Burning Topic: కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతున్న చైనా సినిమా!
Burning Topic: ఓటీటీల కాలంలో థియేటర్‌కు జనం రావడం కష్టమైన తరుణంలో.. రూ. లక్షలోపు బడ్జెట్‌తో తెరకెక్కిన అత్యంత చెత్త చైనీస్ సినిమా 'నియూ లాయ్' రూ. 20 కోట్ల
Burning Topic: కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతున్న చైనా సినిమా!
Burning Topic: ప్రతి ఇంటా హోం థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ వచ్చిన తర్వాత సగటు ప్రేక్షకుడు థియేటర్ వెళ్లి సినిమా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. ఈ రోజుల్లో ఓ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే మంచి కథాంశం, పేరున్న నటీనటులు, అద్భుతమైన గ్రాఫిక్స్, లోకేషన్స్, వందల కోట్ల బడ్జెట్, , విస్తృతమైన ప్రచారం అవసరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇవన్నీ చూసుకొనే ప్రేక్షకుడు థియేటర్‌కు వెళతాడు. మరోవైపు ఆ చిత్రానికి సంబంధించిన రివ్యూలను సోషల్ మీడియాలో చూసి, అసలు వెళ్లొచ్చా, లేదా అనే నిర్ణయానికి వస్తాడు. కానీ ఓ సినిమా విషయంలో.. పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపించింది.
చైనాలో నిర్మించిన ఈ చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేసింది. అసలు అది సినిమా అని కూడా చెప్పలేం. పైగా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇంత చెత్త సినిమా జీవితంలో చూడలేదని తిట్టుకున్నారు. అసలు ఈ చిత్రం ఏంటి? దీని కథ ఏంటి?
ఈ సినిమా పేరు నియూ లాయ్.. తెలుగులో దీని అర్థం ‘ఆవు వస్తోంది’ అని.. 86 నిమిషాల నిడివి ఉన్న ఈ యానిమేషన్ చిత్రంలో విచిత్రమైన కలల ప్రపంచాన్ని చూపించారు. కొత్తగా పుట్టిన ఓ ఆవు దూడ, పిచ్చుక మధ్య జరిగే కథ నడుస్తుంది.
తల్లి ఆవు తన దూడకు ప్రేమ, నమ్మకం, బాధ్యత, త్యాగం వంటి విలువలనుఎలా నేర్పించిందనేదే ఈ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాను రూపొందించింది కూడా ఏమాత్రం పేరున్నవారు కూడా కాదు. కేవలం ఇద్దరు సాధారణ వ్యక్తులు మాత్రమే.. వారే రచయితలు, దర్శకులు, నిర్మాతలు, వాయిస్ ఆర్టిస్టులుగా వ్యవహరించారు.
చైనాలోని లియానింగ్ ప్రావిన్స్‌లోని డాలియన్ నగరానికి చెందిన జిన్ యుమెంగ్, ఆయన తల్లి సన్ లిఫాంగ్ ఐదేళ్లపాటు ఈ చిత్రంపై పనిచేశారు.వీరికి యానిమేషన్, స్క్రిప్ట్ రైటింగ్, వాయిస్ డబ్బింగ్‌లలో ఎలాంటి ముందస్తు అనుభవం లేదు. యూట్యూబ్, ఆన్‌లైన్ ద్వారా స్వయంగా నేర్చుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
భారతీయ కరెన్సీలో రూ.85 వేల నుంచి లక్ష లోపు బడ్జెట్‌తో నిర్మించిన నియూ లాయ్ సినిమా ప్రచారం కోసం పెద్దగా ఖర్చే చేయలేదు. ప్రీ-రిలీజ్ ఈవెంట్లు లేవు.. ట్రైలర్ కూడా విడుదల చేయలేదు. సినిమాకు ప్రచార పోస్టర్ మాత్రం ఎంతో అందంగా ఉంది.
సంప్రదాయ చైనీస్ ఇంక్-వాష్ పెయింటింగ్‌ను తలపించేలా రూపొందించిన ఆ పోస్టర్‌కు.. సినిమాలో కనిపించే దృశ్యాలకు సంబంధం లేదంటారు. ఆగస్టు 5న చైనాలో విడుదలైన ఈ సినిమా మొదటి పది రోజుల్లో కేవలం 7,700 యువాన్లు మాత్రమే వసూలు చేసింది.
అంటే మన కరెన్సీలో సుమారు రూ.1.04 లక్షలు. దేశవ్యాప్తంగా 300 మందికంటే తక్కువ మంది టికెట్లు కొనుగోలు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్‌లు సోషల్ మీడియాలోకి రావడంతో పరిస్థితి మారిపోయింది. చిత్రంలోని నాసిరకం కంప్యూటర్ గ్రాఫిక్స్, బిగుసుకున్నట్లు కనిపించే పాత్రలు, విచిత్రమైన వాయిస్‌లు, గందరగోళమైన కథపై నెటిజన్లు జోకులు పేల్చారు.
నియూ లాయ్ చిత్రం చూసిన వారు దీన్ని చిన్న పిల్లలు చేసిన ఓ ప్రాజెక్టు అని వ్యాఖ్యానించారు. మరికొందరు ‘ఏఐ కంటే దారుణం’, ‘2026లో వచ్చిన అత్యంత చెత్త సినిమా’ అంటూ కామెంట్లు చేశారు.
అయితే ఈ విమర్శలే సినిమాకు ఊహించని ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. చెత్త సినిమా అంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతోఇంత చెత్తగా అసలు ఎలా ఉంటుందో చూద్దామని నవ్వుకోవడానికి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం ప్రారంభించారు.
ఈ సినిమా ఎంత అధ్వానంగా ఉందో స్వయంగా థియేటర్‌కు వెళ్లి చూడాల్సిందే" అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. దీంతో తొలుత ఎవరూ పట్టించుకోని ఈ సినిమా.. ఇప్పుడు అదే విమర్శలతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఆగస్టు 16న ఒక్కరోజే లక్ష యువాన్ల టికెట్లు అమ్ముడవ్వగా, ఆ తర్వాత కలెక్షన్లు ఆకాశాన్ని తాకాయి. నియూ లాయ్
సినిమా ఇప్పటివరకు 14.9 మిలియన్ యువాన్లకు పైగా వసూలు చేసింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.20 కోట్లు.
వాస్తవానికి నియూ లాయ్ సినిమా నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేస్తూ విడుదల చేయకపోవడమే మంచిదని పంపిణీదారులు చెప్పారు. అయితే జిన్ యుమెంగ్‌తో స్నేహం కారణంగా సినిమాను విడుదల చేసినట్లు తెలుస్తోంది.
కానీ పరిస్థితి మొత్తం తిరగబడింది. భారీ బడ్జెట్ సినిమాల మధ్య నియూ లాయ్ కూడా బాక్సాఫీస్ రేసులో కనిపిస్తోంది. ఇదే సమయంలో ‘ది ఒడిస్సీ’, ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ వంటి భారీ చిత్రాలతో పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
భారీ ప్రమోషన్లు, పెద్ద స్టార్లు, కోట్లాది రూపాయల బడ్జెట్ లేకుండానే ‘నియు లాయ్’ అందరి దృష్టినీ ఆకర్షించడం విశేషంగా మారింది. ఏ మాత్రం సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ఒక తల్లి, కొడుకు పడ్డ కష్టం, వారి ప్రామాణికమైన ప్రయత్నం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
సోషల్ మీడియా మీమ్స్ చూసి నవ్వుకోవడానికి వచ్చిన ప్రేక్షకులు, థియేటర్లలో సినిమా భావోద్వేగాలకు కనెక్ట్ అయి బయటకు వస్తుండటం ఈ చిత్రం సాధించిన అసలైన విజయం.




