Off The Record: కూటమిలో కొత్త చిచ్చు?
Off The Record: విజయనగరంలో జనసేన కార్యాలయ నిర్మాణం వివాదాస్పదమైంది. వివాద భూమిలో ఏర్పాట్లు, కూటమి నేతల విభేదాలు, ఎమ్మెల్యే జోక్యంపై చర్చ సాగుతోంది.
Off The Record: కూటమిలో కొత్త చిచ్చు?
Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కూటమిలో టిక్కెట్ల టికెట్ల పంచాయితీ కంటే ముందు అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయట. ముఖ్యంగా విజయనగరంలో కూటమి నేతలు బయటకు చెట్టాపెట్టాలేసుకుని తిరుగుతుంటారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటారు. కాస్తో కూస్తో నాయకులూ కాంట్రాక్టు పనులు చేయించుకుంటున్నారన్న టాక్ లేకపోలేదు. ఐతే ఇదంతా బయటకి కనిపించే కృత్రిమ సీన్ మాత్రేనన్న చర్చ రాజకీయ పరిశీలకుల్లో బలంగానే వినిపిస్తోంది. నగరంలోని జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణం చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీ కార్యాలయం నిర్మాణం పేరుతో కొందరు జనసేన నాయకులు తమ పంథాను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
ఇటీవలే నగరంలో ఓ స్థల వివాదంలో జనసేన నాయకుడొకరు విమర్శల పాలయ్యారట. ఓ స్థలం చదును చేయించి తన్నులు తిన్నారని టాక్. అయితే అది లోకల్ వివాదంగా కూడా చెప్పుకుంటున్నారు. కానీ, దీనిని కప్పిపుచ్చుకునేందుకు జనసైనికులు కొత్త ప్లాన్‌కు తెరపైకి తెచ్చారట. జనసేన పార్టీ కార్యలయం అక్కడకు సమీపంలో ఉన్న స్థలంలో నిర్మించి.. అనుగుణంగా ఈ స్థలాన్ని ఏదోలా మడతపెట్టాలని ఆలోచన చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇది ఆ పార్టీలో ఉన్న నాయకులే ప్రచారం చేస్తున్నారట. ఆ స్థలం రాజావారిదా.. ప్రభుత్వానిదా.. కార్పొరేషన్ పరిధిలోకి వస్తుందా.. అన్న అంశంపై ఇప్పటికే వివాదం నడుస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో వివాదాస్పద స్థలానికి సమీపంలో జనసేన పార్టీ కార్యాలయం నిర్మించేందుకు ఓ స్థానిక జనసేన నాయకుడు ప్రయత్నాలు ప్రారంభించారన్న ప్రచారం అయ్యేలా ఒక వర్గం చేసిందట. కార్యాలయ నిర్మాణానికి ముందుగా బోరువెల్ వేయించే పనులకు సిద్ధమయ్యారట. ఈ విషయంపై కొందరు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందన్న టాక్ నడుస్తోంది. దీంతో కొందరు పావులు కదిపి కార్పొరేషన్ సిబ్బందిని అక్కడికి రప్పించారట. అధికారులు అక్కడికి చేరుకుని పనులను నిలిపివేశారన్న ప్రచారం.. రాజకీయంగా మరింత కాక రేపుతోంది...
అసలు పనులు ఆపించడం వెనుక అసలు కథ ఏంటన్నదే ప్రధాన ట్విస్ట్ అంటున్నారు. వివాదాస్పద స్థలాలు కోర్టు పరిధిలో ఉన్నాయన్న కారణంతోనే అధికారులు జోక్యం చేసుకున్నారన్న వాదన ఒకవైపు వినిపిస్తోంది. మరోవైపు ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీకి చెందిన కీలక నేతల జోక్యం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే పేరు ఈ వ్యవహారంలో బలంగా వినిపిస్తోందట. ఎవరి భూములు కాజేయ్యాలని చూస్తున్నారంటూ ఇలా వాళ్ల వ్యూహానికి బ్రేక్ వేశారన్న టాక్ నడుస్తోంది. తొలుత పార్టీ కార్యలయం అని చెప్పి.. ఆ స్థలంలో ఓ అడుగు వేయాలన్న ఆలోచనలేనని సదరు ఎమ్మెల్యే గ్రహించారట. అందుకే ఆదిలోనే అడ్డుకుంటే సరి.. అన్నవిధంగా చక్రం తిప్పారన్న వాయిస్ బలంగా వినిపిస్తోంది.
అయితే.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. వివాదం పెద్దదయ్యాక పనులను అడ్డుకున్నారా..? లేక మొదటి నుంచే తెరవెనుక పావులు కదిలాయా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని అడ్డం పెట్టుకుని స్థలాన్ని దక్కించుకునే ప్రయత్నం జరుగుతోందన్న ప్రచారం స్థానికంగా గట్టిగానే వినిపిస్తోంది. ఇదంతా ఎవరి ప్రయోజనం కోసం.. ఎవరి కనుసన్నల్లో.. ఎవరి ఆదేశాలతో.. అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ.. దుమారం రేపుతోంది.
స్థానిక నాయకుడి వ్యవహారశైలిపై ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఒకవైపు భూవివాదం.. మరోవైపు పార్టీ కార్యాలయం.. ఇంకోవైపు కూటమి నేతల మధ్య అనుమానాలు. విజయనగరంలో జనసేన కార్యాలయ వ్యవహారం ఇప్పుడు కూటమిలో కొత్త తుఫాన్‌కు కారణమవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అసలు జనసేన పార్టీ నిర్మాణమే జిల్లాలో అంతంతగా ఉంది. ఇక్కడ పార్టీ ఆఫీసు కడితే నిర్వహణా బాధ్యతలు ఎవరు చూస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందు సభ్యత్వాలను పెంచి పార్టీని క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లి.. తరవాత కార్యాలయం ఊసు తీసుకొస్తే మంచిదని కొందరి అభిప్రాయమట. ఇల్లు కట్టిన చోటే గోడలు పెడితే.. పక్కింటితో పంచాయితీ తప్పదన్నట్లు పార్టీ కార్యాలయం కోసం మొదలైన ప్రయత్నం.. కూటమి రాజకీయాల్లో కొత్త మంటలు రాజేస్తోందా..? అసలు ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారు..? స్థలం విషయంలో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత..? పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన భూ విషయంలో అధికారిక పత్రాలు ఏం చెబుతున్నాయి..? ఇవన్నీ సదేహాలేనట.
మొత్తమ్మీద ఆ వివాదాస్పద స్థలం ఇప్పుడు కూటమి మధ్య చిచ్చు పెట్టిందని చెప్పుకుంటున్నారు. అలాగే వ్యక్తిగత వివాదాలను ఇలా పార్టీలకు అంటగట్టడం సరైనదేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి దీనిని కూటమి నేతలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.




