OFF THE RECORD: నాడు సవాళ్ల మీద సవాళ్లు.. ఇప్పుడు సైలెన్స్! బీరం వెనుక వ్యూహమేంటి?

OFF THE RECORD: కొల్లాపూర్ రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మౌనం వెనుక కారణాలేంటి? జూపల్లితో పోరు, ఓటమి తర్వాత మారిన సమీకరణాలపై విశ్లేషణ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Aug 2026 7:41 AM IST
OFF THE RECORD
X

OFF THE RECORD: నాడు సవాళ్ల మీద సవాళ్లు.. ఇప్పుడు సైలెన్స్! బీరం వెనుక వ్యూహమేంటి?

OFF THE RECORD: బీరం హర్షవర్ధన్‍ రెడ్డి. బీఆర్‍ఎస్‍ పార్టీ సెకండ్‌ టర్మ్‌ అధికారంలో ఉన్నప్పుడు కొల్లాపూర్‌ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చక్రం తిప్పారు. ప్రత్యర్థి పార్టీతో కన్నా ఎక్కువగా సొంత పార్టీలోని మాజీ మంత్రితోనే వర్గపోరు కొనసాగించారు.

గెలిచొచ్చిన పందెం కోడికి విలువెక్కువ అన్నట్టు గులాబీ అధిష్టానం కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే బీరంకే ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే హోదాలో తన స్వపక్ష ప్రత్యర్థి జూపల్లి కృష్ణారావు వర్గానికి ముచ్చెమటలు పట్టించే రేంజ్‍ లో బీరం వైరం నెరిపారు.

ఇద్దరూ అధికార పార్టీలోనే ఉన్నా.. వీళ్ల మధ్య ప్రతినిత్యం సవాళ్లు.. ప్రతి సవాళ్లు.. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో కొల్లాపూర్‍ నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా కొనసాగాయి. కానీ తర్వాత సీన్ మారింది. ఎమ్మెల్యేతో పోరు ఏగలేక హస్తం చెంతకు చేరారు జూపల్లి. ఈసారి షో జూపల్లి కొట్టారు. అంతేకాదు మాజీ మంత్రి కాస్త.. మరోసారి మంత్రి అయ్యారు.

ఐతే అధికారం చేతిలో ఉన్నప్పుడు బీరం హర్షవర్ధన్‍ రెడ్డిలో కనిపించిన దూకుడు ఓటమి తర్వాత ఏమైంది..? అన్న ప్రశ్న ఇప్పుడు కొల్లాపూర్‍ నియోజ్కవర్గంలో కొనసాగుతుందట. ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యే బీరం రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉన్నారన్న చర్చ కొల్లాపూర్‍ లో కొనసాగుతుందట..?

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొల్లాపూర్ రాజకీయాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1952 నుంచి ఈ నియోజకవర్గం.. ఎన్నో రాజకీయ పరిణామాలకు వేదికగా నిలిచింది. అయితే కొల్లాపూర్ రాజకీయ చరిత్రలో ఎక్కువ కాలం ఎమ్మెల్యేగా కొనసాగిన నేతల్లో జూపల్లి కృష్ణారావు ఒకరు.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జూపల్లి.. దాదాపు రెండు దశాబ్దాల పాటు కొల్లాపూర్ రాజకీయాలను ప్రభావితం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 2012లో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరిన జూపల్లి.. ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ గెలుపొందడంతో అప్పటి సీఎం కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు.

అయితే 2018 ఎన్నికలు జూపల్లి రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా మారాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జూపల్లిని.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఓడించారు. దీంతో కొల్లాపూర్‌లో జూపల్లి ఆధిపత్యానికి తొలిసారి గట్టి బ్రేక్ పడింది.

ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి.. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. దీంతో ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న బీరం, జూపల్లి ఒకే జెండా కింద చేరారు. ఐతే పార్టీ ఒక్కటే ఐనా.. వర్గాలు మాత్రం ఒక్కటి కాలేదు.

జూపల్లి వర్గం.. బీరం వర్గంగా కొల్లాపూర్ బీఆర్ఎస్‌లో రాజకీయాలు విడిపోయాయి. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ఆధిపత్యం కోసం పోటీ కనిపించేది. ఇరువర్గాల మధ్య విభేదాలు క్రమంగా పెరిగి.. చివరకు బహిరంగ రాజకీయ పోరుగా మారాయి.

2023 ఎన్నికలకు ముందు ఈ పోరు మరింత తీవ్రస్థాయికి చేరింది. జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో.. అప్పటివరకు పార్టీలో కొనసాగిన వర్గపోరు కాస్తా ప్రత్యక్ష ఎన్నికల పోరుగా మారింది.

ఆ సమయంలో కొల్లాపూర్‌లో రాజకీయ వాతావరణం ఎలా ఉండేదంటే.. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం.. బహిరంగ సభల్లో సవాళ్లు విసురుకోవడం.. మీడియా సమావేశాల్లో పరస్పరం టార్గెట్ చేసుకోవడం నిత్యకృత్యంగా మారింది.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి రైతుల పరిహారం వరకు.. రాజకీయ అవినీతి ఆరోపణల నుంచి వ్యక్తిగత విమర్శల వరకు.. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు నిరూపిస్తానంటూ సవాళ్లు చేసుకోవడం..కొల్లాపూర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమంటూ సమయం, తేదీ ప్రకటించడం వరకు వ్యవహారం వెళ్లింది.

దీంతో కొల్లాపూర్ రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒక చిన్న నియోజకవర్గం.. ఇద్దరు నేతల రాజకీయ పోరుతో అప్పట్లో రాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆకర్షించింది. నాడు ఈ ఇద్దరి మద్య ఉన్న వైరాన్ని సెట్ చేసేందుకు పార్టీ వర్కింగ్‍ ప్రెసిడెంట్ కేటీఆర్‍ రంగంలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది.

కానీ 2023 ఎన్నికల ఫలితాలు ఈ మొత్తం సీన్‌ను మార్చేశాయి. బండ్లు ఓడలౌతాయి... ఓడలు బండ్లౌతాయి అన్నట్టు, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ తరఫున విజయం సాధించి.. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఓటమి పాలై మాజీ ఎమ్మెల్యేగా మిగిలారు.

ఇక అప్పటివరకు జూపల్లిపై నేరుగా విమర్శలు చేస్తూ.. సవాళ్లు విసిరిన బీరం హర్షవర్దన్‍ రెడ్డి... ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదన్న చర్చ మొదలైంది. రాష్ట్రస్థాయి పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే నియోజకవర్గానికి వస్తున్నారని.. గతంలో ఉన్నంత రాజకీయ దూకుడు ఇప్పుడు కనిపించడం లేదని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

అయితే.. రాజకీయాల్లో ఓటమి అంతిమం కాదని.. సరైన సమయంలో బీరం మళ్లీ యాక్టివ్ అయితే కొల్లాపూర్‌లో బీఆర్ఎస్‌కు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉందని ఆయన అనుచరులు భావిస్తున్నారట. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ.. నియోజకవర్గంలో తిరిగి తన క్యాడర్‌ను బలోపేతం చేసుకుంటే భవిష్యత్తులో పార్టీ టికెట్ కోసం బలమైన పోటీదారుగా నిలవొచ్చన్న చర్చ కూడా వినిపిస్తోంది.

ఒకప్పుడు కొల్లాపూర్‌లో రాజకీయ ప్రత్యర్థులుగా మొదలైన ప్రయాణం.. ఒకే పార్టీలో వర్గపోరుగా మారి.. చివరకు ఎన్నికల సమరంగా మారింది. ఇప్పుడు మాత్రం అదే కొల్లాపూర్‌లో రాజకీయ వాతావరణం కాస్త నిశ్శబ్దంగా కనిపిస్తోంది. ఒకవైపు జూపల్లి కృష్ణారావు మంత్రిగా అధికారంలో ఉన్నారు.. మరోవైపు బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా రాజకీయ భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే నాడు కొల్లాపూర్‌ను కుదిపేసిన ఆ రాజకీయ పోరు మళ్లీ తెరపైకి వస్తుందా..? బీరం తిరిగి నియోజకవర్గంలో యాక్టివ్ అవుతారా..? జూపల్లితో మరోసారి రాజకీయ ఢీ తప్పదా..? అన్నదే ఇప్పుడు కొల్లాపూర్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. మరి రానున్న రోజుల్లో కొల్లాపూర్ పాలిటిక్స్ ఎలాంటి మలుపు తీసుకుంటాయో వేచి చూడాలి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story