off the record: బెజవాడ మేయర్ పీఠంపై పవన్ గురి!

off the record: మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ భేటీ. విజయవాడ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపిందా అనే చర్చ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Sept 2026 11:14 AM IST
off the record
X

off the record: బెజవాడ మేయర్ పీఠంపై పవన్ గురి!

off the record: మంగళగిరిలోని పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో జరిగిన భేటీ సాధారణ సమావేశం కాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

జనసేన వర్గాలు మాత్రం ఇది పాత స్నేహితుల భేటీ మాత్రమేనని చెబుతున్నాయి. ప్రజారాజ్యం రోజుల నుంచి ఉన్న అనుబంధం, 2024 ఎన్నికల్లో కలిసి చేసిన ప్రచారం వంటి విషయాలు ఈ సందర్భంగా చర్చించుకున్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఇద్దరు నేతలు సుదీర్ఘంగా మాట్లాడుకున్నట్లు జనసేన వర్గాలే వెల్లడించాయి.

అయితే రాజకీయాల్లో మర్యాదపూర్వక భేటీలకు కూడా ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. ఎందుకంటే వంగవీటి రాధా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ, గత కొంతకాలంగా ఆయన రాజకీయంగా అంతగా యాక్టివ్‌గా కనిపించడం లేదు.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ లేదా మరో కీలక పదవి వస్తుందనే అంచనాలు వంగవీటి రాధా వర్గాల్లో ఉండగా, అవి నెరవేరలేదనే చర్చ చాలాకాలంగా నడుస్తోంది. అలాంటి సమయంలో పవన్‌ను ప్రత్యేకంగా కలవడం సహజంగానే ఊహాగానాలకు దారి తీసింది.

అయితే విజయవాడలో వంగవీటి కుటుంబానికి ఇప్పటికీ గణనీయమైన సామాజిక, రాజకీయ ప్రభావం ఉంది. ముఖ్యంగా నగరంలోని పలు డివిజన్లు, కాపు సామాజిక వర్గంలో రాధాకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను జనసేన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఎన్నికల కోసం ప్రత్యేక సమన్వయ కమిటీలను కూడా పవన్ కల్యాణ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌పై జనసేన ప్రత్యేక దృష్టి పెట్టిందనే ప్రచారం జరుగుతోంది.

విజయవాడ కార్పొరేషన్‌లో భవిష్యత్తులో జరిగే రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని జనసేన ముందుగానే సామాజిక సమీకరణాలపై పని చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

విజయవాడలో కాపు ఓటు బ్యాంక్‌పై ప్రభావం చూపగల నేతల్లో వంగవీటి రాధా ఒకరు. అలాంటి నాయకుడు కూటమి వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తే మేయర్ పీఠంపై జనసేన ఆశలు మరింత బలపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ అంశంపై అధికారికంగా ఎక్కడా ఎలాంటి ప్రకటన లేదు.

వంగవీటి రాధా టీడీపీలోనే కొనసాగుతున్నప్పటికీ, ఆయన భవిష్యత్ రాజకీయ పాత్రపై స్పష్టత లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

విజయవాడలో ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు స్థానిక రాజకీయాల్లో తమ తమ లెక్కలతో ముందుకు వెళ్తున్నారు. అలాంటి పరిస్థితిలో రాధాకు పెద్ద బాధ్యత అప్పగిస్తే అంతర్గత సమీకరణాలు మారే అవకాశముందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకం, మేయర్ అభ్యర్థి ఎంపిక వంటి అంశాలు వస్తే కూటమి పార్టీల మధ్య కొత్త చర్చలు మొదలయ్యే అవకాశముంది.

వంగవీటి రాధా నేరుగా జనసేనలో చేరతారా లేదా అనేది పక్కన పెడితే.. విజయవాడలో ఆయన ప్రభావాన్ని వినియోగించుకోవాలని జనసేన కోరుకోవడం సహజమే.

ఎందుకంటే 2029 ఎన్నికల లక్ష్యంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ బలాన్ని చూపించాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారు. అందుకే ప్రాంతాల వారీగా బలమైన సామాజిక నాయకత్వాన్ని కలుపుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయం ఉంది. ఇలాఉంటే

విజయవాడ రాజకీయాల్లో వంగవీటి పేరు ఎప్పుడు హాట్ టాపికే. రాధా కూటమి రాజకీయాల్లో మరింత యాక్టివ్ అయితే, అది వైసీపీ సామాజిక సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యేకించి కృష్ణా జిల్లా రాజకీయాల్లో కాపు వర్గం ఓటింగ్ ధోరణిపై దాని ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే రాజకీయాల్లో ప్రతి భేటీకి ఒక సందేశం ఉంటుంది. రాధా, పవన్ కలయిక కేవలం స్నేహితుల కలయికేనా..? లేక విజయవాడ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలికిందా..? మేయర్ పీఠం దిశగా జనసేన-రాధా వ్యూహరచన మొదలైందా..?

అనే ప్రశ్నలకు సమాధానం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతోనే తెలుస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్