Off The Record: స్వరం మారుస్తున్న జగన్ .. ఏపీ రాజధానిగా అమరావతే ఎందుకు..?

Off The Record: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రాముఖ్యత ఏంటి? వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని పాలకులు ఎందుకు ఎంచుకున్నారు?

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 April 2026 6:52 AM IST
Off The Record
X

Off The Record: స్వరం మారుస్తున్న జగన్ .. ఏపీ రాజధానిగా అమరావతే ఎందుకు..?

Off The Record: తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు ఉన్నాయని వాదించాడట వెనుకటికీ ఓ వేదాంతి. ఇక తాము ప్రతిపాదించిన సిద్దాంతాలు, విధానాలు సర్వజన ఆమోదమని వాదిస్తున్నారు ఏపీలోని వైసీపీ నేతలు. పస లేని వాదన పదేపదే చేస్తే ప్రజలు మౌనంగా వుంటారు. ఇంకేముంది... ఈ మౌనం ప్రజామోదం అంటూ కొత్త పల్లవి అందుకోవటం వారికి అలవాటు. ఇప్పుడు అదే చేస్తున్నారు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సమయంలో ఏపీకి పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేలా చట్టం ఏర్పడింది... పదేళ్లు హైదరాబాద్ రాజధానిగా ఏపీ పాలన సాగించవచ్చుగా... ఇప్పుడు ఏపీకి అర్జెంట్ గా రాజధాని ఏర్పాటు ఎందుకు? అంటూ అప్పట్లో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే... అంతలోనే గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివార్సిటీ ప్రాంతాన్ని రాజధాని చేయొచ్చు అంటూ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చేశారు... ఇక అమరావతి ప్రాంతాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధానిగా ప్రతిపాధిస్తే అద్భుతం అంటూ పూర్తి సహకారం అందిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పేసారు... వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని ప్రతిపాదన స్థానంలో మూడు రాజధానులు అంటూ స్వరం మార్చారు... ఇక ఇప్పుడు అది పక్కన పెట్టి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగన్ రాజధాని అంటూ ప్లాన్-బి ఇదే అనే కొత్త పాట మొదలుపెట్టారు... అసలు అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదని, ముంపు ప్రాంతం అని, అదో స్మశానమని... ఎడారి అని కామెంట్స్ చేశారు...పురాణాల్లో అమరావతి దేవతల రాజధాని అని కూడా తెలియని వైసీపీ నేతలు... గుంటూరు జిల్లాలోని అమరావతి వైభవం తెలుసుకోని ఆ పార్టీ నేతలు ఇప్పటికి ఆ ప్రాంతం పైన విషం చిమ్ముతున్నారని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు.

గుంటూరు జిల్లాలోని అమరావతికి రెండు వేల సంవత్సరాల చరిత్ర వుంది... శాతవాహనులు అమరావతిని రాజధానిగా చేసుకుని పాలన సాగించారు... ఇక రెడ్డి రాజులు, తూర్పు చాళుక్యులు కూడా అమరావతి రాజధానిగానే పాలన సాగించగా, కాకతీయ వంశానికి చెందిన రాణిరుద్రమదేవి కూడా ఈ ప్రాంత వైభవం గుర్తించి ఇక్కడ పర్యటించి, ఇక్కడి సంస్కృతిని అనుసరించినట్టు చరిత్ర చాటి చెప్పుతోంది... ఇక ప్రపంచంలోనే అత్యంత పురాతన బౌద్ద స్థూపంకు అమరావతి కేంద్ర బిందువు... కృష్ణా తీరప్రాంతంలో అత్యంత సుభిక్ష... సురక్షితమైన స్థలం అమరావతి అని వేల ఏళ్ల నుంచి అక్కడ సాగిన పాలనకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తోంది... అమరావతి ముంపు ప్రాంతం, స్మశానం, ఎడారి అయితే నాటి రాజులు దాన్ని రాజధానిగా ఎందుకు ఎంచుకుంటారు? అక్కడ నుంచి పాలన ఎందుకు సాగిస్తారు? తరాలు మారినా, రాజుల వంశాలు మారినా అమరావతి రాజధానిగానే ఎందుకు అప్పట్లో కొనసాగింది? ఇందుకు కారణాలు అనేకం వున్నాయి... ఇది వ్యవసాయ అనుకూల క్షేత్రం... నీటి వనరులు పుష్కలంగా లభించే ప్రాంతం... సంస్కృతికి ప్రతిరూపం... అందుకే అమరావతినే అప్పటి పాలకులు రాజధానిగా చేసుకున్నారు... ఇక ఇప్పుడు రాజకీయ లబ్దికోసం, మనుగడ కోసం వైసీపీ నేతలు అమరావతిని వక్రకోణంలో ప్రజలకు పరిచయం చేయాలి అనే ఆలోచన చేయటం వారి అవివేకానికి నిదర్శనంగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు..

ఏపీ సీఎం చంద్రబాబు ఓ విజన్ వున్న నేత... ముందస్తు ఆలోచనల మేధావి... ఇది జగం ఎరిగిన సత్యం... అమరావతిని ఆయన రాజధానిగా ఎంచుకోవడం వెనుక ఆయన అనుభవం వుంది... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు సీఎం గా బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబు నాలుగు వందల ఏళ్ల చరిత్ర వున్న హైదరాబాద్ అభివృద్ధికి శ్రీకారం చుట్టినప్పుడు అనేక ఇబ్బందులు వచ్చాయి... నిజాం నవాబ్ పాలనలో నిర్మించిన రోడ్లు, మురుగునీటి వ్యవస్థ, మంచినీటి సరఫరా అప్పట్లో చంద్రబాబుకు సవాల్ అయ్యాయి... హైదరాబాద్ అభివృద్ధి పనులకు అడుగడుగునా సమస్యలు వచ్చాయి... ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, రోడ్ల విస్తరణ, బహుళ అంతస్థు భవనాల నిర్మాణం కోసం ఏళ్ల కొద్దీ కోర్టు కేసులు అప్పట్లో చంద్రబాబు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది... ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని 50 శాతం మేరకు మాత్రమే ఆయన వేగంగా అభివృద్ధి చేయగలిగారు... హైదరాబాద్ ఓల్డ్ సిటీ లోనూ ఇవే సమస్యల వల్ల అక్కడ అభివృద్ధి నామమాత్రమే అయింది.. ఇక సైబరాబాద్ నిర్మాణంలో ఇలాంటి సమస్యలు రాలేదు... దింతో సైబరాబాద్ వేగంగా అభివృద్ధి చెందింది... ఈ అనుభవంతోనే చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారు అనేది మేధావుల విశ్లేషణ... సైబరాబాద్ నిర్మాణం సమయంలోనూ నిధుల ఇబ్బంది భారీగా వచ్చినా చంద్రబాబు దాన్ని తన సామర్థ్యంతో నెట్టుకు వచ్చారని... రాజధానిలో అభివృద్ధి పనులు ఒక్కసారి ఊపు అందుకుంటే అవి అనంతంగా సాగిపోతాయని... ఇదే చంద్రబాబు అనుభవం అని వారు వివరించారు...

ఆంధ్రప్రదేశ్ కు అయిదేళ్లు సీఎంగా పని చేసిన జగన్ ఏపీ రాష్ట్రానికి పనికి వచ్చేలా ఒక్క నగరాన్ని కూడా అభివృద్ధి చేయకపోవటం ఆయన పాలన అనుభవ రాహిత్యాన్ని చెప్పకనే చెబుతోందని అంటున్నారు రాజకీయ నిపుణులు,కూటమి నేతలు... విశాఖపట్నంలో తాను ఉండేందుకు వందల కోట్ల ప్రజా ధనంతో ఫ్యాలెస్ నిర్మాణం చేసుకున్న వైసిపి అధినేత విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఒక్క భవనం కూడా ఎందుకు నిర్మించ లేదన్న ప్రశ్న కు జవాబు చెప్పే వారు లేరు.....ఇంకా ఆ అంశం మరుగున పడక ముందే ఇప్పుడు హటాత్తుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగన్ రాజధాని అనటం కేవలం ప్రజల దృష్టి మళ్ళించి పబ్బం గడుపుకోవటానికే అంటూ తీవ్రంగా ఆరోపిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళ తో పాటు అధికారం లోని నేతలు... జగన్ ఓ వ్యాపార వేత్త... చేసే ప్రతి పనిలో తన లాభం చూసుకుంటారు... లాభం లేనప్పుడు అమరావతినే కాదు... అమెరికా కూడా పనికిమాలిన ప్రాంతం అనే అంటారని విమర్శించటం తో పాటు ఎద్దేవా చేస్తున్నారు.. మూడు రాజధానులు పోయాయి... ఇప్పుడు మావిగన్ వచ్చింది... ఇంకో ఏడాది పోతే ఇంకో కొత్త ప్రతి పాదన ఆయన నోట వస్తుంది... ఇది ఆయన పాలసీ... అలా చేస్తేనే నాలుగు కాలాల పాటు ప్రజల్లో ఆయన పైన చర్చ జరుగుతుంది.. ఆయనకు కావాల్సింది అదే... ఆంధ్రప్రదేశ్ పైనా, ప్రజల భవిష్యత్ పైనా ఆయనకు ఎలాంటి ఖచ్చితమైన అభిప్రాయం, ప్రణాళిక లేదనీ కుండ బద్దలు కొడుతున్నారు కూటమి లోని అమాత్యులు.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story