Burning Topic: నువ్వు దీదీ అయితే.. నేను దాదా..!
Burning Topic: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో రాజకీయ పోరు ముదిరింది.
Burning Topic: నువ్వు దీదీ అయితే.. నేను దాదా..!
Burning Topic: దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే ఇందులో అందరినీ ఆకర్శిస్తున్నది పశ్చిమ బెంగాల్. వరుసగా మూడు ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న మమతా బెనర్జీ ప్రతిష్టకు, ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనే పట్టుదలతో పోరాడిన బీజేపీకి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. బెంగాల్‌లో రెండో దశ పోలింగ్ ముగిసన కొద్ది నిమిషాల్లోలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పెద్ద సంచలనాన్నే సృష్టించాయి. అందులో మెజారిటీ సర్వేలు బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారం చేపట్టబోతోంది అని చెప్పేశాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 294 సీట్లు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 148. రాష్ట్రంలో టీఎంసీ సర్కారు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నందును సహజంగానే ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందని, దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ సక్సెస్ అయిందనే వాదనలు ఉన్నాయి.
ఈ ఆరు ఎగ్జిట్ పోల్స్ అంచనాలనే గమనిస్తే.. బీజేపీకి 146-161 సీట్లు వస్తాయని మ్యాట్రిజ్ సర్వే చెప్పింది. పీ-మార్క్ సర్వే 150-175 సీట్లు, చాణక్య స్ట్రాటజీస్ 150-160, పోల్ డెయిరీ 142-171 సీట్లు వస్తాయని చెప్పింది. ప్రజా పోల్ అనలిటిక్స్ అయితే మరో అడుగు ముందుకు వేసి బీజేపీకి ఏకంగా 193 సీట్లు వస్తాయని ప్రకటించింది. అయితే పీపుల్స్ పల్స్ సర్వే మాత్రం టీఎంసీకి 177- 187 సీట్లు వస్తామని చెప్పింది. కాగా జనమత్ సంస్థ ఏకంగా 195-205 సీట్లు వస్తాయంటోంది. ఈ సర్వే సంస్థలు అన్నీ కాంగ్రెస్, వామపక్షాలకు దక్కేవి నాలుగు సీట్లలోపే అని ప్రకటించి షాక్ ఇచ్చాయి. కొన్ని మీడియా సంస్థలు బీజేపీకి, మరికొన్ని టీఎంసీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశాయి. మొత్తం మీద అధిక భాగం ఎగ్జిట్ పోల్స్ బెంగాల్‌లో బీజేపీకే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ప్రకటించాయి. అయితే యాక్సిస్ మై ఇండియా పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించలేదు. బెంగాల్‌లో భయానక వాతావరణం కారణంగా మాట్లాడేందుకు ప్రజలు ఇష్టపడడం లేదని చెప్పింది
బెంగాల్ ఎగ్జిట్ పోట్స్ అంచనాలు బీజేపీ శ్రేణులకు ఎంతో ఆనందం కలిగించాయి. అప్పుడే సంబరాలు కూడా మొదలు పెట్టారు.అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ బూటకం అంటూ టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని తలకిందులు చేస్తూ మే 4న విడుదల కానున్న ఫలితాల్లో ప్రభంజనం సృష్టించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాగానే ఢీలా పడ్డ టీఎంసీ శ్రేణులకు ధైర్యం చెబుతూ వీడియో విడుదల చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పు. తృణమూల్ కాంగ్రెస్ 226 సీట్లకు మించి గెలుస్తుంది. ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు, ఫలితాలు దానికి సాక్ష్యం చెబుతాయి’అని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ వెనుక బీజేపీ హస్తముందని, వాటిని తాము విశ్వసించలేమని ఆమె తెలిపారు. షేర్ మార్కెట్‌ను నిలకడగా ఉంచేందుకు బీజేపీ నేతలు చేసిన చిట్టచివరి ప్రయత్నం ఎగ్జిట్‌పోల్స్ అని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే టీవీ చానళ్లలో ముందస్తు అంచనాలు వచ్చాయని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు ఈవీఎంలను తారుమారు చేసే కుట్ర జరుగుతుందంటూ మమతా బెనర్జీ స్వయంగా ఆందోళనకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. తాను పోటీ చేసిన భవానీపురంలో ఎన్నికల అధికారులు లేకుండా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లోకి వెళుతున్నారంటూ నిరసనకు దిగారు. రెండో, చివరి దశ పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే.. తమ పార్టీ ప్రతినిధుల సమక్షం లేకుండానే బ్యాలెట్ బాక్సులను తెరిచారని ఆరోపించారు. . ఈవీఎంలను తాకాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. తాము చట్టాన్ని గౌరవిస్తామని, తాను ఆదేశమిస్తే 10 వేల మంది కార్యకర్తలు వస్తారు అంటూ బెదిరించారు. ప్రజల ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఫిర్యాదులు అందడంతోనే తాను అక్కడికి వచ్చానని మమత అన్నారు. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల కమిషన్ కొట్టివేసింది. అన్ని నిబంధనలను పాటిస్తూ స్ట్రాంగ్‌రూమ్‌లను సురక్షితంగా సీల్ చేశామని.. ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేసింది.
కాగా పశ్చిమ బెంగాల్‌లో ఈసారి నమోదైన పోలింగ్ శాతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాష్ట్రంలో రెండు దశల్లో జరిగిన పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 93 శాతం ఓట్లు నమోదు అయ్యాయి. కాగా 2021 ఎన్నికల్లో 8 దశల్లో నిర్వహించన పోలింగ్ 85 శాతం కూడా దాట లేదు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 5.98 కోట్ల మంది ఓటు వేయగా, ఈసారి ఆ సంఖ్య 6.31 కోట్లకు చేరింది. 2021 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఏకంగా 34 లక్షల మంది అదనంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసలు ఇంత భారీ స్థాయిలో పోలింగ్ పెరగడానికి కారణం ఏంటి? ఎస్‌ఐఆర్ పేరుతో ఎన్నికల సంఘం లక్షలాది నకిలీ ఓట్లను తొలగించినప్పటికీ, రికార్డు స్థాయిలో 93 శాతం పోలింగ్ నమోదవ్వడం గమనార్హం. కేవలం నకిలీ ఓట్ల ఏరివేత వల్లే కాకుండా, వాస్తవ ఓటర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. కొత్తగా పోలైన ఆ 34 లక్షల మంది ఎవరి వైపు మొగ్గు చూపారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
గత ఎన్నికల్లో బీజేపీ కంటే టీఎంసీకి దాదాపు 60 లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చి చేరిన ఈ 34 లక్షల అదనపు ఓట్లు విజయావకాశాలను తారుమారు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పెరిగిన ఓట్లపై బీజేపీ ఆత్మవిశ్వాసంతో ఉంది. కేంద్ర బలగాల మోహరింపుతో స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం దక్కడంతోనే జనం భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని వారు చెబుతున్నారు. జనం మార్పు కోరుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ సొసైటీల లోపలే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయడం తమకు భారీగా కలిసొస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. మరోవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్.. ఈ 34 లక్షల ఓట్లు ఎస్‌ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా పడిన నిరసన ఓట్లుగా చెబుతోంది. రెండు పార్టీలు విజయం తమదేని ధీమా వ్యక్తం చేస్తున్న వేళ కీలకమైన ఈ 34 లక్షల అదనపు ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే మే 4న వెలువడే ఫలితాల వరకు వేచి చూడక తప్పదు.
మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఆందోళన మొదలైంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటని బంగ్లాదేశ్ ఎన్‌సీపీ కార్యదర్శి, ఎంపీ అక్తర్ హుస్సేన్ ఆ దేశ పార్లమెంట్‌లో వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే, లక్షలాది మంది అక్రమ వలసదారులు బంగ్లాదేశ్‌లోకి నెట్టివేయబడే అవకాశం ఉందని, ఇది ఢాకాలో శరణార్థుల సంక్షోభాన్ని పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లోకి సముద్రంలా వలసలు వచ్చి పడుతాయని వ్యాఖ్యానించారు. వలసదారుల్ని వెనక్కి పంపరనే గ్యారెంటీ లేదని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే. తృణమూల్ కాంగ్రెస్ ఇంత కాలం బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌లోకి అక్రమ చొరబాటు దారులను ప్రోత్సహించిందని ఆరోపించారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ రాజకీయ నాయకులతో పాటు టీఎంసీలోనూ ఆందోళన మొదలైందని వ్యాఖ్యానించారు.




