Off The Record: విజయనగరంలో మేనమామ స్క్రీన్‌ ప్లే!

Off The Record: విజయనగరం జిల్లా జెడ్పీటీసీ పోరులో బొత్స కుటుంబ సభ్యులు, మజ్జి శ్రీను కుమార్తె సిరి సహస్ర బరిలోకి దిగడంతో రాజకీయం తీవ్ర ఉత్కంఠగా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 Oct 2026 7:57 AM IST
Off The Record
X

Off The Record: విజయనగరంలో మేనమామ స్క్రీన్‌ ప్లే!

Off The Record: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పరిచయం అక్కరలేని వ్యక్తి బొత్స సత్యనారాయణ. అభిమానులు ఆయనను ముద్దుగా సత్తిబాబు అని పిలుచుకుంటారు. తన రాజకీయ ప్రస్థానంలో కుటుంబ సభ్యుల పాత్ర కీలకంగా ఉంటూ వచ్చింది. ముఖ్యంగా మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుకు ఆయన ప్రాధాన్యం ఇచ్చేవారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది.

విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల్లో చిన్న శ్రీను కీలకంగా వ్యవహరించడంతో ఆయనకు ప్రత్యేక వర్గం ఏర్పడిందన్న చర్చ కూడా ఉంది. అయితే, అనూహ్యంగా చిన్న శ్రీను పార్టీ మారడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. ఇన్నాళ్లూ తనకు సన్నిహితంగా ఉన్న నాయకుడు మరో పార్టీలోకి వెళ్లడం.. ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కొత్త పరిణామాలకు దారితీసింది. దీంతో తన రాజకీయ పట్టు, పార్టీ శ్రేణుల్లో ప్రభావం ఎంతమేర కొనసాగుతోందో నిరూపించుకోవాల్సిన పరిస్థితి బొత్సకు ఎదురైందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో బొత్స కుటుంబ సభ్యులు పలు నియోజకవర్గాల పరిధిలోని మూడు జెడ్పీటీసీ స్థానాల్లో బరిలోకి దిగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గరివిడిలో కోడలు పూజిత, గుర్లలో చెల్లెలు వెంకటలక్ష్మి, బొండపల్లిలో కుమార్తె అనూషతో నామినేషన్లు వేయడం వెనుక రాజకీయ లెక్కలున్నాయన్న చర్చ జరుగుతోంది. ఒకే నియోజకవర్గానికి పరిమితం కాకుండా చీపురుపల్లి, గజపతినగరం ప్రాంతాల్లో కుటుంబ సభ్యులను రంగంలోకి దించడం ద్వారా విస్తృత రాజకీయ ప్రభావాన్ని కొనసాగించాలన్న ప్రయత్నంగా కొందరు విశ్లేషిస్తున్నారు.

ఇది కేవలం కుటుంబ సభ్యులకు రాజకీయ అవకాశాలు కల్పించడమా..? లేదా చిన్న శ్రీను పార్టీ మార్పు తర్వాత తన ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నమా..? అన్న చర్చకు తెరలేచింది. రాజకీయాల్లో వ్యక్తుల కంటే వ్యవస్థలు, కేడర్, స్థానిక నాయకత్వం కీలకమని చెప్పే బొత్స.. ఇప్పుడు కుటుంబ సభ్యులను బరిలోకి దించడం ద్వారా తన రాజకీయ పునాదులపై స్పష్టమైన సంకేతం ఇవ్వాలనుకుంటున్నారా అన్న వాదన బలంగా వినిపిస్తోంది.

మరోవైపు చిన్న శ్రీను కూడా తన కుమార్తె మజ్జి సిరి సహస్రను బరిలోకి దించడంతో ఈ ఎన్నికలు ఇద్దరు నేతల రాజకీయ ప్రభావంపై చర్చకు వేదికగా మారాయి. అయితే, ఈ నామినేషన్లను నేరుగా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుగా అభివర్ణించడానికి వారి అధికారిక ప్రకటనలు, ఎన్నికల ఫలితాలు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యర్థుల విషయంలో స్పష్టత బయటకు రాకపోవడం ఆసక్తి పెంచింది.

చివరి క్షణాల్లో బొత్స కుటుంబ సభ్యుల నామినేషన్లు, చిన్న శ్రీను కుమార్తె నామినేషన్లు తెరపైకి రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మరింత వేడెక్కింది. చిన్న శ్రీను కుమార్తె మజ్జి సిరి సహస్ర.. బొబ్బిలి నియోజకవర్గంలోని తెర్లాం, ఎస్.కోట నియోజకవర్గంలోని కొత్తవలసలో జెడ్పీటీసీ స్థానాలకు రెండు నామినేషన్లు దాఖలు చేశారు. ఇలా సిరి సహస్ర రెండు చోట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, దాని వెనుక ఉన్న వ్యూహంపై కూడా ఆసక్తి నెలకొంది.

కుటుంబ సభ్యులను బరిలోకి దించడం ద్వారా బొత్స తన ప్రభావాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారు. చిన్న శ్రీను పార్టీ మార్పు స్థానిక రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. ఈ ప్రశ్నలకు ఎన్నికల ఫలితాలే సమాధానం చెప్పనున్నాయి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్