Off The Record: అన్నామలై నిర్ణయం వెనక అసలు కారణం అదేనా?
Off The Record: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై పోటీ చేయడం లేదు. దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? పార్టీ అధిష్టానం వ్యూహం ఏంటి?
Off The Record: అన్నామలై నిర్ణయం వెనక అసలు కారణం అదేనా?
Off The Record: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు..? బీజేపీ అధిష్టానం టికెట్ నిరాకరించిందా..? అన్నామలై స్వయంగా పోటీ చేయబోనని తేల్చి చెప్పారా..? అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు కుదరడంతో అన్నామలైని తప్పించడం ఒక షరతుగా మారిందా..? ఈ ఊహాగానాలను ఖండించిన అన్నామలై మనసులో అసలు ఏముంది..? ఆయన చెబుతున్నట్టు నిజంగానే.. ఎన్డీయే తరఫున పూర్తి స్థాయి ప్రచారంపైనే ఫోకస్ పెట్టనున్నారా..? ఇంతకీ తమిళనాడు ఎన్డీయే కూటమిలో ఏం జరుగుతోంది..? వాచ్ దిస్ ఎక్స్‌క్లూజివ్ ఫోకస్.
తమిళనాడులో బీజేపీకి అధికారం అప్పగించడమే లక్ష్యంగా పని చేసిన ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ నెల 23న జరగబోయే ఎన్నికల్లో బరిలో నిలిచే బీజేపీ అభ్యర్థుల జాబితాలో అన్నామలై పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమిళ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిన పేరొందిన అన్నామలై పోటీకి దూరంగా ఉండటం ఏంటన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అన్నామలై మాత్రం.. ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి ఏ ఇతర కారణాలు లేవని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను ఎన్నికల రేసులో కానీ, బీజేపీ అభ్యర్థుల జాబితాలో కానీ లేను.. అయితే ఈ ఎన్నికల్లో తమిళనాడు వ్యాప్తంగా బీజేపీ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేయటమే నా బాధ్యత. అధిష్టానం ఆదేశించినట్టు తమిళనాడులో పూర్తి స్థాయి ప్రచారం చేస్తా. ఇది పార్టీ అధిష్టానం నాకు అప్పజెప్పిన బాధ్యత.. ఈ బాధ్యతను నేను పూర్తి చేయాల్సి ఉంది" అని అన్నామలై చెప్పుకొచ్చారు.
ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి కూడా పోటీ చేయాలని అనుకోవటం లేదన్నారు అన్నామలై. ఈ విషయం గతంలోనే బీజేపీ కోర్ కమిటీకి తెలియజేశానని తెలిపారు. తమిళనాడు నుంచి కేంద్ర పెద్దల ఆమోదం కోసం పంపించిన ప్రతిపాదిత అభ్యర్థుల జాబితాలోనూ తన పేరు లేదనీ ఆయన చెప్పారు. తనకు టికెట్ నిరాకరించారన్న వార్తలో వాస్తవం లేదని, తానే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అన్నామలై మీడియాకు క్లారిటీ ఇచ్చారు. తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇంఛార్జి పీయూష్ గోయెల్‌కు సైతం ఈ విషయం తెలియజేశానన్నారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో అన్నామలై చుట్టూ పలు రాజకీయ పరిణామాలు, వివాదాలు చుట్టుముట్టాయి. అంతకుముందే.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై పేరు ప్రముఖంగా వినిపించింది. అన్నామలై నేతృత్వంలోనే బీజేపీ అధికారమే లక్ష్యంగా పోటీ చేయనుందన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ అన్నామలైపై వచ్చిన ఆరోపణలు పెను దుమారం రేపడంతో బీజేపీ అధిష్టానం అన్నామలై స్థానంలో నైనార్ నాగేంద్రన్ను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. ఏఐఏడీఎంకేతో పొత్తు పునరుద్ధరణలో భాగంగా, ఆ పార్టీ డిమాండ్ మేరకు ఈ మార్పు జరిగినట్లు రాజకీయ విశ్లేషణలు వెలువడ్డాయి. గతంలో కోయంబత్తూరులో ఒక మహిళా రిపోర్టర్‌పై అన్నామలై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపై ప్రెస్ క్లబ్, ఇతర మీడియా సంస్థలు అప్పట్లో నిరసన వ్యక్తం చేశాయి. అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల ఘటనలో డీఎంకే ప్రభుత్వం నిజాలను దాస్తోందని ఆరోపిస్తూ ఆయన నిరసన చేపట్టారు. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పాదరక్షలు ధరించబోనని ప్రతిజ్ఞ కూడా చేశారు. డీలిమిటేషన్, మూడు భాషల విధానం వంటి అంశాలపై ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ వైఖరిని తప్పుపడుతూ అన్నామలై చేసిన ఘాటు వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి.
ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్ ఈ.వి.రామస్వామి విగ్రహాలపై అన్నామలై చేసిన వ్యాఖ్యలు తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. బీజేపీ అధికారంలోకి వస్తే దేవాలయాల ముందు ఉన్న పెరియార్ విగ్రహాలను తొలగిస్తామని 2023 నవంబర్‌లో ప్రకటించారు. తమిళనాడులో హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిరసిస్తూ పెరియార్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారని, అలాంటి వ్యక్తి విగ్రహాలు ఆలయాల ముందు ఉండటం సరికాదని అన్నామలై వాదించారు. ఈ వ్యాఖ్యలను డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు తీవ్రంగా ఖండించాయి. పెరియార్ తమిళనాడు ఆస్తి అని, ఆయనను కించపరచడాన్ని ప్రజలు అంగీకరించరని డీఎంకే ఘాటుగా స్పందించింది. పెరియార్ విగ్రహాల తొలగింపు అంశం ద్రవిడ ఉద్యమం, హిందూత్వం మధ్య ఘర్షణను మరింత తీవ్రం చేసింది. వివాదం పెరుగుతుండటంతో, విగ్రహాలను తొలగించడం కంటే, గౌరవంగా వేరే ప్రదేశానికి మారుస్తామని అన్నామలై కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ వివాదం తమిళనాడులో ద్రవిడ వాదం, బీజేపీ మధ్య రాజకీయ వైరుధ్యాన్ని పెంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో ఆశించిన సీట్లు రాకపోవడానికి అన్నామలై విధానాలే కారణమన్న వాదనలు బహిరంగంగానే వినిపించాయి. ఆ తర్వాతి పరిణామాల క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అన్నామలై తప్పించింది ఆ పార్టీ అధిష్టానం.
ఈ వివాదాలు, ఆరోపణల నేపథ్యంలోనే అన్నామలై బీజేపీ అధిష్టానం టికెట్ నిరాకరించిందన్న వాదన లేకపోలేదు. అయితే ఈ వార్తలు అవాస్తమని ఖండించిన అన్నామలై.. ఈ ఎన్నికలకు స్వయంగా తానే దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. అయితే ఎన్నికల బరిలో లేకపోయినా, తమిళనాడులో బీజేపీ, ఎన్డీఏ కూటమి తరపున కీలక స్టార్ క్యాంపెయినర్‌గా మాత్రం వ్యవహరిస్తున్నారు. మరోవైపు గత తమిళనాడు ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ.. కూటమి సీట్ల పంపకంలో భాగంగా ఈసారి 27 చోట్ల బరిలోకి దిగుతోంది. కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ అవినాశి నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా.. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మైలాపూరు నుంచి బరిలోకి దిగుతున్నారు.


