Off The Record: ఈ బ్రదర్స్ కు భరోసా ఇచ్చేదెవరు?

Off The Record: విజయనగరం రాజకీయాల్లో అవనాపు విజయ్, విక్రమ్ మరియు గురాన అయ్యలు వంటి యువ నాయకుల భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 May 2026 12:09 PM IST
Off The Record
X

Off The Record: ఈ బ్రదర్స్ కు భరోసా ఇచ్చేదెవరు?

Off The Record: విజయనగరం రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగిన నాయకులు ఇక్కడ ఉండడం ఓ విశేషం. వారిని అడుగడుగునా అణువణువునా అనుసరిస్తూ పట్టణ రాజకీయాలలో తమకంటూ ఓ స్థానం దొరకక పోతుందా..? అంటూ ఆ నాయకుల వెంట ఇంతవరకు నడిచారు. నడుస్తూ ఉన్నారు. అయినా.. వారికి కావలసిన బ్రేక్ దొరకడం లేదట. వీరే అవనాపు, గురాన కుటుంబాల వారసులు. అందరూ అయ్యో పాపం అనేవారే తప్పా, వారిని చేయి పట్టుకుని ఓ స్థానంలో కూర్చోబెట్టే వారే లేకపోవడం చర్చనీయాంశం. అవనాపు కుటుంబ విషయానికి వస్తే దివంగత సూరిబాబు అంటే తెలియని నగరవాసులు ఉండరంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. మద్యం వ్యాపారి అయినా ప్రజలతో మమేకమవుతూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఆనాడే సంపాదించుకున్నారు సూరిబాబు. తొలినాళ్ళలో తెలుగుదేశం పార్టీకి కరడుగట్టిన కార్యకర్త అనేదానికన్నా మంచి నాయకుడిగా బంగ్లాలో మసలుతూ వచ్చారు. ఎన్నేళ్లు ఊడిగం చేసినా ఆయనకు బంగ్లాలో సముచిత స్థానం దక్కలేకపోవడం చివరకు ఆయన పార్టీని విడిచి, రాష్ట్రంలోనే బలమైన నాయకుడుగా ఎదుగుతున్న కాంగ్రెస్ పార్టీ నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నాటి నుంచి బొత్స సత్యనారాయణ, కోలగట్ల వీరభద్రస్వామితో సన్నిహితంగా మసులుతూ అనేక ఎన్నికలలో తన సహకారాన్ని అందిస్తూ విజయనగరంలో తన మార్క్‌ను విస్తరించుకున్నారు. 2005 మున్సిపల్ ఎన్నికలలో సూరిబాబు రెండున్నర ఏళ్లపాటు మున్సిపల్ చైర్మన్‌గా ఓ వెలుగు వెలిగారు. అకస్మాత్తుగా ఆయన మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అయ్యింది. ఆ తర్వాత మొదటి సారిగా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ పార్టీ పెట్టాక జిల్లాలో అందరికన్నా ముందుగా జగన్ చేయిని పట్టుకున్నది ఆ కుటుంబమే. దీంతో సూరిబాబు వారసులు అవనాపు విజయ్, విక్రమ్‌కు జగన్ పార్టీలో చేరదీశారు. ఇదిలా కొనసాగుతున్న రోజుల్లోనే ఉవ్వెత్తిన ఎగసిపడిన జగన్ అభిమానం చెంతన చేరారు నాటి కాంగ్రెస్ పెద్దలు.

ఐతే ఇక్కడి నుంచే అవనాపు బ్రదర్స్‌కు చీకటి రోజులు మొదలయ్యాయట. ఫలితంగా ఆ పార్టీలో ఇద్దరు సోదరులు కూడా పెద్దగాఎదగలేకపోయారు. చిట్టచివరి రోజుల్లో అవనాపు విక్రమ్ భార్య అవనాపు భావనను డీసీఎంఎస్ చైర్మన్ పదవిని ఇచ్చి కొంతలో కొంత మాట నిలబెట్టుకున్నారు ఆనాటి సీఎం జగన్. తర్వాత జరిగిన పరిణామాలలో తెలుగుదేశం పార్టీ చెంతకు అవనాపు విజయ్.. జనసేన చెంతకు అవనాపు విక్రమ్ చేరిపోయారు. ఆయా పార్టీలలో చేరారన్న మాటే గానీ పార్టీలో వీరికి అక్కడ కనీస గుర్తింపూ గౌరవం లభించలేదట. అధినాయకులు దృష్టిలో వారు లేరనే వాదన స్థానికల్లో బలంగా వినిపిస్తోంది. అలాగని జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టేంత బలం గాని, బలగం గానీ లేకపోవడం ఓ మైనస్ అంటారు రాజకీయ విశ్లేషకులు. అవనాపు విక్రమ్ తనంతట తానుగా జనసేన పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారు. కానీ ఇక్కడ మరోనేత పాలవలస యశస్వి తన కంటే.. పార్టీలో ముందువరసలో ఉండటం విక్రమ్ ఎదుగుదలకు అడ్డంకి అనే వాయిస్ వినిపిస్తోంది. మరో బ్రదర్ విజయ్ విషయానికి వస్తే అడపాదడపా బంగ్లాలో కనిపించడం తప్పా ఆయనను యువ నాయకుడుగా గాని, పట్టణ నాయకుడిగా గానీ గుర్తించే వారే లేరనే టాక్ ఉంది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో విజయ్ ఉన్నారట.

విజయనగరంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆనాడు గరాన సాధూరావు బంగ్లా చుట్టూ తిరిగేవారు. ప్రముఖ వ్యాపారవేత్తగా ఆయన ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ బంగ్లా నాయకులు ఆయనను అంతగా గుర్తించే వారు కాదని, ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. దాంతో సాధూరావు టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ చెంతన చేరి.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చినా.. ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన వారసుడిగా గరాన అయ్యలు నేడు యువ నాయకుడుగా జనసేన పార్టీకి కొమ్ము కాస్తున్నారు. అయినా పవన్ కళ్యాణ్ ఏనాడూ ఆయనను గుర్తించడం గాని, పార్టీ పదవి ఇవ్వడం గానీ వంటి చర్యలు చేపట్టలేదట. అడపాదడపా జనసేన పార్టీ కార్యక్రమాలు చేపట్టడమే తప్పా పార్టీ అధిష్టానం మాత్రం అయ్యలకు సముచిత స్థానం కల్పించలేదన్న టాక్ లేకపోలేదు. నియోజకవర్గంలో ఆయన సామాజికవర్గం ఎంతో బలీయమైనది. అయినా ఆయనను ఆ స్థాయిలో ఎవరూ చూడడం లేదట. విచిత్రం ఏంటంటే.. గతంలో వీరి తండ్రుల వారసత్వం లాగానే.. ఈ రెండు కుటుంబాల యువ నేతలు నేడు నైరాశ్యంలో ఉన్నాయట.

ఇదిలా‌ ఉండగా త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ ఎన్నికలలోనైనా ఆయా ప్రధాన రాజకీయ పార్టీ అధినేతలు ఈ యువ నేతలను ఏ స్థానంలో నిలబడతారో.. అసలు చూస్తారో... చూడరో... అన్న చర్చ నగరవ్యాప్తంగా జరుగుతోంది. ఏది ఏమైనా సుదీర్ఘ రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న ఈ యువ నేతలకు ఇప్పటికైనా మంచి రోజులు వస్తాయా... లేక.. అలానే ఉండిపోనున్నారా.. అన్నది తేలాల్సి ఉంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story