Off The Record: విజయసాయి కొత్త పార్టీ.. పేరు ఏంటి? గుర్తు ఏంటి?
Off The Record: వైయస్సార్‌కాన్వాస్ పార్టీకి దూరమైన విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. బీజేపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Off The Record: విజయసాయి కొత్త పార్టీ.. పేరు ఏంటి? గుర్తు ఏంటి?
Off The Record: విజయసాయిరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కొంతకాలంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీకి దూరమైన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరుతారన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. బీజేపీలో చేరే అవకాశం ఉందని కూడా ప్రచారం సాగింది. అయితే ఈ ఊహాగానాలకు విజయసాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు.
బీజేపీలో చేరే ఆలోచన తనకు లేదని తేల్చి చెప్పడం ద్వారా పార్టీ చేరికపై వస్తున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. అయితే అదే సమయంలో.. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండబోనన్న సంకేతాన్ని కూడా ఆయన ఇచ్చారు. పైగా కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయబోతున్నట్లు చెప్పడం ఆసక్తికరంగా మారింది.
మూడు, నాలుగు నెలల్లో రాజకీయ పార్టీని ప్రకటిస్తానని చెప్పడంతో.. ఆ పార్టీ స్వరూపం ఎలా ఉండబోతోంది..? విధి విధానాలు ఏమిటి? ఎవరెవరు ఆయనతో కలిసి వస్తారు..? ఏ సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి...
విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో మరో కీలక అంశం.. ప్రస్తుత రాజకీయ పార్టీలపై ఆయన చేసిన విమర్శలు. టీడీపీ, వైసీపీతో పాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో తాను చెబుతానని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రాజకీయాల్లో మతం పేరుతో జరుగుతున్న వ్యవహారాలపైనా మాట్లాడతానని స్పష్టం చేశారు.
మత రాజకీయాలను పార్టీలు ఎలా ప్రోత్సహిస్తున్నాయో వివరిస్తానన్న ఆయన వ్యాఖ్యలు.. కొత్త పార్టీ రాజకీయ సిద్ధాంతానికి ఒక క్లూ ఇస్తున్నాయా అన్న చర్చ మొదలైంది. ఇప్పటి వరకు ఏపీలో ప్రధాన రాజకీయ పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే కొనసాగింది. జనసేన, బీజేపీ కూటమి రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మరో రాజకీయ పార్టీ రంగంలోకి వస్తే.. అది ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా విజయసాయిరెడ్డికి ఉన్న రాజకీయ అనుభవం, వైసీపీలో ఆయనకు ఉన్న పరిచయాలు, ఢిల్లీలో ఉన్న రాజకీయ సంబంధాలు కొత్త పార్టీ నిర్మాణంలో ఎంతవరకు ఉపయోగపడతాయన్నది చూడాల్సి ఉంటుంది...
అయితే కొత్త పార్టీ ప్రకటించడం ఒక ఎత్తయితే.. దానిని సంస్థాగతంగా నిర్మించడం మరో ఎత్తు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీని నిర్మించాలంటే భారీ స్థాయిలో కేడర్ అవసరం. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నాయకత్వ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే బలమైన రాజకీయ పార్టీలతో పోటీ పడాలంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ వనరులు కూడా అవసరం. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి పార్టీ నిర్మాణానికి ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. కొత్త పార్టీ ఏర్పాటుపై విజయసాయిరెడ్డి ఇప్పటివరకు పూర్తి వివరాలను వెల్లడించలేదు.
పార్టీ పేరు ఏమిటి? గుర్తు ఏమిటి? సిద్ధాంతం ఏమిటి? ఎవరిని కలుపుకుని ముందుకు వెళ్తారు? ఎన్నికల రాజకీయాల్లో ఎలాంటి విధానాన్ని అవలంబిస్తారు? అన్న అంశాలపై త్వరలోనే వివరిస్తానని ఆయన చెబుతున్నారు. అంటే ప్రస్తుతం పార్టీ నిర్మాణానికి సంబంధించిన కసరత్తు అంతర్గతంగా జరుగుతున్నట్టుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విజయసాయిరెడ్డి రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే.. వైసీపీలో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఢిల్లీ రాజకీయాల్లో పార్టీ వాణిని బలంగా వినిపించిన నేతగా గుర్తింపు పొందారు. వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా కూడా ఆయనకు ఒక దశలో గుర్తింపు ఉంది.
రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర రాజకీయాల్లో కీలక అంశాలను ప్రస్తావించారు. అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం సహజంగానే ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కొత్త పార్టీ ద్వారా ఆయన ఎవరిని టార్గెట్ చేస్తారన్నదే అసలు ప్రశ్న.
టీడీపీ, వైసీపీ రెండింటినీ విమర్శిస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు. అంటే కొత్త పార్టీని సంప్రదాయ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ప్రజెంట్ చేసే అవకాశం కనిపిస్తోంది. మత రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడతానన్న వ్యాఖ్యలు కూడా పార్టీకి ఒక ప్రత్యేక రాజకీయ గుర్తింపును తీసుకురావాలనే ఆలోచనలో భాగమా అన్న చర్చ సాగుతోంది.
ఇక్కడ మరో కీలక అంశం.. వైసీపీకి చెందిన మాజీ నేతలు, అసంతృప్తులు, రాజకీయంగా ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న నాయకులను విజయసాయిరెడ్డి తనవైపు తిప్పుకోగలరా అన్నది ప్రశ్న. వైసీపీ నుంచి బయటకు వచ్చిన లేదా భవిష్యత్తుపై స్పష్టత లేని నేతలు కొత్త పార్టీ వైపు చూస్తారా?
లేక తమకు అందుబాటులో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ వంటి ప్రధాన పార్టీల్లోనే రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటారా? అన్నది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతానికి మాత్రం విజయసాయిరెడ్డి మాటలు.. ‘బీజేపీలోకి వెళ్లడం లేదు.. వైసీపీలోకి తిరిగి వెళ్లడం లేదు.. కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నాను’ అనే సంకేతాన్ని ఇస్తున్నాయి.
అయితే ప్రకటన చేయడం కంటే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం, ఎన్నికల్లో ప్రభావం చూపించడం అసలు సవాలు... మూడు, నాలుగు నెలల్లో పార్టీని ప్రకటిస్తానన్న విజయసాయిరెడ్డి.. త్వరలోనే విధివిధానాలను కూడా వెల్లడిస్తానని చెబుతున్నారు.
దీంతో రాబోయే నెలల్లో ఆయన ఎవరెవరితో భేటీ అవుతారు? ఏ ప్రాంతాలపై దృష్టి పెడతారు? ఎలాంటి రాజకీయ ఎజెండాను ముందుకు తెస్తారు? అన్నది కీలకంగా మారనుంది. ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే ఉన్న ద్విముఖ, త్రిముఖ పోటీకి మరో రాజకీయ ప్రత్యామ్నాయం వస్తుందా..? లేక కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితమవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన చేస్తే.. అది వైసీపీకి నష్టం చేస్తుందా? అధికార కూటమి ఓట్లను ప్రభావితం చేస్తుందా? లేక కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వర్గాలకు వేదికగా మారుతుందా? అన్నదే ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్. ఇప్పటివరకు సంకేతాలు మాత్రమే.. అసలు రాజకీయ చిత్రం మాత్రం పార్టీ ప్రకటన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.




