Off The Record: వైరా మున్సిపాలిటీలో రచ్చ: భార్యల సీట్లలో భర్తల పెత్తనం!
Off The Record: ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం భార్యల పదవులపై భర్తల పెత్తనంతో రచ్చకెక్కింది.
Off The Record: వైరా మున్సిపాలిటీలో రచ్చ: భార్యల సీట్లలో భర్తల పెత్తనం!
Off The Record: ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మహిళా కౌన్సిలర్లతో పాటు వారి భర్తలు కూడా హాజరుకావడం చర్చకు దారి తీస్తోంది. పాలకవర్గం సమావేశం మున్సిపాలిటీ మీటింగ్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో ఆయా వార్డు కౌన్సిలర్లతో పాటు ఐదుగురు మహిళా కౌన్సిలర్ల భర్తలు, మున్సిపల్ చైర్పర్సన్ భర్త కూడా అటెండయ్యారు. వైరా మున్సిపల్ చైర్ పర్సన్ భర్త జోక్యంపై ఓ మహిళా కౌన్సిలర్ అభ్యంతరం తెలపడంతో సమావేశం రచ్చకు దారి తీసింది.
కౌన్సిల్ సమావేశంలో వెనుక వరుస కుర్చీల్లో మహిళా కౌన్సిలర్ల భర్తలు కూర్చొని అత్యుత్సాహం ప్రదర్శించడంతో అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో మిగతా పార్టీల కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. గత కొన్నేండ్లుగా అన్ని మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులకు తప్ప మీడియాను కూడా కౌన్సిల్ సమావేశాల లోపలికి అనుమతి లేదు. కానీ వైరాలో మాత్రం మహిళా కౌన్సిలర్ల భర్తలను కౌన్సిల్ హాల్లోకి అనుమతించడం, సమావేశం జరుగుతున్న సమయంలో ప్రత్యేకంగా వారికి కొన్ని చైర్లు వేసి కూర్చోబెట్టడంపై విమర్శలు వ్యక్త మవుతున్నాయి. ఈ సందర్భంగా చైర్ పర్సన్ కాపా చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు ఆధ్వర్యంలో 89 అంశాల అజెండాను ప్రవేశపెట్టారు. పలు అంశాలపై అధికార, విపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరగ్గా, 78 అంశాలపై తీర్మానాలను ఆమోదించి 11 అంశాలను తిరస్కరించారు.
కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందు మున్సిపల్ చైర్ పర్సన్ చాంబర్లో మహిళా కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లోనూ చైర్ పర్సన్ భర్త కాపా మురళీకృష్ణ పాల్గొన్నారు. తమ వార్డులకు నిధులివ్వడం లేదని, వార్డుల పర్యటనకు అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తున్నా ప్రొటోకాల్ ప్రకారం తమకు సమాచారం ఇవ్వడం లేదని కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రస్తావించగా చైర్ పర్సన్ భర్త మురళీకృష్ణ జోక్యం చేసుకొని సమాధానం ఇవ్వడం తో మరింత అగ్గి రాజుకుంది. అన్నివార్డులను సమానంగా చూస్తున్నామని, వివక్ష లేదని చైర్ పర్సన్ భర్త చెప్పడం, ఆయన జోక్యంతో మహిళా కౌన్సిలర్ కట్టా స్వరూప రాణి అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్ పర్సన్ చాంబర్లో ఉండగా, సమాధానం చెప్పేందుకు మీరెవరంటూ బీఆర్‌యస్ కౌన్సిలర్ ప్రశ్నించారు. తనతో అవహేళనగా, అవమానకరంగా చైర్ పర్సన్ భర్త మాట్లాడారని స్వరూపరాణి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత సభ్యులంతా కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. కౌన్సిల్ మీటింగ్‌లోనూ భార్యల వెంటభర్తలు పాల్గొనడం, మున్సిపల్ కమిషనర్ కూడా అభ్యంతరం చెప్పకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
వైరా మున్సిపాలిటి పరిధిలో అభివృద్ధి పనులపై సమావేశం జరగాల్సి ఉండగా మహిళా కౌన్సిలర్ల వెంట భర్తల హడావుడితో పార్టీల మధ్య గొడవలతో మున్సిపల్ సమావేశం రచ్చకెక్కింది. వార్డుల సమస్యలు, సిబ్బంది పనితీరు, పెండింగ్ వర్క్స్, వాటికి పరిష్కారాల వంటి విషయాలపై కంటే అధిపత్యం యజమాయిషీల విషయంపై పార్టీలు దృష్టి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇక మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్‌లో ఇంత జరుగుతున్నా కమిషనర్ చూస్తూ ఉండటముపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు మనం మహిళా సాధికారత, చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం మరింతగా పెరగాలనే దాని గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే.. ఇలా భార్యల పదవులతో భర్త పెత్తనం చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని అభివృద్ధిపై సమావేశాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.




