Burning Topic: వీధి కుక్క కోసం కొట్టుకుంటున్న రెండు దేశాలు
Burning Topic: ఒక వీధి కుక్క కోసం రెండు దేశాల మధ్య గొడవ? 'పెర్రో క్యారమెల్' అనే కుక్క జాతి తమదంటే తమదని బ్రెజిల్, మెక్సికో దేశాలు ఎందుకు వాదించుకుంటున్నాయి?
Burning Topic: వీధి కుక్క కోసం కొట్టుకుంటున్న రెండు దేశాలు
Burning Topic: సాధారణంగా దేశాల యుద్దాలు, సరిహద్దు వివాదాలు, వాణిజ్య ఘర్షణలు జరుగుతుంటాయి. మతం, రాజకీయ సిద్ధాంతాల ఆధారంగా పోరాడే దేశాలూ ఉన్నాయి.. కానీ ఓ కుక్క కోసం రెండు దేశాలు వీధినపడ్డాయి.. ఆ కుక్క జాతి మాదంటే మాదని రెండు దేశాల ప్రభుత్వాలు, ప్రజలు వాదనలకు దిగారు. ఈ వివాదం అంతటికీ కారణం పెర్రో కారామెల్ అనే వీధి కుక్క.. ప్రస్తుతం లాటిన్ అమెరికా దేశాలు బ్రెజిల్, మెక్సికోల మధ్య ఈ శనకం తమ దేశానికి చెందిన జాతి అంటే, కాదు అది మాదే అంటూ ఘర్షణ పడతున్నాయి. ఈ ముదురు గోధుమ రంగు వీధికుక్క తమ దేశ చరిత్ర, సంస్కృతులకు అసలైన ప్రతీక అని బ్రెజిల్ వాదిస్తుంటే.. మెక్సికో దీనిని ఏకంగా తమ జాతీయ చిహ్నాలలో ఒకటిగా ప్రకటించుకోవడం ఈ వివాదానికి దారితీసింది. ఈ కుక్క జాతి మాదంటే మాదని ఈ రెండు పెద్ద దేశాలు సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్న వైనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
బ్రెజల్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సాకర్ గేమ్.. ఆ తర్వాత సాంబా డాన్స్.. వీటితో పాటు అక్కడి వీధుల్లో తిరుగాడే ఈ శునకాలు. బ్రెజిల్ ప్రజల దైనందిన జీవితంలో పెర్రో కారామెల్ జాతికి చెందిన ఈ శునకాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి ప్రజల టీ షర్టుల మీద కనిపిస్తాయి. అలాగే బ్రెజిలియన్ మీమ్స్ కూడా ఉన్నాయి. తమ పాటల్లో కూడా బ్రెజిలియన్స్ కారామెల్ పేరును ప్రస్థావిస్తారు. అనియంత్రిత సంతానోత్పత్తి కారణంగా వీధుల్లో తామర తంపరగా పెరిగిపోయిన ఈ శునకాలను అక్కడి ప్రజలు ఎంతో ఇష్టపడతారు. బ్రెజిల్ అంతటా క్యారమెల్ వీధి కుక్కలు కనిపిస్తాయి, స్థానికులు వాటికి ఆహారం పెట్టి, సంరక్షిస్తారు. గతంలో బ్రెజిల్ అధికారిక కరెన్సీ నోట్లపై ఈ కారామెల్ శునకం చిత్రాన్ని ముద్రించాలంటూ ఆన్‌లైన్‌లో ఒక పెద్ద ఉద్యమమే నడిచింది. ఆ పిటిషన్‌కు ఏకంగా 50 వేల మందికి పైగా పౌరులు మద్దతు కూడా తెలిపారు.
ఈ కథ ఇలా సాగుతుండగా ఊహించని విధంగా మెక్సికో దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ప్రభుత్వ పర్యావరణ సంస్థ ప్రొపీమ్ ఇటీవల కారామెల్ శునక జాతిని తమ దేశపు 'నాలుగో జాతీయ చిహ్నం'గా అధికారికంగా గుర్తించింది. ఈ బ్రెజిల్ వాసులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సోషల్ మీడియాలో మెక్సికో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున డిజిటల్ యుద్ధం మొదలుపెట్టారు. కారామెల్ డాగ్‌కు మెక్సికో చరిత్రకు ఎలాంటి సంబంధం లేదు.. కేవలం బ్రెజిల్‌కు మాత్రమే సొంతం.. మా వీధి కుక్కను దొంగిలించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?’’ అంటూ బ్రెజిల్ నెటిజన్లు తీవ్ర స్థాయిలో హ్యాష్‌ట్యాగ్‌లతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమ సాంస్కృతిక వారసత్వమైన కారామెల్ శునకాన్ని తమ నుంచి ఎవరూ వేరు చేయలేరని స్పష్టం చేస్తున్నారు. రెండు దేశాల ప్రజల మధ్య ఇంటర్నెట్ వేదికగా సాగుతున్న ఈ 'టాగ్ వార్' ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో ఆసక్తికర కథనంగా మారింది.
కారామెల్ జాతి శునకాలకు పెద్ద చరిత్రే ఉంది. ఈ కుక్క సుమారు 300 భిన్న జాతుల సమ్మేళనం. శతాబ్దాల కిందట ఇటలీ, జర్మనీ, పోర్చుగీసు, జపాన్, స్పెయిన్ తదితర దేశాల నుంచి బ్రెజిల్‌కు వలస వచ్చినవారు తమ వెంట వారి శునకాలను తీసుకొచ్చారు. అలా వచ్చిన రకరకాల శునక జాతుల మధ్య ఇన్‌బ్రీడింగ్ జరిగి "కారామెల్" జాతి పుట్టిందని బ్రెజిలియన్లు చెబుతారు. అలా ఆ కుక్కను తమ దేశ వారసత్వంగా భావిస్తారు. అందువల్ల ఆ శునకంపై హక్కులు తమవేనని అంటున్నారు.. 2023లో, బ్రెజిల్ చట్టసభ సభ్యులు క్యారమెల్ రంగు వీధి కుక్కలకు జాతీయ వారసత్వ హోదాను కల్పించే ఒక బిల్లును ప్రవేశపెట్టారు కానీ ఇంకా చట్ట రూపం దాల్చలేదు. అయితే సావో పాలోతో సహా కొన్ని రాష్ట్రాలు, వాటిని సాంస్కృతిక సంపదగా ప్రకటిస్తూ తమ సొంత చట్టాలను ఆమోదించాయి. అయితే క్యారమెల్ రంగు వీధి కుక్క ఒకే దేశానికి చెందినది కానవసరం లేదని పర్యావరణవాదులు అంటున్నారు.
ఒక అధ్యయనం ప్రకారం, బ్రెజిల్‌లో 20 మిలియన్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయి. వాటిలో 90 శాతానికి పైగా గోధుమ రంగులో ఉంటాయి. క్యారమెల్ జాతి వీధి కుక్కలు జాతీయ చిహ్నాలుగా మారినప్పటికీ అవి చాలా వరకూ వీధుల్లో ధీనంగా జీవిస్తున్నాయి. వాటి పొట్టి, గోధుమ రంగు బొచ్చు తక్కువ కీటకాలను ఆకర్షిస్తుంది, ఉష్ణమండల సూర్యరశ్మిని ప్రతిబింబించడం ద్వారా చల్లగా ఉంచుతుంది. వేటాడే జంతువుల నుండి మభ్యపెట్టేలా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. వాటి మిశ్రమ జాతి కొన్ని జన్యు వ్యాధుల నుండి కూడా కాపాడుతోందని వైద్యులు చెబుతున్నారు. ఒకప్పుడు ఎవరికీ పట్టని ఈ వీధి కుక్కలు నేడు బ్రెజిలియన్లకు గర్వకారణంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం పెర్రో కారామెల్ శునకం వారసత్వం కోసం బ్రెజిల్, మెక్సికో దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఎలా ముగుస్తుందో చూడాల్సిందే.




