BURNING TOPIC: తైవాన్‌పై చైనా కన్ను.. అడ్డుగా అమెరికా! యుద్ధం తప్పదా?

BURNING TOPIC: ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ కేంద్రమైన తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు, అమెరికా వ్యూహాత్మక అడ్డంకులపై ప్రత్యేక కథనం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Nov 2026 10:43 AM IST
BURNING TOPIC
X

BURNING TOPIC: తైవాన్‌పై చైనా కన్ను.. అడ్డుగా అమెరికా! యుద్ధం తప్పదా?

BURNING TOPIC: ప్రపంచ చిత్ర పటంలో చూస్తే ఆసియా ఖండంలో దాదాపు పావు వంతు ఆక్రమించి కనిపిస్తుంది చైనా.. అయినా ఆ దేశానికి భూ దాహం తీరదు. చైనాకు ప్రపంచంలోనే అత్యధికంగా 14 దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. ఏ దేశంతోనూ కూడా దానికి సరిగ్గా పడదు.

విచిత్రమేమిటంటే చైనా తనతో సరిహద్దులు పంచుకునే దేశాలతోనే కాకుండా, సముద్ర తీరం ద్వారా పొరుగున ఉన్న దేశాలతో కలిపి మొత్తం 17 కంటే ఎక్కువ దేశాలతో సరిహద్దు తగాదాలను కొనసాగిస్తోంది. అన్ని దేశాలకూ తన త్రివిధ దళాల శక్తితో బెదిరించే ప్రయత్నం చేస్తుంది.

అ సమయంలో తన సమీపంలోనే ఉన్న ఓ చిన్న భూభాగం డ్రాగన్‌కు చొరక రాని కొయ్యగా మారింది. పైగా తానే అసలైన చైనా అంటుంది.. బీజింగ్ కేంద్రంగా కొనసాగుతున్న దేశం 'పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా' అయితే.. తైపీ కేంద్రంగా ఉన్న ఈ చిన్న భూభాగం పేరు 'రిపబ్లిక్ ఆఫ్ చైనా' అయితే వ్యవహారికంగా తైవాన్ పేరుతో పిలుస్తారు.

చైనా ఆగ్నేయ సరిహద్దుకు 130 కిలో మీటర్ల దూరంలో సముద్రంలోని ఓ ద్వీపం తైవాన్. వైశాల్యం కేవలం 36,000 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే చైనా మొత్తం భూభాగంలో తైవాన్ పరిమాణం కేవలం 0.37% మాత్రమే ఉంటుంది భౌగోళికంగా చూస్తే మన కేరళకన్నా చిన్నది..

తైవాన్‌లో 2 కోట్ల 32 లక్షల మంది నివసిస్తు్న్నారు. కాగా చైనా ఒత్తిడి కారణంగా తైవాన్‌కు ఐక్యరాజ్య సమితిలో అధికారిక సభ్యత్వం లేదు. సమితి దానిని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించదు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 దేశాలు మాత్రమే తైవాన్‌ను అధికారికంగా ఒక స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ, దౌత్య సంబంధాలను కలిగి ఉన్నాయి. అయితే అధికారికంగా దౌత్య సంబంధాలు లేనప్పటికీ, తైవాన్ దాదాపు 59 దేశాలతో బలమైన సంబంధాలను కొనసాగిస్తోంది.

అమెరికా, భారత్, జపాన్, యూరోప్ దేశాలు తైవాన్‌తో అధికారిక పెట్టుకోనప్పటికీ, వాణిజ్య, సాంస్కృతిక, సాంకేతిక, వ్యూహాత్మక రంగాలలో అత్యంత సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాయి.

అయితే చైనా ఎప్పటి నుంచో తైవాన్‌ను పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకోవాలని భావిస్తోంది. వన్ చైనా పాలసీ ప్రకారం తైవాన్ కూడా తమ అంతర్భాగం అని బీజింగ్ వాదిస్తోంది. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి. చారిత్రికంగా తైవాన్ కూడా చైనాతో అంతర్భాగమే.

గతంలో కొంత కాలం జపాన్ పాలనతో ఉన్నప్పటికీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ చైనా పరిధిలోకి వచ్చింది. అయితే 1949లో చైనాలో అంతర్యుద్దం వచ్చింది. అప్పటి వరకూ చైనాను పాలిస్తున్న చియాంగ్ కై-షెక్.. మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయారు. అనంతరం చియాంగ్ వర్గం వారు తైవాన్‌కు పారిపోయి, ఆ ప్రాంతంపై పరిపాలనా నియంత్రణను కొనసాగించారు.

మావో తైవాన్‌పై దాడి చేయాలని మావో నిర్ణయించినా, ఉత్తర కొరియాలో కమ్యూనిస్టులకు సాయం చేయడం మీద దృష్టి పెట్టారు. ఈలోగా చియాంగ్ కై-షెక్ క్రమంగా తైవాన్‌ మీద పట్టు బిగించారు. తర్వాత కాలంలో ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా దీనికి అండగా నిలిచింది.

తైవాన్‌ను తన స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి చైనా చేయని ప్రయత్నం లేదు. తైవాన్‌ను తమ దేశంలో భాగమేనని వాదిస్తూ, అవసరమైతే బలాన్ని ఉపయోగించి అయినా సరే విలీనం చేసుకుంటామని తరచూ బెదిరిస్తూ ఉంటుంది. తైవాన్ పూర్తి స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందితే తన సమగ్రతకే ముప్పుగా మారుతుందని చైనా భయపడుతోంది.

తరచూ తైవాన్ జలసంధితో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ద విమానాలతో విన్యాసాలు చేస్తూ తైవాన్‌ను బెదిరించే ప్రయత్నం చేస్తోంది. అయితే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ చైనాకు లొంగేది లేదని తైవాన్ గట్టిగా చెబుతోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2027 నాటికి తైవాన్‌ను ఆక్రమించడానికి అవసరమైన సైనిక సామర్థ్యాలను సిద్ధం చేసుకోవాలని తమ సైన్యానికి ఆదేశించారు.

అయితే ఇక్కడే అమెరికా డ్రాగన్ ప్రయత్నాలకు మోకాలడ్డుతోంది. అమెరికా తైవాన్‌కు గట్టిగా మద్దతు ఇవ్వడం వెనుక బలమైన భౌగోళిక రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి.

పసిఫిక్ మహాసముద్రంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి తైవాన్ అమెరికాకు ఒక రక్షణ గోడ లాంటిది. ప్రపంచవ్యాప్తంగా జరిగే సముద్ర వ్యాపారంలో అత్యధికం ఈ మార్గం గుండానే సాగుతుంది. ఈ ప్రాంతం చైనా ఆధీనంలోకి వెళ్తే, అంతర్జాతీయ నౌకల రాకపోకలను చైనా నియంత్రించే ప్రమాదం ఉందిచైనా గనుక తైవాన్‌ను స్వాధీనం చేసుకుంటే, పసిఫిక్ మహాసముద్రంలో ఆ దేశ నావికాదళానికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది.

అప్పుడు అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, విమానాలు, ఆధునిక ఆయుధాల నుండి కృత్రిమ మేధ డేటా సెంటర్ల వరకు ప్రతిదానికీ సెమీకండక్టర్ చిప్స్ అత్యంత కీలకం.

ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన చిప్స్‌లో దాదాపు 90% కేవలం తైవాన్‌కు చెందిన TSMC సంస్థే తయారు చేస్తుంది. ఆ సాంకేతికత చైనా చేతుల్లోకి వెళ్లితే అమెరికా సాంకేతిక రంగానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది.

తైవాన్ రక్షణ విషయంలో అమెరికా మొదటి నుంచీ చైనాతో మైండ్ గేమ్ ఆడుగోంది. తైవాన్ తరపున తాము పోరాడతామని అమెరికా ఎప్పుడూ ప్రకటించలేదు. అదే సమయంలో అలా చేయబోమని కూడా చెప్పడం లేదు. అగ్రరాజ్యం 1954లో తైవాన్ తో ఒప్పంద కుదుర్చుకుకొని అక్కడ స్థావరం ఏర్పాటు చేసింది..

వియత్నాం యుద్ధ సమయంతో వి 30 వేల మంది సైనికులను అక్కడ మొహరించింది. అయితే 1979లో చైనాలో తైవాన్ అంతర్భాగం అంటూ అమెరికా అధికారికంగా గుర్తించింది. దీంతో అక్కడ సైనిక స్థావరాలను ఎత్తేసింది. కానీ తైవాన్‌కు అమెరికా ఆయుధాలను విక్రయిస్తోంది. అదే సమయంలో 500 మంది అమెరికన్ మిలటరీ శిక్షకులు తైవాన్‌లో ఉన్నారు. తైవాన్ సమీపంలోని జపాన్‌ను చెందిన కడీనా, ఓకినావాల్లో అమెరికా స్థావరాలు ఉన్నాయి.

అక్కడ 54 వేల మంది అమెరికన్ సైనికులు ఉంటారు. మరోవైపు ఫిలిప్పీన్స్‌లో కూడా 9 అమెరికా స్థావరాలు ఉన్నాయి అక్కడ 23, 500 మంది అమెరికన్ సైనికులు ఉంటారు.

చైనా దగ్గర 360 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి. వీటితో తైవాన్‌ను స్వాధీనం చేసుకోవడం చైనాకు అంత సులభమేమీ కాదు. చైనా ప్రధాన భూభాగానికి 130 కిలో మీటర్ల దూరంలోనే తైవాన్ ఉన్నా దానిపై పట్టు సాధించడం అంత సులభం కాదు.

ఇందుకు కారణం ప్రతీ ఏటా తైవాన్ జలసంధిలో 6 తుపానులు, బలమైనా గాలులు వీస్తుంటాయి. కేవలం ఏప్రిల్, అక్టోబర్ మాసాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలోనే దాడులు చేయడం అంటే చాలా కష్టమైన వ్యవహారం. ఒకవేళ చైనా దాడి చేస్తే అమెరికా, జపాన్ వంటి దేశాలు సైనికంగా జోక్యం చేసుకునే అవకాశం ఉంది.

తైవాన్‌పై యుద్ధం వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుమారు $10 ట్రిలియన్ల ఇది ప్రపంచ జిడిపిలో 10%. చైనాకు కూడా దీనివల్ల తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుంది. ఈ కారణంగా చైనా ప్రస్తుతానికి తైవాన్‌తో మానసిక యుద్ధానికే పరిమితం అవుతోంది. ఏటాడైనా తైవాన్ ప్రజల మనసు మారి తమలో విలీనం కాక తప్పదనే అత్యాశ కూడా ఉంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్