Burning Topic: బెంగాల్ లో హోరాహోరీ పోరు.. దీదీ మాస్టర్ ప్లాన్ బీజేపీ షాక్ తప్పదా?
Burning Topic: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాలుగో విజయం సాధిస్తుందా? బీజేపీ మాతృశక్తి వందన్ యోజన ప్లాన్ పని చేస్తుందా? బెంగాల్ ఎన్నికల పూర్తి విశ్లేషణ.
Burning Topic: బెంగాల్ లో హోరాహోరీ పోరు.. దీదీ మాస్టర్ ప్లాన్ బీజేపీ షాక్ తప్పదా?
Burning Topic: దేశంలో జరుగుతున్న ఐదు రాష్ఱ్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఇందులో పశ్చిమ బెంగాల్ ప్రధానంగా అందరినీ ఆకర్శిస్తోంది. రాష్ట్ర శాసనసభలోని 294 స్థానాలకు గాను ఈ నెల 23, 29.. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. తొలి పోలింగ్‌కు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ కీలక రాష్ట్రంలో అన్నీ ఈసారి పోరాటం అటు తృణమూల్ పార్టీకి, ఇటు బీజేపీకి అత్యంత ముఖ్యంగా మారింది.
వరుసగా నాలుగో సారి అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న మమతా బెనర్జీకి బీజేపీ గట్టి సవాలే విసురుతోంది. ఎలాగైనా దీదీని ఇంటికి పంపాలని కంకణం కట్టుకొని మరీ బరిలోకి దిగారు కమల నాథులు. 55 సంవత్సరాల రాజకీయ జీవితం పొడవునా ఫైర్‌బ్రాండ్‌గా కొనసాగుతున్న మమతా బెనర్జీ తన 70 సంవత్సరాల వయసులో కూడా అలసిపోకుండా పోరాడుతున్నారు. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలు ఒక ఎత్తైతే తాజా అసెంబ్లీ ఎన్నికలు మమత పాలనకు అగ్ని పరీక్షగా మారాయి.
పశ్చిమ బెంగాల్‌లో 15 ఏళ్లుగా తృణమూల్ పాలన కొనసాగుతోంది. 2011లో వామపక్ష ప్రభుత్వ పాలన అంతరించిన తర్వాత బలమైన నాయకురాలిగా ఎదిగారు మమతా బెనర్జీ. రాష్ట్రంలో తమకు ఇక ఎదురు లేదని ధీమాగా ఉన్న దీదీకి బీజేపీ బలమైన శక్తిగా దూసుకురావడం మింగుడు పడటం లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా 18 సీట్లు గెలుచుకున్న బీజేపీ. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది.
ఈసారి కచ్చితంగా విజయం సాధించాలనే కసితో పని చేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా ముఖ్య నేతలంతా ఇప్పటికే రాష్ట్రంలో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. బెంగాల్‌లో పెరిగిపోయిన బంగ్లాదేశీల చొరబాట్లు, ప్రభుత్వం పైన వ్యతిరేకత.. హిందుత్వ అజెండా, మమతా బెనర్జీ పాలనపై ప్రజల్లో పెరిగిపోయిన వ్యతిరేకత తమకు కలిసివస్తుందని బీజేపీ ధీమాతో ఉంది. ఇందుకు తగట్లే వ్యూహాలకు పదును పెట్టింది కాషాయ దళం.
సరిగ్గా ఎన్నికలకు ముందు చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ మమతా బెనర్జీకి ఆందోళన కలిగించింది. పశ్చిమ బెంగాల్‌లో ఏకంగా 91 లక్షల మంది పేర్లను తొలగించారు. ధ్రువీకరణ పత్రాలు చూపించినవారిని తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే దాదాపు 34 లక్షల మంది తమ పత్రాలను చూపించి ఓటర్లగా నిరూపించుకున్నా, వీరి పేర్లు ఇంకా జాబితాలో చేరలేదు.
సరిగ్గా పోలింగ్‌కు కొద్ది రోజుల మందు 7 లక్షల కొత్త ఓటర్లు జాబితాలో చేరారు. కొత్త ఓటర్లలో సుమారు 3.22 లక్షల మంది మొదటిదశ పోలింగ్‌లో ఓటు వేయనుండగా, మిగిలిన 3.88 లక్షల మంది ఓటర్లు రెండో దశ పోలింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరోవైపు ఎన్నికల అధికారుల్ని ఘెరావ్ చేయడంతో.. సుప్రీంకోర్టు కూడా బెంగాల్ యంత్రాంగంపై సీరియస్ అయింది.. ఆ తర్వాత పలువురు అధికారులను బదిలీ చేయడం మమతా బెనర్జీకి షాక్ తెప్పించింది.




