Burning Topic: ప్రపంచానికి హర్మూజ్‌ టెన్షన్‌ మళ్లీ యుద్ధం తప్పదా..? ట్రంప్ డేంజర్ ప్లాన్

Burning Topic: అమెరికా-ఇరాన్ మధ్య మళ్ళీ పెరుగుతున్న ఉద్రిక్తతలు. హర్మూస్ జలసంధి వివాదం, ట్రంప్ బెదిరింపులు మరియు శాంతి ఒప్పందం దిశగా జరుగుతున్న ప్రయత్నాలపై పూర్తి విశ్లేషణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 April 2026 7:28 AM IST
Burning Topic
X

Burning Topic: ప్రపంచానికి హర్మూజ్‌ టెన్షన్‌ మళ్లీ యుద్ధం తప్పదా..? ట్రంప్ డేంజర్ ప్లాన్

Burning Topic: రెండో దశ చర్చలకు సిద్ధమైన అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదరబోయే ఒప్పందం విషయంలో ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. ఒక అడుగు ముందుకు పడితే, రెండడుగులు వెనక్కి అన్నట్లుగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా మరోసారి చర్చలకు రంగం సిద్దం అవుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వరుస చేస్తున్న ప్రకటనలు, వాటిని ఇరాన్‌ ఖండించుకుంటూ పోతుండడం మరింత గందరగోళానికి దారి తీస్తున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దళాల సంయుక్త దాడులతో పశ్చిమాసియాతో యుద్ధం ప్రారంభమైంది ఇప్పటిదాకా.. ఇరాన్‌లో 3,000 మంది, లెబనాన్‌లో 2,100 మంది, ఇజ్రాయెల్‌లో 23 మంది, గల్ఫ్‌ దేశాల్లో డజను మందికి పైగా మరణించారు. అమెరికా సైనికుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధంలో అగ్రనాయకత్వాన్ని కోల్పోయినా, సర్వశక్తులూ కూడ గట్టుకొని మరీ విజృంభిస్తోంది ఇరాన్. ఇరు దేశాల మధ్య కాల్పుల విమరణ కుదిరి చర్చలు మొదలైనా పరిస్థితులు మారలేదు.

హర్ముజ్‌ విషయంలో ఇరాన్‌ ఓ మెట్టు కిందకు దిగింది. జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ప్రపంచానికి శుభవార్త చెప్పింది. లెబనాన్- ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ గడువు ముగిసేదాకా హర్మూజ్ పూర్తిగా తెరిచే ఉంటుందని ప్రకటించింది. ఈ వ్యవధిలో అన్ని వాణిజ్య నౌకలు హర్మూజ్ మీదుగా రాకపోకలు సాగించొచ్చని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కీలక ట్వీట్ చేశారు. లెబనాన్‌లో కాల్పుల విరమణకు అనుగుణంగా, ఇరాన్‌కు చెందిన పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించిన సమన్వయ మార్గంలో నౌకల కోసం హర్మూజ్ జలసంధి మార్గం తెరిచే ఉంటుందదని తెలిపారు. అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ గడువు ముగిసే వరకు అన్ని వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని ఆయన పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధి తెరుచుకున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు 10 శాతానికిపైగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 89.13 డాలర్లకు, అమెరికా క్రూడ్ ఆయిల్ 81.28 డాలర్లకు చేరాయి.

అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఎప్పటిలాగే ఇరాన్ విషయంలో బెదిరింపు ప్రకటనలు చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ఈనెల 21తో ముగియనుంది. ఈలోగా ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు ట్రంప్. ఒప్పందం కుదరకపోతే.. 21వ తేదీ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించకపోవచ్చని తెలిపారు. ఆ దేశంపై మళ్లీ బాంబులు వేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్‌ నౌకల రాకపోకలపై తమ దిగ్బంధనం కొనసాగుతోందన్నారు. ఇరాన్‌తో కలిసి దాని అణుకేంద్రాల నుంచి శుద్ధి చేసిన యురేనియంను వెలికితీయనున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. అందుకు తమకు భారీగా సామగ్రి కావాల్సి ఉంటుందన్నారు. దాన్ని త్వరలోనే అమెరికా భూభాగంలోకి తరలిస్తామని వెల్లడించారు. ఈసందర్భంగా అణ్వాయుధాన్ని వదిలేస్తామని ఇరాన్ నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చిందన్నారు. చర్చలు విఫలమైతే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదటికి వస్తాయని ట్రంప్‌ వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైపోయింది.

కాగా డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్‌ నౌకల రవాణాపై తమ దిగ్బంధనం కొనసాగుతుందంటూ అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనపై ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ ఘాలిబఫ్‌ మండిపడ్డారు. దిగ్బంధనం కొనసాగితే హర్మూజ్‌ జలసంధిని మూసేస్తామని హెచ్చరించారు హర్మూజ్‌ జలసంధి, శాంతిఒప్పందం తదితర విషయాలపై ట్రంప్‌ ఒక గంటలోనే 7 పోస్టులు చేశారని ప్రస్థావించారు అవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. దౌత్య చర్చలపై ముందుకుసాగుతుండగా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇరాన్‌ అంగీకరించదని మహమ్మద్‌ ఘాలిబఫ్‌ స్పష్టంచేశారు. అబద్ధాలతో యుద్ధం గెలవలేరని.. చర్చల్లో కూడా పురోగతి సాధించలేరని ట్రంప్‌ను విమర్శించారు. హర్మూజ్ జలసంధి మార్గంలో ప్రయాణం కేవలం నిర్దేశిత రూట్‌లోనే ఉంటుంది. ఇరాన్ అనుమతి తప్పనిసరి. జలసంధి తెరిచి ఉంచాలా, మూసేయాలా అన్నది క్షేత్ర స్థాయిలో నిర్ణయిస్తాం సోషల్ మీడియా ద్వారా కాదు' అని ఘాలిబఫ్ స్పష్టం చేశారు.

కాగా డొనాల్డ్ ట్రంప్ గంట వ్యవధిలో వరుసగా చేసిన ట్వీట్స్. దానికి ఇరాన‌ ఇచ్చిన కౌంటర్స్ ఇలా ఉన్నాయి.. హర్ముజ్‌ జలసంధి పూర్తిగా తెరిచి ఉందని ట్రంప్‌ చెప్పారు.. తమ అనుమతితోనే తెరుస్తామని ఇరాన్‌ అంటోంది. నావికాదళ ఆంక్షలు త్వరగా ముగుస్తాయని ట్రంప్‌ తెలిపారు.. అమెరికా బ్లాకేడ్‌ కొనసాగుతోందని ఇరాన్‌ చెప్పింది. ఇరాన్‌ యుద్ధంలో ఓడిపోయిందని ట్రంప్‌ అన్నారు.. తాము యుద్ధంలో నిలబడ్డామని ఇరాన్‌ స్పష్టం చేసింది. చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని ట్రంప్‌ తెలపగా.. ఆయన చెప్పిన అంశాలపై చర్చలు జరగలేదని ఇరాన్‌ చెబుతోంది. శుద్ధి యురేనియం ఇరాన్‌ అమెరికాకు తరలిస్తుందని ట్రంప్‌ చెప్పగా. శుద్ధి చేసిన యురేనియం ఎక్కడికీ తరలించబడదని ఇరాన్‌ అంటోంది. హర్ముజ్‌ ద్వారా అమెరికాకు ఫ్రీ చమురు రాబోతోందని.. ఇరాన్‌ ఒప్పుకుందని ట్రంప్‌ చెప్పడం.. అదంతా అబద్ధమేనని ఇరాన్‌ ప్రకటించింది. త్వరలోనే ఒప్పందం అని ట్రంప్ చెబుతుండగా‌.. చర్చలు క్లిష్టదశలో ఉన్నాయని ఇరాన్‌ స్పష్టీకరించింది.

తమతో అమెరికా కుదుర్చుకునే ఎలాంటి ఒప్పందంలో అయినా లెబనాన్ ఉండి తీరాల్సిందే అని ఇరాన్ స్పష్టం చేసింది. కాల్పుల విమరణ ఒప్పందాన్ని పట్టించుకోకుండా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడులను ఖండించింది. లెబనాల్, ఇజ్రాయెల్‌ మధ్య పది రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తర్వాతే హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరవడం ఇక్కడ గమనించాలి. కాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదరగానే లెబనాన్ రాజధాని బీరుట్‌లో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఇజ్రాయెల్ దాడులకు భయపడి దక్షిణ లెబనాన్ సరిహద్దుల్లోని గ్రామాలను ఖాళీ చేసి పరిసర గ్రామాలకు వెళ్లిపోయిన ప్రజలు మళ్లీ తమతమ ఇళ్లకు బయలుదేరారు. అయితే ఇప్పుడే సరిహద్దు గ్రామాలకు వెళ్లొద్దని ప్రజలకు లెబనాన్ అధికారులు సూచించారు. కాల్పుల విరమణఎంత కాలం నిలుస్తుందనే దాన్ని ఇప్పుడే చెప్పలేమంటున్నారు. కాగా ప్రస్తుతానికి లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులేం జరపడం లేదని ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళం తెలిపింది.

ఇక ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికాల మధ్య రెండో విడత చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే.. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమం, హర్మూజ్ జలసంధి నిర్వహణ, ఇరాన్‌కు యుద్ధ నష్టపరిహారం చెల్లింపు వంటి అంశాలపైనే ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉంటే తాను ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణను పొడగిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే లెబనాన్- ఇజ్రాయెల్ 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ముగిశాక, హర్మూజ్ సంక్షోభం ఏ మలుపు తీసుకుంటుంది అనే దానిపై ప్రతిష్టంభన నెలకొంది. లెబనాన్‌లోని ఇరాన్ సమర్ధిత హిజ్బుల్లా మిలిటెంట్లు కాల్పుల విరమణ డీల్‌ను అంగీకరిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. దక్షిణ లెబనాన్‌లోని సరిహద్దు ప్రాంతాలను ఇజ్రాయెల్ దళాలు కబ్జా చేస్తున్నాయని హిజ్బుల్లా మిలిటెంట్లు ఆరోపిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో రాబోయే 10 రోజుల పాటు వారు కాల్పుల విరమణను పాటిస్తారా లేదా అనేది తెలియడం లేదు. మరోవైపు ఇరాన్‌పై దౌత్య, ఆర్థిక ఒత్తిడిని పెంచే అంతర్జాతీయ ప్రయత్నాలు మొదలయ్యాయి. "హర్మూజ్​ జలసంధిని బేషరతుగా తక్షణమే తిరిగి తెరవడం ఒక ప్రపంచ బాధ్యత. ప్రపంచ ఇంధనం, వాణిజ్యం మళ్లీ స్వేచ్ఛగా సాగేలా చేయడానికి మనం చర్యలు తీసుకోవాని ప్రకటించారు బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్. ఈ దిశగా ఫ్రాన్స్​ అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి ఒక అంతర్జాతీయ మిషన్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో భాగంగా చర్చలు జరుపుతున్నట్లు బ్రిటన్​ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. సముద్ర కార్యకలాపాలను స్థిరీకరించడానికి వాణిజ్య నౌకాయానానికి భరోసా ఇవ్వడం, మైన్- క్లియరెన్స్ ఆపరేషన్లకు మద్దతు ఇవ్వాల్సిన ఆవశ్యకతను ఇందులో చర్చించనున్నట్లు చెప్పింది. ఈ దిశగా పారిస్‌లో నిర్వహిస్తున్న సమావేశానికి జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని సహా సుమారు 40 దేశాల నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారని చెబుతున్నారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story