Off The Record: విజయసాయి రెడ్డి టార్గెట్ ఏమిటి!
Off The Record: దసరా తర్వాత కొత్త పార్టీ ప్రకటిస్తానన్న విజయసాయి రెడ్డి. సీఎం పదవి, బాల్ థాకరేతో పోలికలపై జోరుగా రాజకీయ చర్చ.
Off The Record: విజయసాయి రెడ్డి టార్గెట్ ఏమిటి!
Off The Record: రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అనే మాట వినిపించినప్పుడు.. ముందుగా చర్చకు వచ్చేది పార్టీ పేరు కాదు. ఆ పార్టీకి ఉన్న బలం. నాయకత్వం ఎవరు..? ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది..? కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు..? గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సంస్థాగత నిర్మాణం ఎలా ఉంది..? ఇవే ఒక రాజకీయ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీపై చర్చ మొదలైంది. పార్టీ ఇంకా అధికారికంగా పుట్టకముందే.. ఆ పార్టీ భవిష్యత్తు రాజకీయాలపై ప్రకటనలు రావడం ఆసక్తికరంగా మారింది. ఆ చర్చకు కేంద్రబిందువుగా మారారు మాజీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి.
దసరా తర్వాత కొత్త పార్టీని ప్రకటిస్తానని విజయసాయి రెడ్డి చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయాలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని అంటున్నారు. టీడీపీ, వైసీపీ రాజకీయాలకు భిన్నంగా కొత్త రాజకీయ వేదికను తీసుకొస్తాననే సంకేతాలు ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పార్టీ ఇంకా రూపుదిద్దుకోకముందే దాని రాజకీయ భవిష్యత్తు.. పాలన ఎలా ఉండాలి.. సీఎం ఎవరు కావాలి అనే అంశాలపై చర్చ మొదలుపెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. అసలు ఆ పార్టీకి రూపురేఖలు ఎలా ఉంటాయి..? ఎవరెవరు ఆయన వెంట నడుస్తారు..? ప్రజల్లో ఎంతవరకు ఆదరణ లభిస్తుంది..? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.
కొత్త పార్టీకి నిజమైన బలం ప్రకటనల్లో ఉండదు. ప్రజల్లో ఉంటుంది. నాయకుడు ఒక ప్రకటన చేస్తే పార్టీ తయారైపోదు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు కావాలి. ప్రతి నియోజకవర్గంలో బలమైన నాయకత్వం కావాలి. బూత్ స్థాయిలో నెట్‌వర్క్ కావాలి. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలి. ఇవన్నీ ఏర్పడినప్పుడే ఒక రాజకీయ పార్టీకి బలం వస్తుంది. బోధి చెట్టు కింద కూర్చుంటే జ్ఞానోదయం రావచ్చు.. కానీ రాజకీయాల్లో మాత్రం ప్రజల మధ్య తిరిగితేనే ప్రజాభిమానం వస్తుంది. పునాది వేయకముందే భవనం ఎన్ని అంతస్తులు ఉంటుందో చెప్పినట్టుగా.. పార్టీ ఏర్పాటుకు ముందే దాని రాజకీయ ప్రభావాన్ని అంచనా వేయడం మాత్రం అంత సులభం కాదంటున్నారు రాజకీయ పండితులు.
ఇక టీడీపీ, వైసీపీలపై విజయసాయి రెడ్డి చేస్తున్న విమర్శలు కూడా రాజకీయంగా ఆసక్తికరంగానే ఉన్నాయి. టీడీపీని రెడ్‌బుక్ పార్టీగా.. వైసీపీని ఫ్యాక్షన్ పార్టీగా అభివర్ణిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్యే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయని.. ప్రజలకు మూడో ప్రత్యామ్నాయం అవసరమని చెబుతున్నారు. అంటే కొత్త పార్టీని కేవలం మరో రాజకీయ పార్టీగా కాకుండా.. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రెండు పార్టీలను విమర్శించడం ఒక ఎత్తయితే.. తాను ఏర్పాటు చేయబోయే పార్టీ ఏం భిన్నంగా చేస్తుందో చెప్పడం మరో ఎత్తు. అదే కొత్త పార్టీకి అసలు రాజకీయ పరీక్షగా మారనుంది.
ఇక్కడే విజయసాయి రెడ్డికి మరో కీలక ప్రశ్న ఎదురవుతోంది. వైసీపీపై ఇప్పుడు విమర్శలు చేస్తున్న ఆయన.. ఆ పార్టీలో తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని ప్రజలకు ఎలా వివరిస్తారు..? నిన్నటి వరకు ఒక రాజకీయ వ్యవస్థలో కీలకంగా పనిచేసిన వ్యక్తి.. నేడు అదే వ్యవస్థలోని లోపాలను చూపిస్తూ కొత్త ప్రత్యామ్నాయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రశ్న సహజంగానే వస్తుంది. “వాళ్లు తప్పు” అని చెప్పడం రాజకీయ విమర్శ మాత్రమే.. కానీ “మేం ఎలా భిన్నంగా ఉంటాం..?” అని నిరూపించడం అసలైన ప్రత్యామ్నాయ రాజకీయానికి కొలమానం. కొత్త పార్టీ బలపడాలంటే ఈ ప్రశ్నకు విజయసాయి రెడ్డి స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిందే.
టీడీపీని .. వైసీపీని విభిన్న రాజకీయాలతో ముడిపెట్టి విమర్శించడం ద్వారా రాజకీయ చర్చ మొదలవుతుంది. కానీ ప్రజలకు కావాల్సింది కేవలం విమర్శించే మరో పార్టీ కాదు. రైతులకు ఏం చేస్తారు..? యువతకు ఏం చేస్తారు..? ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు..? పెట్టుబడులు ఎలా తీసుకొస్తారు..? సంక్షేమం–అభివృద్ధి మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారు..? స్థానిక సమస్యలను ఎలా పరిష్కరిస్తారు..? అనే ప్రశ్నలకు సమాధానం కావాలి. ఎందుకంటే “వాళ్లు కాదు.. మేము” అనే నినాదంతో రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పడదు. “వాళ్లకంటే మేం ఎందుకు మెరుగైన ప్రత్యామ్నాయం..?” అనే విషయాన్ని ప్రజలకు నమ్మించగలిగినప్పుడే అది రాజకీయంగా నిలబడుతుంది.
ఇక తాను బాల్ థాకరే తరహా రాజకీయ నాయకుడినంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా పొలిటికల్ సర్కిల్స్‌లో సెటైర్లు వినిపిస్తున్నాయి. 1966లో శివసేనను స్థాపించి.. అంతకుముందే మార్మిక్ ద్వారా మరాఠీ ప్రజల సమస్యలను కార్టూన్లు, రచనలతో ప్రజల్లోకి తీసుకెళ్లిన బాల్ థాకరే.. మరాఠీ ఆత్మగౌరవాన్ని రాజకీయ ఉద్యమంగా మార్చి.. హిందుత్వ రాజకీయాలతో మహారాష్ట్రలో బలమైన రాజకీయ శక్తిని నిర్మించారు. చివరకు శివసేన అధికారంలోకి వచ్చినా.. బాల్ థాకరే స్వయంగా సీఎం కాలేదు.. కానీ సీఎం ఎవరో నిర్ణయించే స్థాయిలో రాజకీయ ప్రభావం సాధించారు. మరి పార్టీ ఇంకా ప్రకటన దశలోనే ఉన్న విజయసాయి రెడ్డి.. బాల్ థాకరేతో పోల్చుకోవడం ఏంటంటూ ప్రత్యర్థులు చురకలు వేస్తున్నారు. ఇక తమిళనాడులో నటుడు విజయ్ సొంత పార్టీ పెట్టి డీఎంకే, అన్నాడీఎంకేలకు మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నిస్తుండటాన్ని కూడా సాయిరెడ్డి రాజకీయ ప్రయోగంతో పోలుస్తున్నారు. అక్కడ విజయ్‌కు సినీ ఇమేజ్, భారీ అభిమానుల బలం ఉన్నాయి. ఇక్కడ సాయిరెడ్డికి పార్టీనే ఇంకా లేదు.. కేడర్, క్షేత్రస్థాయి నిర్మాణం ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నారు. విజయ్ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లారు. సాయిరెడ్డి మాత్రం పార్టీ పెట్టకముందే సీఎం కుర్చీపై చర్చ మొదలుపెట్టారంటూ సెటైర్లు పేలుతున్నాయి. బాల్ థాకరేలా రాజకీయ శక్తిని నిర్మించాలన్నా.. విజయ్‌లా మూడో ప్రత్యామ్నాయం చూపించాలన్నా.. ముందుగా ప్రజల్లో పునాది కావాలి. చివరికి ఆ పునాదికి బలం ఉందో లేదో తేల్చేది ఓటరే.
చివరికి విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ ప్రయోగానికి అసలు పరీక్ష మీడియా సమావేశాల్లోనో.. సోషల్ మీడియాలోనో ఉండదు. పోలింగ్ బూత్‌లో ఉంటుంది. ఎంత పెద్ద ప్రకటన చేసినా.. ఎంత ఘాటుగా విమర్శించినా.. అది ప్రజల ఓటుగా మారితేనే రాజకీయ శక్తిగా మారుతుంది. అందుకే “ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం” అన్న సామెతతోపాటు మరో ప్రశ్న కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బోధి చెట్టు కింద జ్ఞానోదయం వచ్చిందా..? లేక ప్రజల మధ్యకు వెళ్లిన తర్వాతే అసలు రాజకీయ వాస్తవం తెలుస్తుందా..? పార్టీని ప్రకటించడం ఒక ప్రారంభం మాత్రమే.. ప్రజల నమ్మకాన్ని సంపాదించడం అసలు ప్రయాణం. చివరికి సీఎం ఎవరో నిర్ణయించేది నాయకులు కాదు.. ఓటర్లు.




