Burning Topic: రగులుతున్న మిడిల్ ఈస్ట్.. తగ్గని ఇరాన్

Burning Topic: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్ లక్ష్యాలపై అమెరికా భీకర దాడులు చేయగా, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులకు దిగింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 July 2026 10:25 AM IST
Burning Topic
X

Burning Topic: రగులుతున్న మిడిల్ ఈస్ట్.. తగ్గని ఇరాన్

Burning Topic: పశ్చిమాసియాలో మళ్లీ భగ్గుమంటోంది. అమెరికా, ఇరాన్ దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ స్థావరాలపై అమెరికా భీకర దాడులు చేస్తుండగా, ఆ దేశానికి సన్నిహితంగా ఉన్న గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసింది ఇరాన్. ఈ ఉద్రికతల వేళ ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్ముజ్‌ జలసంధి మూసేశారా? తెరిచే ఉందా? అనే విషయంలో అమెరికా, ఇరాన్‌లు పరస్పర విరుద్దర ప్రకటనలు గందరగోళానికి దారి తీశాయి. హార్మూజ్‌లో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతుండటంపై భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. మరోవైపు ట్రంప్, నెతన్యాహు సహా 13 పేర్లతో ఇరాన్ విడుదల చేసినట్లు ప్రచారంలో ఉన్న రివేంజ్ లిస్ట్ కలకలం రేపుతోంది.

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఖతార్‌ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణపై ఆశలు చిగురిస్తున్నాయనుకున్న సమయంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ ఆజ్యం పోశారు. ఇరాన్ వాణిజ్య నౌకలు, పౌర నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలని ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు. దీంతో హర్ముజ్‌ జలసంధి పరిసరాల్లోని ఇరాన్‌ సైనిక లక్ష్యాలపై అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ భారీ వైమానిక దాడులకు దిగింది.

ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న సైనిక వ్యవస్థలపై విరుచుకుపడింది. జలసంధి చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా మొహరించిన ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, అంతర్జాతీయ నౌకలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇరాన్ స్పీడ్‌బోట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులు కొనసాగాయి. వాణిజ్య నౌకలపై దాడి చేసే ఇరాన్‌ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యం అని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది.

అమెరికా దళాలు భూమి, సముద్ర ఆధారిత ఫైటర్ జెట్లు, డ్రోన్లు, యుద్ధనౌకల ద్వారా ఇరాన్‌కు చెందిన దాదాపు 140 సైనిక లక్ష్యాలపై కచ్చితమైన క్షిపణులతో విరుచుకుపడ్డాయి. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే పౌర, వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు కొనసాగినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అమెరికా దాడులు హర్మొజ్‌ జలసంధికి సమీపంలోని హోర్మోజ్‌గాన్‌, ఖుజెస్టాన్‌, సిస్తాన్-బలూచిస్తాన్‌ ప్రావిన్సులపై కేంద్రీకృతమయ్యాయి.

బందర్‌ అబ్బాస్‌, జాస్క్‌, సిరిక్‌, ఖెష్మ్‌ దీవి, చాబహార్‌ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి.. ఖొండాబ్‌లోని హెవీ వాటర్‌ కేంద్రం సమీపంలోనూ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఒక మెయింటెనెన్స్ కార్మికుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా వెల్లడించింది. ఇరాన్ ప్రధాన భూభాగానికి ఆనుకుని ఉన్న కెస్మ్ ద్వీపంపై కూడా పెద్ద ఎత్తున క్షిపణులు పడ్డాయి.

అమెరికా తాజా దాడులపై ఆగ్రహించిన ఇరాన్‌ వెంటనే ప్రతిచర్యకు దిగింది. దాడులు కేవలం హర్మూజ్​కే పరిమితం చేయకుండా, అమెరికాకు మద్దతుగా ఉన్న గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది. అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ, ఒమన్‌లపై వైమానిక దాడులకు దిగింది. ఇరాన్‌ ప్రయోగించిన పలు క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకున్నట్లు ఖతార్‌ సైన్యం ప్రకటించింది.

ఖతర్‌లో ఇరాన్‌ దాడులను అడ్డుకునే క్రమంలో పడిన గగనతల రక్షణ వ్యవస్థ శకలాల కారణంగా ఒక చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. కువైట్‌లోని అమెరికా రాడార్ సైట్‌తో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన హైమర్స్ క్షిపణి లాంచర్ వ్యవస్థలు, మందుగుండు సామగ్రి నిల్వలను టార్గెట్ చేసింది. అయితే ఇరాన్‌ క్షిపణులను మధ్యలోనే ధ్వంసం చేశామని కువైట్‌ వెల్లడించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

మరోవైపు అమెరికా చర్యలను ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఇరాన్ ధ్వజమెత్తింది. సమితి వెంటనే స్పందించి, వాషింగ్టన్‌ను జవాబుదారీని చేయాలని డిమాండ్ చేసింది అమెరికా తమ ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. అమెరికా దళాలు తమపై దాడులు చేయడానికి ఏ దేశమైనా తన భూభాగాన్ని లేదా సైనిక సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి అనుమతిస్తే, ఆయా దేశాలను ఇరాన్ శత్రుదేశాలుగా పరిగణిస్తుందని హెచ్చరించింది.

అమెరికా దూకుడుపై ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బఘేర్‌ గాలిబాఫ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. హర్మూజ్ జలసంధిలో నౌకలు అనుమతి లేని మార్గాల్లో ప్రయాణిస్తున్నాయని ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ ఆరోపించింది. వాటిలో ఒకనౌకపై ముందస్తు హెచ్చరికగా కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపింది. హార్మూజ్‌ను మూసేశామని పేర్కొంది.

కాగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం గందరగోళానికి దారి తీసింది. చట్ట విరుద్ధ అక్రమ కదలికల కారణంగా ప్రస్తుతం హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణాన్ని అనుమతించడం లేదని ఇరాన్‌కు చెందిన పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ ప్రకటించింది. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత పునరుద్ధరించిన తర్వాత మాత్రమే ట్రాన్సిట్ దరఖాస్తుల్ని పరిశీలించి అనుమతులు జారీ చేస్తామని పేర్కొంది.

మరోవైపు హర్మూజ్‌ మార్గంలో నౌకల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ఇరాన్‌కు ఎలాంటి నియంత్రణ అధికారం లేదని, స్వేచ్ఛాయుత నావిగేషన్ కొనసాగుతోందని తెలిపింది. నౌకల రాకపోకలు యథావిధిగా జరుగుతున్నాయి. ఇరాన్ బారి నుంచి నౌకల ప్రయాణ స్వేచ్ఛను కాపాడేందుకు అమెరికా బలగాలు సిద్ధంగా ఉన్నాయి.' అని సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.

ఇదిలా ఉంటే హార్మూజ్‌లో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతుండటంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని, ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనేలా దౌత్యపరమైన పరిష్కారం కోసం జరుగుతున్న చర్చలను విజయవంతంగా ముగించాలని విన్నవించింది. హార్మూజ్‌లో నౌకలపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని స్పష్టంచేసింది. వాణిజ్య నౌకాయానం, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే ఆపాలని పేర్కొంది.

ఒమాన్ తీరంలో జీఎఫ్ఎస్ గెలాక్సీ వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. నౌకలో ప్రయాణిస్తున్న 11 మంది భారతీయుల్లో 10 మందిని సురక్షితంగా రక్షించగా, మరో భారతీయుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గల్లంతైన వ్యక్తి కోసం ఒమాన్ అధికారులతో కలిసి సహాయక చర్యలను సమన్వయం చేస్తోందని తెలిపింది.

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇరాన్ విడుదల చేసినట్లు ప్రచారంలో ఉన్న రివేంజ్ లిస్ట్ కలకలం రేపుతోంది. ఇందులో 13 మంది దేశాధినేతలు, ముఖ్యమైన విదేశీ నాయకుల పేర్లు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్లు ప్రముఖంగా కనిపించాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెర్జ్ ఫోటోలు ఇందులో కనిపించాయి.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని మొజ్తాబా ఖమేనీ ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో ఈ రివేంజ్ లిస్టును టెహ్రాన్‌కు చెందిన హమ్‌షాహ్రీ పత్రిక ఆన్‌లైన్ ఎడిషన్ దీన్ని ప్రచురించింది. అయితే దీన్ని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదించినట్లు ఆధారాలు లేవు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story