Off The Record: ఈటెలను టార్గెట్ చేసింది ఎవరు?

Off The Record: తెలంగాణ బీజేపీలో ఎంపీ ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేస్తూ వెలిసిన వివాదాస్పద పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 Jun 2026 6:21 AM IST
Off The Record
X

Off The Record: ఈటెలను టార్గెట్ చేసింది ఎవరు?

Off The Record: నీ ఏడుపే బీజేపీకి శాపం.. ఈ ఒక్క వాక్యమే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో రాజకీయ దుమారం రేపుతోంది. మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్‌ను టార్గెట్ చేస్తూ వెలిసిన పోస్టర్లు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈటెల ఏడుపే బీజేపీకి శాపం అంటూ కనిపించిన ఆ పోస్టర్లు... కేవలం విమర్శలా..? లేక రాజకీయ హెచ్చరికలా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గత కొంతకాలంగా ఈటెల రాజేందర్, ధర్మపురి అర్వింద్ మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది. దీంతో ఈ స్నేహానికి బ్రేకులు వేయాలనే ఉద్దేశంతోనే కొందరు కావాలనే ఈ ఎపిసోడ్‌కు తెరలేపారని ఈటెల అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నిప్పు లేనిదే పొగ రాదు అనే నానుడి ఉంది. కానీ ఇక్కడ అసలు నిప్పు ఎవరు పెట్టారు..? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అసలే బీజేపీలో కొంత కాలంగా అంతర్గత కుమ్ములాటలు, నేతల మధ్య వైశమ్యాలు ఎక్కువైపోయాయి అనేది బహిరంగ రహస్యం. ఇలాంటి టైంలో.. పార్టీలో ముఖ్యనేతగా ఉన్న ఈటలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ పోస్టర్ వెలియడం పార్టీలో మరింత అగ్గి రాజేసింది. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని... ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదని... కేంద్ర మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్నారని ఫ్లెక్సీల్లో ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు... రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీయేనని... మల్కాజిగిరి ఎంపీగా మోడీ చరిస్మాతో గెలిస్తే.. నా సొంత ఇమేజ్ తోనే గెలిచానని చెప్పడం ఇదేనా రాజకీయ నైతికత? అలాగే ధర్మపురి అరవింద్ కు ఆదరణను చూసి కడుపు మంట ఎందుకు? నేనే బీసీ నాయకుడిని అనే భ్రమ నుంచి బయటకు రండి ఈటల అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. అన్నం పెట్టిన చేతినే కొరికినట్టు కాదా ఇది?" అన్నట్టుగా పోస్టర్లలో రాసి ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

నిజానికి తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు కొత్తేమీ కాదు. పైకి అందరూ ఒకే వేదికపై కనిపించినా... లోపల మాత్రం ఎవరి శిబిరం వారిదే అన్న చర్చ చాలాకాలంగా ఉంది. ఎంపీలు ఒక గ్రూప్... ఎమ్మెల్యేలు మరో గ్రూప్... సీనియర్లు ఇంకో గ్రూప్... ఇలా వర్గాలుగా పార్టీ విడిపోయిందనే విమర్శలు కార్యకర్తల నుంచే వినిపిస్తున్నాయి. "ఇంట గెలిచి రచ్చ గెలవాలి" అంటారు. కానీ కమలదళం మాత్రం ఇంకా ఇంటి సమస్యలతోనే సతమతమవుతోందని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి రాత్రింబవళ్లు పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఒకవైపు... నాయకుల మధ్య ఆధిపత్య పోరు మరోవైపు... దీంతో కిందిస్థాయి కేడర్‌లోనూ అసంతృప్తి పెరుగుతోందనే చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ ఫ్లెక్సీల వెనుక ఎవరు ఉన్నారన్నది ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే... ఇటీవలే రైతు గోస-బీజేపీ భరోసా బస్ యాత్రలో రాష్ట్ర నాయకత్వం మొత్తం ఒకే బస్సులో తిరిగింది. ఒకప్పుడు ఒకరి ముఖం మరొకరు చూసుకోని నేతలు కూడా ఇప్పుడు భుజం భుజం కలిపి కనిపించారు. ఇవన్నీ కలిసి తెలంగాణ బీజేపీకి కొత్త జోష్ తెచ్చాయని కార్యకర్తలు భావిస్తున్న సమయంలోనే ఈ ఫ్లెక్సీలు వెలుగులోకి రావడం అనుమానాలకు తావిస్తోంది."ఇంట్లో పెళ్లి జరుగుతుంటే బయట నుంచి రాళ్లు వేసినట్టుందే" అని కాషాయ శ్రేణులు చర్చించుకుంటున్న పరిస్థితి దాపురించిందట.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో మరో ఆసక్తికర కోణం కేంద్ర మంత్రి పదవుల రాజకీయాలు. త్వరలో కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే... తెలంగాణ నుంచి ఒక బీసీ నేతకు అవకాశం దక్కొచ్చన్న ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. అదే ఆశ... అదే ఆత్రం... అదే ఆకాంక్ష ఇప్పుడు బీసీ నేతల మధ్య కనిపించని పోటీకి కారణమైందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీంతో పార్టీలో రాజకీయ సమీకరణాలనే మార్చేసిందనే చర్చ లేకపోలేదు. ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ వంటి నేతలు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారనే చర్చ సాగుతోంది. కానీ అదృష్టం ఎవర్నీ వరిస్తుందోననే మీమాంస నడుస్తోంది. గత కొంతకాలంగా కేంద్ర మంత్రి పదవి కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ పెరిగిందనే ప్రచారం నిరంతరం సాగుతోంది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మార్పులు ఉండొచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. బీసీ కోటాలో ఈటలా..? అర్విందా..? అన్న చర్చ జోరందుకుంది. దీంతో "మంత్రి కుర్చీ పోటీలో.... మిత్రుడూ ప్రత్యర్థే అవుతాడు" అన్న రాజకీయ సామెతను గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. అయితే ప్రస్తుత పోస్టర్ల కలకలం ఈ అంశానికే సంబంధించిందా...? లేక ఇది కేవలం రాజకీయ యాదృచ్ఛికమా..? అన్నది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది.

ఈటలపై పోస్టర్లు వెలిసిన వెంటనే రాష్ట్ర బీజేపీ నాయకత్వం రంగంలోకి దిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ,ఇతర ముఖ్య నేతలు పోస్టర్లను తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉంటే... ఈటల రాజేందర్‌పై వచ్చిన ఆరోపణలను ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా ఖండించారు. ఈటలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని...కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కూడా తనకు సోదర సంబంధాలే ఉన్నాయని స్పష్టం చేశారాయన. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిపై వ్యక్తిత్వ హననం చేయడం సరికాదన్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కూడా తీవ్రంగా స్పందించారు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారం కాదని...బీజేపీ ఎదుగుదలను చూసి భయపడుతున్న రాజకీయ ప్రత్యర్థుల పన్నాగమని ఆరోపించారు. పార్టీలో అంతర్యుద్ధం సృష్టించి బీజేపీని బలహీనపరచాలన్న కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారాన.‌ కానీ రాజకీయాల్లో కనిపించేది ఒక్కటి... జరిగేది ఇంకొకటి అంటారు. అందుకే ఇప్పుడు అందరి చూపు ఒకే ప్రశ్నపై నిలిచింది. ఈటలపై బాణం ఎక్కుపెట్టింది నిజంగా బయటి శక్తులా..? లేక కమలం తోటలోనే దాక్కున్న అదృశ్య ముళ్లా..? అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు బీజేపీ.. ప్రత్యామ్నాయం మేమే అంటోంది. కానీ ప్రతిపక్షాలపై పోరాటం కంటే... సొంత పార్టీలోనే పోరాటం ఎక్కువైతే ఎలా అన్న ప్రశ్న కార్యకర్తలను వెంటాడుతోంది. ఒక సినిమా డైలాగ్‌లో చెప్పినట్టు... "శత్రువు బయట ఉంటే యుద్ధం సులువు.. ఇంట్లో ఉంటేనే ప్రమాదం ఎక్కువ." ఈటలపై పోస్టర్ల వ్యవహారం ఒక సాధారణ ఘటనగా ముగుస్తుందా..? అసలు పోస్టర్లు వేసింది ఎవరు..? లాభపడేది ఎవరు..? నష్టపోయేది ఎవరు..? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు.. తెలంగాణ కమలంలో ప్లెక్సీల రచ్చకు ఫుల్ స్టాప్ పడుతోందో? లేదో? చూడాలి మరి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story