Jordar Varthalu: ఇది దయ్యం మహిమ కాదు.. మనిషి చేసిన మహిమే

Jordar Varthalu: టెక్నాలజీ సృష్టించిన వింతలు! సూరత్‌లో రిమోట్ కంట్రోల్‌తో నడిచే దయ్యం సైకిల్, తమిళనాడు ఎన్నికల్లో సందడి చేసిన రోబో ఆఫీసర్లు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 April 2026 7:44 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: ఇది దయ్యం మహిమ కాదు.. మనిషి చేసిన మహిమే

Jordar Varthalu: వామ్మో.. పట్టపగలే గుబులు వట్టిత్తున్నడు గదా గీ సగం మన్షి. అద్దుమరాత్రి సూత్తె అద్దనకుంట దయ్యమే అంటరు ఎవ్వలైనా. ఇది కలనా.. నిజమా.. మూడు శెక్రాల సైకిల్ను తొక్కుతున్నది దయ్యమా.. భూతమా.. అని అన్మానపడ్తె పక్కా తప్పుల కాలేశ్నట్టే అయితదుల్లా. ఏఐ వీడియో కాదు కని, ఆర్టిఫిషల్ ఇంటజెల్సినును వాడి తయార్జేశ్న ఘోస్టు సైకిలేనుల్లా గిది. సూరత్ దిక్కుండే శివమ్ మౌర్యా అనే యూత్ పిలగాడు.. కొత్తయి కనిపెట్టి పేరెల్లాల్నని, ఈ సగం మన్షిని కనిపెట్టి సైకిల్ తొక్కిచ్చిండు. దీన్ని తయార్జేశెతందుకు మూన్నెల్లు దోస్తులతోని కల్శి తిప్పలు వడ్డడట. 35వేల రూపాలు ఖర్సువెట్టిండట. ఫోన్ తోని, రిమోట్ కంట్రోల్తోని ఎటంటె అటు తిప్పుతడట. సైకిల్కు ముంగటేదన్న అడ్డమస్తె, మనలెక్క హారన్ కొట్టి ఆన్నే నిల్సోకుంట పక్కకెంచి పోతదట. ఈ మాయా సైకిల్ను సూరత్ల సడక్ల మీదికి ఎక్కిచ్చుడ్తోనే షాకైశేకైతాన్రు అక్కడి పబ్లికు. వీడియోలు తీసుకుంట, వీడియోకాల్ల మందికి సూపెట్టుకుంట సంబురపడ్తున్నరు. బువ్వతినమని ఏడ్శే శిన్నపిలగాండ్లకు ఈ సైకిల్ దయ్యాన్ని సూపెట్టి భయపెడ్తుండొచ్చు. గీడ ఇట్లుంటె.. తమిళనాడోల్లు సూడుర్రి రోబోలను ఏ తీర్ల వాడిర్రో.

వారెవ్వా.. పంచెకట్టుల అదిరిపోయిండు గదా రోబో ఆఫీసరు. తమిళనాడు దిక్కు వేలూరు కాడ నిన్నైన ఓట్ల పండుగల సంప్రదాయ బట్టలల్ల సంప్రదాయబద్దంగ కానొచ్చిండు గీ మరమనిషి. మరి ఆకాశంల సగం అవకాశాల్ల సగం అయిన మహిళలం మేమేమన్న తక్వా అని నీలా అనే ఇంకో రోబో లంగావోణీల మెర్శిపోయింది. ఇగాడ ఉత్తగ ఉండకుంట, ఓటర్లకు వెల్కం జెప్పినయ్. పోలింగ్ స్లిప్పులు సప్లై జేశ్నయ్. ఓటర్లను జప్పున రమ్మని ప్రశారం జేశ్నయ్. శిన్నపిలగాండ్లకు శాక్లెట్లిచ్చినయ్. వాల్ల తిప్పలర్సుకొని, వందశాతం వోటింగ్కు తమవంతు కృషి జేశ్నయ్. ఎండ దెబ్బ తాకకుంట ఎట్ల సల్లగుండాల్నో కుద్దుగ జెప్పినయ్ గీ రోబోలు. టెక్నాలజీని జనాలకు అల్వాటు జేశెతందుకు ఈ పన్జేశ్నమని అక్కడి అధికార్లంటున్నరు కని, ఈ రోబోల శేత అధికారపక్షానికి ఓట్లు గుద్దిచ్చేరని సెటైర్లెయ్యవట్టిర్రు ప్రతిపక్షపు లీడర్లు. ఇప్పటికైతే పర్యవేక్షణ బాధ్యతలే అప్పజెప్పిర్రు కని, రేపు రేపు మన్షులతోని పనిలేకుంట రోబోలే ఓటింగ్ నడ్పిచ్చే జమానా అస్తది కావచ్చని పర్శాన్ కావట్టిర్రు రోబోల ముచ్చట సూశ్న జనాలు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story