Off The Record: బెజవాడ మేయర్ పీఠం దక్కేది ఎవరికి!
Off The Record: విజయవాడ మేయర్ పీఠంపై కూటమి పార్టీల మధ్య ఆసక్తికర పోరు. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక జరగనుండటంతో ఇప్పుడే మొదలైన రాజకీయ లాబీయింగ్, ఆశావహుల ప్రయత్నాలు.
Off The Record: బెజవాడ మేయర్ పీఠం దక్కేది ఎవరికి!
Off The Record: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానం జనసేన పార్టీ ఆశించినప్పటికీ అనూహ్య పరిణామాల మధ్య బీజేపీకి సీటు కేటాయించారు. అప్పుడే విజయవాడ మేయర్ స్థానం జనసేనకు ఇవ్వాలన్న అగ్రిమెంట్ కూడా కుదిరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మేయర్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికల నేపథ్యంలో కూటమి నుంచి పదవి ఆశించే నేతలు ఇప్పటికే ఈ అంశంపై అనుకూల, ప్రతికూల అంశాలపై విశ్లేషణలు చేసుకుంటున్నారు. ఎవరి సమీకరణల్లో వారు తలమునకలై ఉన్నారు. ఏపీ రాష్ట్ర రాజకీయ రాజధానిగా వెలుగొందే విజయవాడ నగర మేయర్ పీఠంకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి విజయవాడ మేయర్ ఎవరు అనే అంశం చర్చకు వస్తోంది. ఇంతవరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకపోయినప్పటికీ ఆశావహులు మాత్రం ఎవరి ప్రయాత్నాలో వారు మునిగి తేలుతున్నారట.
దాదాపు రెండు దశాబ్దాల తరువాత ప్రత్యక్ష పద్ధతిలో మేయర్ ఎన్నిక జరుగనుంది. సాధారణంగా నగరంలోని డివిజన్లలో గెలుపొందిన కార్పొరేటర్లలో ఎవరికైతే మెజార్టీ ఉంటుందో వారిలో నుంచి ఒకరిని మేయర్‌గా ఎన్నుకునేవారు. అయితే ఈసారి మేయర్ స్థానానికి కూడా ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పోటీ పెరుగుతోంది. ప్రజలే నేరుగా మేయర్‌ను ఎన్నుకోనుండడంతో ఈ స్థానానికి కేటాయించే అభ్యర్థి ఎంపికలో పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఎవరికిపడితే వారిని మేయర్ అభ్యర్థిగా నిల్చోబెట్టి చేతులు కాల్చుకునేందుకు ఏ పార్టీలు కూడా సిద్ధంగా లేవు. అయితే తమ పార్టీకే మేయర్ ఇస్తామని ఇప్పటికే ఒప్పందం కూడా జరిగిపోయిందని జనసేన నాయకులు బాహాటంగా ప్రకటిస్తున్నా, ఈ అంశంపై టీడీపీ, బీజేపీ నేతలు మాత్రం స్పందించడం లేదు.
అయితే తమ పార్టీ అధినేత ఆదేశాల మేరకు పనిచేస్తామంటూ పైకి చెబుతున్నా వారు కూడా అంతర్గతంగా మేయర్ స్థానం టీడీపీకి కేటాయిస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కూడా రాష్ట్రంలో పట్టు పెంచుకొనే పనిలో పడింది. ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖపట్నం, విజయవాడ మేయర్ పీఠాలను తమ ఖాతాలో వేసుకోవాలన్న ధృడ నిశ్చయంతో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కూటమిలో కీలక నేతలు ఈ అంశంపై నోరు మెదపకున్నా ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారు.
ప్రత్యక్ష పద్ధతిలో మేయర్ ఎన్నికలు కావడంతో అధికార కూటమిలోని మూడు పార్టీల నేతలు ఎవరికి వారే చాప కింద నీరులా వారి ప్రయత్నాలు ముమ్మరం చేశారట. అయితే ప్రధానంగా జనసేన మాత్రం మేయర్ పీఠం తమదేనంటూ బలంగా చెప్పడమే కాక ఈ మేరకు ఒప్పందం కూడా జరిగిపోయిందని గుర్తుచేస్తున్నారు. దీంతో జనసేన ద్వితీయ శ్రేణి నేతల ఆశలకు రెక్కలు వచ్చాయి. ఎలాగైనా మేయర్ పీఠం అధిష్టించాలని ఎవరికి వారే వారివారి స్థాయిలతోపాటు ఆర్థిక, అంగ బల ప్రదర్శనలకు సిద్ధమవుతున్నారట. ఆ సీటుకు తాము ఎంతవరకు న్యాయం చేయగలమన్న అంశంపై కూడా ఆలోచిస్తూ ఆ దిశగా పావులు కదుపుతున్నారట. పరోక్ష పద్ధతి అయితే మేయర్ అభ్యర్థిపై తీవ్రస్థాయిలో లాబీయింగ్ జరిగేది. అయితే ఇప్పుడు ప్రత్యక్ష పద్ధతి కావడంతో ఇప్పటి నుంచే టికెట్ వార్ ప్రారంభమైపోయింది.
దేశ వ్యాప్తంగా జెన్ జీ ప్రభావంతో సీనియర్ నేతలు వారి వారసులను రంగంలోకి దింపి యువతకే మేయర్ పీఠం ఇప్పించాలన్న ప్రయత్నాలు చేస్తున్నారట టాక్ కూడా లేకపోలేదు. ఇందులోభాగంగా టీడీపీ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తన వారసత్వంగా కొడుకుకు మేయర్ పీఠం కోసం పావులు కదుపుతున్నారట. అదే విధంగా వంగవీటి రాధాకృష్ణ పేరు కూడా టీడీపీ తరఫున ప్రచారంలోకి వస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో మేయర్ పదవి ఇస్తే ఎలా ఉంటుందో అని అధిష్టానం ఆలోచనగా ఉందట. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీతో రాధా భేటీలో ఈ అంశం ప్రస్తావించినట్లు సమాచారం. ఏదిఏమైనప్పటికీ విజయవాడ మేయర్ పీఠం ఎన్నిక గరంగరంగా జరగనుంది. చివరకు కూటమిలో ఏ పార్టీ విజయవాడ మేయర్ పీఠాన్ని దక్కించుకోనుందోనన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.




