BurningTopic: వెనెజువెలా లో ఒకేసారి 2 భారీ భూకంపాలు.. షాక్ లో ప్రపంచ దేశాలు
BurningTopic: వెనెజువెలాను వణికించిన జంట భూకంపాలు. కేవలం 39 సెకన్ల వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతతో విలయం. భారీ ప్రాణనష్టంపై అమెరికా, భారత్ దిగ్భ్రాంతి.
BurningTopic: వెనెజువెలా లో ఒకేసారి 2 భారీ భూకంపాలు.. షాక్ లో ప్రపంచ దేశాలు
BurningTopic: భారీ భూకంపాలతో వెనెజువెలా చిగురుటాకులా వణికిపోయింది. రెండు వరుస శక్తివంతమైన భూకంపాల తాకిడికి 32 మంది మృతి చెందారు. మరో 700 మందికి పైగా గాయపడ్డారు. అయితే 10 వేల నుంచి లక్ష మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. ఇంతటి ప్రాణనష్టం జరక్కుండా ఉంటే బాగుండు అని పౌరసమాజం కోరుకుంటోంది. అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ భరోసా ఇచ్చారు. మన ప్రధాని మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతకీ ఈ భూకంపాలకు కారణాలేంటి..? వాచ్ దిస్ హెచ్‌ఎంటీవీ స్పెషల్ స్టోరీ..
రెండు అత్యంత భారీ భూకంపాలతో వెనెజువెలా అతలాకుతలమైంది. దేశ రాజధాని కారకాస్‌కు పశ్చిమాన ఉన్న శాన్ ఫెలిపే సమీపంలో మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం కొద్ది క్షణాల్లోనే యుమారే ప్రాంతం సమీపంలో మరో 7.5 తీవ్రతతో రెండో భూకంపం నమోదైంది. రెండు భూకంపాలు దాదాపు ఒకే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించడంతో విస్తృత స్థాయిలో నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు నిపుణులు.
భూకంపాల తీవ్రతకు కారకాస్‌తోపాటు పలు ప్రాంతాల్లో భవనాలు కుప్ప కూలిపోయాయి. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారనే అనుమానంతో సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్, సమాచార వ్యవస్థలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. భారీ భూకంపాల నేపథ్యంలో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూకంపంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ఆమె సానుభూతి తెలిపారు.
ఈ ప్రకృతి విలయతాండవంలో భారీ ప్రాణనష్టం, విస్తృత స్థాయిలో విధ్వంసం జరిగి ఉండవచ్చని అమెరికన్ జియోలాజికల్ సర్వే అధికారులు హెచ్చరించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అమెరికా అండగా నిలుస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వెనెజువెలాకు అత్యవసర సాయాన్ని అందించేందుకు అమెరికా ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అమెరికా విదేశీ సహాయ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక విపత్తు సహాయక బృందం, టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
రక్షణ బృందాలు, వైద్య సహాయం, అత్యవసర మందులు, మానవతా సహాయ సామగ్రిని తొలి దశలోనే వెనిజులాకు పంపేందుకు చర్యలు చేపట్టినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. భారత్ కూడా జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వెనెజువెలాలో సంభవించిన తీవ్ర భూకంపాలు తీవ్ర విధ్వంసానికి దారితీశాయన్నారు ప్రధాని మోదీ. ఈ విపత్తులో బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
వెనెజువెలా దేశం కరేబియన్ ప్లేట్, దక్షిణ అమెరికా ప్లేట్ అనే రెండు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుల్లో ఉండటం వల్ల ఇక్కడ తరచూ భారీ భూకంపాలు సంభవిస్తాయని భూగర్భ శాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు. వెనెజువెలా ప్రధాన భూభాగం దక్షిణ అమెరికా ప్లేట్‌పై ఉండగా, దాని ఉత్తర తీర ప్రాంతం కరేబియన్ ప్లేట్ సరిహద్దును తాకుతూ ఉంటుంది. కరేబియన్ ప్లేట్ ప్రతి ఏటా సుమారు 20 మిల్లీమీటర్ల వేగంతో తూర్పు వైపునకు కదులుతూ, దక్షిణ అమెరికా ప్లేట్‌తో ఘర్షణ పడుతుంది.
ఈ రెండు ప్లేట్లు ఒకదానికొకటి రాపిడికి గురికావడం వల్ల భూగర్భంలో విపరీతమైన ఒత్తిడి పేరుకుపోతుంది. ఈ ప్రాంతంలో రాళ్ళు భూగర్భ చీలికల వెంబడి ఒకదానికొకటి క్షితిజ సమాంతరంగా ఇరువైపులా దూసుకుపోతాయి. దీనినే సాంకేతిక పరిభాషలో 'స్ట్రైక్-స్లిప్ ఫాల్టింగ్' అంటారు. ఈ క్రమంలో పేరుకుపోయిన ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు తీవ్రమైన భూకంప తరంగాలు పుడతాయి.
తాజా విపత్తులో అతిపెద్ద కారణం "సిస్మిక్ డబ్లెట్" అని భావిస్తున్నారు. సాధారణంగా ఒక పెద్ద భూకంపం వచ్చాక చిన్న ఆఫ్టర్ షాక్‌లు వస్తాయి. కానీ, ఇక్కడ కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే రెండు సమాన స్థాయి భారీ భూకంపాలు.. మొదటిది 7.2 తీవ్రత, రెండోది 7.5 తీవ్రతతో సంభవించాయి. మొదటి భూకంపం వల్ల ఏర్పడిన భూపటల స్థానభ్రంశం, దాని పక్కనే ఉన్న మరో ఫాల్ట్ లైన్‌పై ఒత్తిడిని ఒక్కసారిగా పెంచింది.
దీనివల్ల మొదటి భూకంప తీవ్రతకు బలహీనపడిన భవనాలు, రెండో భూకంప దెబ్బకు పూర్తిగా కుప్పకూలిపోయాయి. ఈ భూకంపాలు భూమి ఉపరితలానికి కేవలం 10 నుంచి 22 కిలోమీటర్ల లోతులోనే సంభవించాయి. భూకంప కేంద్రం భూమికి ఇంత దగ్గరగా ఉండటం వల్ల, అది విడుదల చేసిన వినాశకర శక్తి ఏమాత్రం తగ్గకుండా నేరుగా నగరాలపై తీవ్ర ప్రభావం చూపించింది.
సాధారణంగా వందేళ్లకు ఒకసారి లేదంటే అత్యంత అరుదుగా మాత్రమే ఇలాంటి తీవ్ర స్థాయి జంట భూకంపాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనల్లో సాధారణంగా మొదటి భూకంపం తర్వాత భూగర్భ ఒత్తిడి సమీప ఫాల్ట్‌లకు బదిలీ అవుతుంది. ఆ ఒత్తిడి వెంటనే విడుదలైతే రెండో పెద్ద భూకంపం సంభవిస్తుంది. ఇండోనేషియా, ఇరాన్, అమెరికాలోనూ ఎర్త్‌క్వేక్ డబ్లెట్ చోటు చేసుకున్నాయి. అయితే వెనిజువెలాలో ఈసారి కేవలం 39 సెకన్లలోనే రెండు భారీ ప్రకంపనలు రావడం భూమి లోపల ఉన్న ఒత్తిడి ఎంత అస్థిరంగా ఉందో చూపిస్తోందన్నారు శాస్త్రవేత్తలు.




