Burning Topic: బంగ్లా సరిహద్దులో 'సువేందు' మార్క్ కంచె: అక్రమ చొరబాట్లకు చెక్.. తొలి క్యాబినెట్ లోనే కీలక నిర్ణయం!

Burning Topic: పశ్చిమ బెంగాల్‌ నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణానికి అవసరమైన భూమిని బీఎస్‌ఎఫ్‌కు బదిలీ చేస్తూ తొలి క్యాబినెట్‌లోనే ఆమోదం తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 May 2026 2:00 PM IST
Burning Topic
X

Burning Topic: బంగ్లా సరిహద్దులో 'సువేందు' మార్క్ కంచె: అక్రమ చొరబాట్లకు చెక్.. తొలి క్యాబినెట్ లోనే కీలక నిర్ణయం!

Burning Topic: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ ఎన్నికల హామీల్లో కీలకమైన బంగ్లాదేశ్‌ సరిహద్దులో కంచె ఏర్పాటు కోసం బీఎస్‌ఎఫ్‌కు అవసరమైన భూమిని బదిలీ చేయడానికి ముఖ్యమంత్రి సువేందు అధికారి తొలి క్యాబినెట్‌ సమావేశంలోనే ఆమోద ముద్ర వేశారు. సరిహద్దు భద్రత, బంగ్లాదేశ్‌ నుంచి చొరబాట్లను నియంత్రించడంలో భాగంగా భూమి బదిలీ ప్రక్రియను వెంటనే ప్రారంభించి, 45 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భూమి బదిలీ ప్రక్రియ పూర్తయిన తర్వాత, బీఎ్‌సఎఫ్‌ మిగిలిన సరిహద్దు కంచె నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని, తద్వారా అక్రమ చొరబాట్ల సమస్య తక్కువ సమయంలోనే పరిష్కారమవుతుందని సువేందు అధికారి చెప్పారు. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే తీసుకున్న తొలి నిర్ణయం ఇదే

భారత్‌, బంగ్లాదేశ్ మధ్య ఎంతో కాలంగా నులుగుతున్న అంశం అక్రమ చొరబాట్లు. బ్రిటిష్ వారు దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినప్పుడు ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతం బెంగాల్. బెంగాల్‌లో రెండుగా విభజించి తూర్పు భాగాన్ని పాకిస్థాన్‌లో కలిపారు. మిగతా భాగం భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌. కాగా 1971లో జరిగిన చారిత్రాత్మక భారత్-పాకిస్థాన్ యుద్ధం ఫలితంగా తూర్పు పాకిస్థాన్ బంగ్లాదేశ్ పేరుతో స్వతంత్ర దేశంగా అవతరించింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్‌ నుంచి లక్షలాది మంది పశ్చిమ బెంగాల్‌లోకి అక్రమంగా రావడం మొదలైంది. ఇరు దేశాల మధ్య సరిహద్దులు సక్రమంగా లేకపోవడం, ఇరువైపులా బెంగాలీ మాట్లాడేవారే ఉండటంతో వీరిని గుర్తించడం కష్టమైపోయింది. సుమారు 62.8 లక్షల మంది బంగ్లాదేశీయులు భారత్‌లోకి చొరబడగా ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లోనే వీరు ఎక్కువగా ఉన్నారు.. అక్రమ చొరబాట్ల కారణంగా సరిహద్దు జిల్లాల భౌగోళిక స్వరూపం మారిపోవడంతో పాటు బెంగాలీ అస్థిత్వానికికే ముప్పు ఏర్పడిందనే వాదన ఉంది.

భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఇప్పటివరకూ 1,104 అక్రమ చొరబాట్ల సంఘటనలు తగేడాది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. వారిలో 2,556 మందిని అరెస్టు చేశామన్నారు. 2025 నవంబర్‌ నాటికి భారత్‌లోకి అక్రమ చొరబాట్లు, ఇతర అంశాలపై కేంద్రమంత్రి లోక్‌సభలో వివరాలు అందించారు. అక్రమంగా చొరబడుతున్న వారిలో అధికంగా 1,104 చొరబాట్లు బంగ్లాదేశ్ నుండే జరిగాయన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 8,500 చొరబాటు ఘటనలు జరగగా 20,800మందిని అరెస్టు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. భారత్ - బంగ్లాదేశ్ మధ్య మొత్తం భూ సరిహద్దు సుమారు 4,096.7 కిలోమీటర్లు.. ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతోనే 2,216.7 కి.మీ సరిహద్దు ఉంది. కాగా 1,647.6 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం పూర్తయింది.. ఇంకా పూర్తి కావాల్సినవి 569 కి.మీ.. ఇందులో 112.7 కి.మీ కంచె వేయడం సాధ్యం కాదు. 456.224 కి.మీ ప్రాంతంలో పనులు జరగాల్సి ఉంది.

భూసేకరణ జాప్యం కారణంగా కంచె పనులు నెమ్మదిగా సాగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సరిహద్దు కంచె నిర్మాణానికి అవసరమైన భూముల బదిలీని గత మమతా బెనర్జీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందనే ఆరోపణలున్నాయి. స్థానిక ప్రజల జీవనోపాధి, భూసంబంధిత సమస్యలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని టీఎంసీ చెబుతోంది. మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, వాదించారు. సరిహద్దుల్లోని గ్రామస్తులను BSF బెదిరిస్తోందని మమతా బెనర్జీ ఆరోపణ కంచె నిర్మాణానికి భూమి ఇచ్చే ముందు BSF పరిధిని 15 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్లకు పెంచారని అమె వాదన. మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలతోనే సరిహద్దులో కంచె నిర్మాణాన్ని అడ్డుకుంటోందని బీజేపీ చెబుతోంది. బెంగాల్‌లో తమ ప్రభుత్వ ఏర్పడితే సరిహద్దులో కంచె నిర్మాణం పూర్తి చేస్తామని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు. ఇప్పడా వాగ్దానం నెరవేరే సమయం వచ్చింది.

సరిహద్దుల్లో కంచె నిర్మాణం కోసం బీఎస్‌ఎఫ్‌కు భూమిని కేటాయిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బంగ్లాదేశ్‌లో ఆందోళన మొదలైంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అక్రమ చొరబాట్లను ఒక్కసారిగా తిప్పి పంపితే తమ దేశానికి భారం అవుతుందని బంగ్లా ప్రభుత్వ వాదన. సరిహద్దు భద్రత విషయంలో భారత్ మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని చెబుతున్నారు బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వ విదేశాంగ వ్యవహారాల సలహాదారు ఎం.హుమాయున్ కబీర్. సరిహద్దు కంచెతో మత దేశాన్ని భయపెట్టలేరని వ్యాఖ్యానించారాయన. సరిహద్దు సమస్యలపై భారత్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతూనే.. అవసరమైతేనే చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, రెండు దేశాల నాయకత్వం ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంపై కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story