Burning Topic: కేరళ లో కాబోయే సీఎం అతనే?
Burning Topic: కేరళలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం యూడీఎఫ్ కూటమికి మెజారిటీ ఖాయమా?
Burning Topic: కేరళ లో కాబోయే సీఎం అతనే?
Burning Topic: కేరళలో ఓటింగ్ ముగిసింది.. అభ్యర్థుల భవితవ్యాలు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అన్న అంచనాలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా వచ్చాయి. కేరళలో అధికార మార్పిడి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ స్పష్టమైన ఆధిక్యత సాధిస్తుందని భావిస్తున్నారు. దీంతో రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. కేరళ సీఎం పీఠం కోసం వినిపిస్తున్న పేర్లలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేణుగోపాల్. జాతీయ రాజకీయాల నుండి రాష్ట్ర రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేణుగోపాల్‌ను రాష్ట్రానికి పంపిస్తారా లేదా అనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఒకవేళ ఆయనను ఎంపిక చేస్తే, అది పార్టీ అంతర్గత సమీకరణాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది.
మరోవైపు కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వి.డి. సతీశన్ పేరు కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో బలంగా వినిపిస్తోంది. గత ఐదేళ్లుగా పినరయి విజయన్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా UDF కూటమిలో కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద భాగస్వామ్య పక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), సతీశన్ నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌తో ఉన్న సంబంధాలు, కూటమిలోని ఇతర పార్టీలతో ఉన్న సయోధ్య ఆయనకు కలిసొచ్చే అంశాలు. స్థానిక నేతల మద్దతు సతీశన్‌కే ఎక్కువగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. కేరళలో అధికారం దక్కించుకోవడం ఎంత ముఖ్యమో, ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కూటమి ఐక్యతను కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. సీనియర్ నాయకులు రమేష్ చెన్నితాల వంటి వారు కూడా రేసులో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ మాత్రం వేణుగోపాల్, సతీశన్ మధ్యే నెలకొన్నట్లు కనిపిస్తోంది.
కాగా కేరళలో కాంగ్రెస్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేచే అవకాశం వస్తే అధిష్టానం ముఖ్యమంత్రిగా కేసీ వేణుగోపాల్‌నే ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఆసక్తి చూపిస్తే ముఖ్యమంత్రి కావచ్చని ఏఐసీసీ కేరళ ఇన్‌ఛార్జ్ తారిఖ్ అన్వర్ వ్యాఖ్యానించారు. వేణుగోపాల్ పేరును సూచించినప్పటికీ.. చివరి నిర్ణయం పార్టీ హైకమాండ్ చేతుల్లోనే ఉంటుందని అన్వర్ చెప్పారు. హైకమాండ్ సరైన వ్యక్తిని ఎంపిక చేస్తుందని అన్నారు. ‘‘పార్టీ ఒక పరిశీలకుడిని నియమిస్తుంది. ఆయన పార్టీ శాసనసభ్యుల సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈచర్చల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారైతే, ఆ సమాచారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి చేరుతుంది. చివరి నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుంది” అని ఆయన చెప్పారు. కాగా వేణుగోపాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ముఖ్యమంత్రి అవుతారా? అని అన్వర్‌ను అడిగితే, ఆసక్తి ఉంటే అవసరమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని అన్నారు. అంతిమ నిర్ణయం పార్టీ అధిష్టానానిదేనని స్పష్టం చేశారు.
కేరళలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న LDFకూటమికి ఈసారి ఓటమి తప్పదని మెజార్టీ సర్వేలు అంచనా వేశాయి. మొత్తం 140 స్థానాలకుగాను, UDF కూటమికి 75నుంచి 87సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ పేర్కొంది. LDFకు 55 నుంచి నుంచి 65స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఓట్ వైబ్ సర్వే ప్రకారం UDFకు 70 నుంచి 80 స్థానాల్లోనూ, LDF 58 నుంచి 68 స్థానాలు, ఎన్డీఏ సున్నా నుంచి నాలుగు స్థానాలు గెలిచే అవకాశం ఉందని తేలింది. మ్యాట్రిజ్ అంచనా ప్రకారం UDF కూటమికి 70 నుంచి 75, LDFకు 60 నుంచి 65, ఎన్డీఏ మూడు లేదా ఐదు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. చాణిక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం UDF కూటమి 72 నుంచి 80 స్థానాల్లోనూ, LDF 58 నుంచి 64 సీట్లు, NDA సున్నా నుంచి 3 స్థానం గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. యాక్సిస్ మై ఇండియా UDF కూటమికి 78 నుంచి 90, LDFకు 49 నుంచి 62, NDA సున్నా నుంచి 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది.
కాగా కేరళలో బీజేపీకి ఓట్లు పెరిగినా సీట్లు మాత్రం నామమత్రంగానే రావచ్చని అంచనా వేస్తున్నారు. . బీజేపీకి 7 సీట్లు రావొచ్చు. అంటే ఏ కూటమికి పూర్తిస్థాయి మెజారిటీ రావడం లేదు. రెండింట్లో ఏ కూటమికి మెజారిటీ రాకపోతే బీజేపీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే సైద్ధాంతికంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్.. రెండూ బీజేపీకి వ్యతిరేక కూటములే. అందువల్ల ఏ కూటమికి కూడా సరైన మెజారిటీ రాకపోతే ఆయా కూటములు బీజేపీతో కలుస్తాయా అనేది కీలక ప్రశ్న. స్పష్టమైన మెజారిటీ రాకపోతే రెండు కూటముల్లోని పార్టీలతో సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. కేరళ అసెంబ్లీలో 140 సీట్లున్నాయి. మెజారిటీ సాధించాలంటే 71 సీట్లు కావాలి. యూడీఎఫ్‌లో కాంగ్రెస్ పార్టీ కీలకం. ఎల్డీఎఫ్లో సీపీఎం కీలకం. మే 4న ఫలితాలు వెల్లడయ్యేంత వరకు ఈ అంశంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంటుంది.




