Burning Topic: మళ్లీ యుద్ధం మొదలు?
Burning Topic: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తారస్థాయికి చేరాయి. అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకం చేయకుండా ట్రంప్ వెనుదిరగడంతో అనిశ్చితి.
Burning Topic: మళ్లీ యుద్ధం మొదలు?
Burning Topic: పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం విషయంలో ఊగిసలాటలు కొనసాగుతున్నాయి. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలపై సంతకం చేయకుండా వెళ్లిపోయారు. ఏ ఒప్పందమైనా అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. అమెరికా వైఖరిని ఇరాన్ తీవ్రంగా తప్పుపట్టింది. ఓవైపు అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు జరుగుతుంటే మరోవైపు హిజ్బుల్లా దళాలే లక్ష్యంగా లెబనార్ మీద భీకర దాడులు చేస్తోంది ఇజ్రాయెల్.
గాజా భూభాగంలో 70 శాతానికి పైగా స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు నెతన్యాహూ. పశ్చిమాసియాలో అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు ఫలప్రదమై ప్రాథమిక ఒప్పందానికి సిద్ధం అయినట్లు వార్తలు వచ్చినా, పరిస్థితి మరోసారి తారు మారైపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపు, హర్మూజ్‌లో దిగ్బంధనం ఎత్తివేతకు సంబంధించిన తాత్కాలిక ఒప్పందంపై సంతకం చేయలేదు. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ట్రంప్ వైట్‌హౌస్ సిచ్యువేషన్ రూమ్‌లో తన సలహాదారులతో భేటీ అయ్యారు. రెండు గంటలపాటు సాగిన చర్చల్లో ఒప్పందంపై ఎలాంటి పురోగతి లేదు.
చివరకు అమెరికా అధ్యక్షుడు సంబంధిత ఫైల్ మీద సంతకం చేయకుండానే వెళ్లిపోయారు అయినప్పటికీ ఆ ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా సంతకం చేయడం గానీ, తుది ఆమోదం ప్రకటించడం గానీ జరగలేదు. సంతకం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ మొదటి వచ్చాయి. ఇరాన్‌తో కుదిరే ఏ ఒప్పందమైనా అది అమెరికాకు మేలు చేసిదిగా ఉండాలని, అధ్యక్షుడిని సంతృప్తిపరచాలని, అప్పుడే ఆయన తుది ఆమోదం తెలుపుతారని వైట్‌హౌస్ అధికారి తెలిపారు. ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ దారా ఇరాన్‌కు పలు షరతులు విధించారు.
అణ్వాయుధాలు లేదా అణుబాంబు తయారీ దిశగా ఎప్పటికీ వెళ్లబోదని స్పష్టంగా అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.అలాగే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తక్షణమే అన్ని రకాల సుంకాలు లేకుండా రెండు దిశల్లోనూ నౌకా రాకపోకలకు తెరవాలని సూచించారు. జలసంధిలో ఎక్కడైనా సీ మైన్స్ ఉంటే వాటిని వెంటనే నిర్వీర్యం చేయాలన్నారు. ఇప్పటికే అమెరికా నౌకాదళం అనేక మైన్లను పేల్చి తొలగించిందని, మిగిలిన వాటిని ఇరాన్ తొలగించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా దిగ్బంధనం కారణంగా అక్కడ చిక్కుకుపోయిన నౌకలు తిరిగి ప్రయాణాలు ప్రారంభించవచ్చని కూడా ట్రంప్ తెలిపారు.
అయితే అమెరికా వైఖరిని ఇరాన్ తప్పుపట్టింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు మస్ట్ అనే భాషతో ఎవరూ ఆదేశాలు ఇవ్వలేరని ఆ దేశ విదేశాంగమంత్రి ఎస్మాయిల్ బఘాయీ తెలిపారు. 47 సంవత్సరాల క్రితమే ఆ విధమైన భాషకు మేము వీడ్కోలు చెప్పాం.. ఇరాన్ జాతీయ ప్రయోజనాలు, హక్కులను దృష్టిలో పెట్టుకుని మా నిర్ణయాలను మేమే తీసుకుంటాం" అని స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి అంశంపై కూడా ఇరాన్ తన వైఖరిని వెల్లడించింది. ఈ జలసంధి ఇరాన్, ఒమన్ దేశాల ప్రాదేశిక జలాల్లో ఉందని, తీర ప్రాంత దేశాల భద్రతా ప్రయోజనాలు కాపాడుతూ అంతర్జాతీయ నౌకాయానానికి భరోసా కల్పించే విధానాలు అవసరమని బఘాయీ తెలిపారు.
డీల్ విషయంపై అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా తుది ఒప్పందం ఖరారు కాలేదని వెల్లడించారు. కాగా అవసరమైతే ఇరాన్‌తో యుద్ధం తిరిగి ప్రారంభించే అవకాశం తమకు ఉందన్నారు అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్. కాగా అమెరికా.. ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం విషయంలో ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ప్పందం కోసం గత కొద్ది వారాలుగా అనేక మంది తీవ్రంగా ప్రయత్నిస్తు్న్నారు. ఈ దిశగానే ప్రస్తుత తాత్కాలిక కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి.
ఈ ఒప్పందం ఖరారైతే ఇరాన్ అణు కార్యక్రమం.. అమెరికా ఆంక్షల ఎత్తివేతపై చర్చలకు మార్గం సుగమం అవుతుంది. ఈ ఒప్పందంలో ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడుల ప్యాకేజీ.. ఇలా ఎన్నో కీలక అంశాలు ఈ ఒప్పందంలో ముడిపడి ఉన్నాయి. ఒప్పందంలో ప్రధానంగా హార్మూజ్ జలసంధి వివాదానికి పరిష్కారం చూపనున్నారు. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం హార్మూజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. 30 రోజుల్లోగా ఇరాన్ తన సముద్రపు మందుపాతరలను పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. మరోవైపు గాజా భూభాగంలో 70 శాతానికి పైగా స్వాధీనం చేసుకోవాలని సైన్యాన్ని ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు.
హమాస్‌పై ఇజ్రాయెల్ తన పట్టు బిగిస్తోందన్నారు. ‘‘ప్రస్తుతం గాజా భూభాగంలో 60 శాతం మా చేతుల్లో ఉంది. దశలవారీగా ముందుకు సాగుతూ.. 70 శాతానికి చేరుకోవాల్సిందిగా సైన్యానికి ఆదేశాలు జారీ చేశాను’’ అని నెతన్యాహు వెల్లడించారు. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య గతేడాది అక్టోబరులో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సమయంలో.. గాజాలో సుమారు 53 శాతం భూభాగం ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐడీఎఫ్ విడుదల చేసిన మ్యాప్‌ల ప్రకారం.. అది 64 శాతానికి పెరిగింది. గాజాలోని మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం వల్ల.. దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్ల పరిస్థితి మరింత దుర్భరమవుతుందని, వారు బలవంతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.




