OFF The Record: రజనీ పాలిటిక్స్.. ఎన్నికకో నియోజకవర్గం.. సీటుకో సామాజిక వర్గం?
OFF The Record: 2019లో గెలిచి 2024లో ఓడిన మాజీ మంత్రి విడదల రజనీ.. చిలకలూరిపేటలో భవిష్యత్తులో ఏ సామాజిక వర్గం కార్డుతో బరిలోకి దిగుతారనే దానిపై చర్చ నడుస్తోంది.
OFF The Record: రజనీ పాలిటిక్స్.. ఎన్నికకో నియోజకవర్గం.. సీటుకో సామాజిక వర్గం?
OFF The Record: ఆవిడ మనందరికీ తెలిసిన వారే. మాజీమంత్రి విడదల రజనీ. ఇప్పుడు మరోసారి వివాదాల రజనీగా తెర మీదకు వచ్చారు. రజనీ టీడీపీ నుంచి వైసీపీలో చేరి తాను బిసి మహిళను అంటు 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసి గెలుపొందారు.
ఆ ఎన్నికల్లో బీసీ వర్గంతో పాటుగా భర్త సామాజిక వర్గమైన కాపు ఓట్లను సంపాదించుకున్నారు. మరోవైపు బిసి సంఘాల దగ్గరికి వెళ్ళి తాను బీసీ వర్గానికి చెందిన మహిళనని బిసిల మద్దతుతో ఆ ఎన్నికలో తన రాజకీయ చతురత ప్రదర్శించి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించారు.
కాగా 2024 ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో మరోసారి బీసీ కార్డుతో గుంటూరు వెస్ట్ కు వెళ్లారు. అక్కడ టీడీపీ నుంచి మరో బీసీ మహిళా నేత చేతిలో ఓడిపోయారు విడదల రజినీ. చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన సమయంలో బీసీ- కాపు వర్గం ఓట్ల కోసం చేయాల్సిన అన్నీ ప్రయత్నాలు చేశారు విడదల రజినీ.
క్యాస్ట్ కార్డుతో పాటు.. వైసీపీ వేవ్ పని చేసి 2019లో విజయం సాధించారు. 2024లో అదే బీసీ కార్డుతో నియోజకవర్గం మారి మరీ పోటీ చేసారు. బీసీ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసారు. తాను బీసీ బిడ్డని అంటూ ప్రజల ముందుకు వెళ్లారు.
అయితే అక్కడ బీసీ కార్డు బెడిసికొట్టింది. 2024లో గుంటూరు వెస్ట్‌లో ఓటమి తరువాత తిరిగి చిలకలూరిపేటకు వచ్చారు రజినీ. మంత్రిగా ఉన్న సమయంలో చిలకలూరిపేటకు చెందిన ఎంతో మందిని మోసం చేసారని రజినీపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి.
కేసులు సైతం నమోదయ్యాయి. కొందరిని అరెస్ట్ చేసారు కూడా. ఇప్పటికీ ఆ కేసులు కోర్టుల్లో కొనసాగుతున్నాయి. ఇక.. ఇప్పుడు అనేక వివాదాలు.. పార్టీ మద్దతుదారుల నుంచి ఆదరణలేక రాజకీయంగా రజనీ సతమతం అవుతున్నారు.
వచ్చే ఎన్నికల కోసం రజనీ చిలకలూరిపేట నుంచి పోటీకి సిద్దం అవుతున్నారు. రజనీ రాజకీయ విన్యాసాలతో పార్టీ కేడర్ సైతం దూరంగా ఉంటోంది. పార్టీతో సంబంధం లేని వారికి ప్రాధాన్యత ఇస్తూ.. పార్టీని నమ్ముకున్న వారిని దూరం పెడుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు రజినీ.
దీంతో రాబోయే 2029 ఎన్నికల్లో విడదల రజనీ.. తన భర్త కాపు సామాజిక వర్గం కార్డుతో వెళ్తారా...లేక మరోసారి తన బిసి కార్డుతో వెళ్తారా అనే చర్చ నియోజకవర్గంలో మొదలైంది. బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా ఎమ్మెల్యే అయి.. అదే కార్డుతో మంత్రి అయ్యారు.
అయినా.. బీసీలకు చేసింది మాత్రం ఏం లేదు. ఇప్పుడు ఆ బీసీలు అందరూ రజనీకి దూరం అయ్యారు. బీసీలను పట్టించుకోని రజనీ కోసం తాము పని చేయలేమని తేల్చి చెబుతున్నారు. బీసీ వర్గం పేరు చెప్పుకొని రాజకీయం చేసే రజనీ ట్రాప్ లో తాము పడలేమని స్పష్టం చేస్తున్నారు.
మారుతున్న లెక్కలతో రజనీ పూర్తి డైలమాలో పడినట్లు కనిపిస్తోంది. వైసీపీ నాయకత్వం సైతం రజనీకి ఏ కోటాలో పదవులు ఇవ్వాలనే సందేహంతో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికలో మాజీమంత్రి విడదల రజనీ కాపు సామాజిక వర్గమా లేదా బిసి సామాజిక వర్గమా ఏ వర్గం నుంచి బరిలోకి దిగుతారనేది ఆవిడకు అయినా స్పష్టత ఉందంటారా.. చూద్దాం ఈ సారి ఏ విన్యాసాలు చేస్తారో.




