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయలేదని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం 13 సరస్సులను అత్యంత సున్నితమైనవిగా గుర్తించారు. వీటిలో 4 సరస్సులపై విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే అధ్యయనాలు పూర్తి చేసింది. నేపాల్ ఘటనతో ఉత్తరాఖండ్‌లోని హిమనద సరస్సులపై ఆందోళన పెరిగింది.
భవిష్యత్తులో ఈ హిమానీ నదాలు బద్దలైతే వచ్చే ముప్పును నివారించడానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో సర్వేలు నిర్వహిస్తున్నారు. అక్కడ పర్యవేక్షణ పరికరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు.
హిమాలయ పర్వత ప్రాంతంలో గత కొన్నేళ్లుగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. దీని ప్రభావంతో హిమనదాల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి. గతంలో మంచు కురిసే ఎత్తైన ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సుమారు 4 వేల మీటర్ల ఎత్తు వరకు వర్షాలు పడటం, హిమనదాలు వేగంగా వెనక్కి తగ్గడం వంటి పరిణామాలు ప్రమాదాలను పెంచుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉత్తరాఖండ్ ఇప్పటికే ఇలాంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొంది.
2013 కేదార్‌నాథ్ విపత్తు ఇందుకు అతిపెద్ద ఉదాహరణ, ఆలయానికి ఎగువన ఉన్న చోరాబరి సరస్సు నీటి ఒత్తిడికి ఒక్కసారిగా తెరుచుకుంది. మందాకిని, సరస్వతి నదులు అపారమైన మట్టి, కొండచరియలు భారీ బండరాళ్లను మోసుకొస్తూ లోయను ముంచెత్తాయి. నాటి జలప్రళయంలో అధికారిక లెక్కల ప్రకారం 5,700 నుండి 6,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు.
నేపాల్‌లో కనిపిస్తున్న విధ్వంస దృశ్యాలను బట్టి చూస్తే ఈ విపత్తు 2013 కేదార్‌నాథ్ విపత్తు కంటే సుమారు 2-3 రెట్లు పెద్దదని చెబుతున్నారు.ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి ప్రాణనష్టాన్ని నివారించడానికి భూకంపాలు, హిమోత్పవాలు, వర్షపాతం, కొండచరియలు విరిగిపడటం గుర్తించేందుకు ఇప్పటికే అత్యాధునిక పరికరాలు అందుబాటులో అమలులో ఉన్నాయి.
అత్యాధునిక సాంకేతికతతో ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ ద్వారా నీటి మట్టాలు, సరస్సుల వైశాల్యంలో వచ్చే అసాధారణ మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇవి సమర్ధంతంగానే పని చేస్తున్నాయి.
అయితే కేవలం ఈ పరికరాలు ఏర్పాటు చేయడమే సరిపోదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులో భాగంగానే మరింత సమర్ధవంత ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
హిమోత్పాత వరద ప్రవాహాల ముప్పు కేవలం సరస్సు వద్దనే విపత్తు ప్రారంభం కాకపోవచ్చు. సరస్సు నుంచి బయటకు వచ్చే నీరు దిగువకు ప్రవహించే క్రమంలోనూ మరింత పెద్ద విపత్తుగా మారే అవకాశం ఉండొచ్చు.
అందుకే పర్యవేక్షణా పరికరాలను 3 కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న మొదట సరస్సు సమీపంలో, రెండోది సరస్సు నుంచి ముప్పు ఉన్న ప్రాంతాల మధ్యలో లేదా దిగువ గ్రామాల్లో, ఇక మూడోది విపత్తు ప్రభావానికి గురయ్యే లక్షిత ప్రాంతాల్లో పరికరాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
దీంతో సరస్సులో నీటి మట్టం పెరగడం, సరస్సు బద్ధలైనా ఈ పరిణామాల్ని ముందే గుర్తించడంతో పాటు, నీరు దిగువ ప్రాంతాలకు చేరే క్రమంలో పరిస్థితిని పర్యవేక్షించవచ్చు. అవసరమైతే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులకు తగిన సమయం ఉంటుందని భావిస్తున్నారు.
ఉత్తరాఖండ్ హిమానీ నదాల అధ్యయనం కోసం శాస్త్రవేత్తల బృందం సెప్టెంబర్ 8న బయలుదేరనుంది. వాడియా ఇన్‌స్టిట్యూట్‌తో పాటు లక్నోకు చెందిన బిర్బల్ సహానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ , సీబీఆర్ఐ, సెంట్రల్ వాటర్ కమిషన్, C- DAC కి చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయన బృందంలో ఉంటారు.
సరస్సుల ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడం సహా పరికరాల్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎన్ని పరికరాలు అవసరమనే అంశాల్ని కూడా అధ్యయనం చేయనున్నారు.ఉత్తర్‌కాశీ జిల్లాలోని కేదార్‌తాల్, చమోలీ జిల్లాలోని సరస్వతి తాల్ వద్ద ఈ బృందం క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించనుంది.
సరస్సుల ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి పర్యవేక్షణా పరికరాలను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశాల్ని గుర్తిస్తారు. వసుంధర తాల్ వద్ద పర్యవేక్షణా పరికరాలను ఏర్పాటు చేసేందుకు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అంగీకరించింది.




