Burning Topic: జిన్ పింగ్ పర్యటనతో భారత్ చైనా బోర్డర్ సమస్యలు తీరేనా!
Burning Topic: సెప్టెంబర్‌లో భారత్‌లో జరిగే బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్ రానున్నారు. సరిహద్దులో సైనిక హాట్‌లైన్లు, ప్రత్యేక ప్రతినిధుల చర్చలు కొనసాగుతున్నాయి.
Burning Topic: జిన్ పింగ్ పర్యటనతో భారత్ చైనా బోర్డర్ సమస్యలు తీరేనా!
Burning Topic: చైనా అధినేత జిన్ పింగ్ సెప్టెంబరులో భారత్ పర్యటనకు వస్తున్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం జిన్ పింగ్ ప్రధాన అజెండా. అయితే బ్రిక్స్ సమావేశంతో పాటు భారత్ తో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాల పరిష్కారం కూడా జిన్ పింగ్ అజెండాలో ఉన్నట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి.
కాగా కొంతకాలంగా అంతర్జాతీయ పరిణామాలు శరవేగంగా మారిన సంగతి తెలిసిందే. సుంకాల దెబ్బ నేపథ్యంలో అమెరికాకు భారత్ దూరమైంది. అదే సమయంలో చైనాకు భారత్ దగ్గరైంది. దీంతో చైనా అధినేత జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య స్నేహ బంధం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో భారత్ తో సరిహద్దు వివాదాల పరిష్కారానికి చైనా అధినేత జిన్ పింగ్ చొరవ చూపుతారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం 400 మంది ఉన్న ప్రతినిధి బ్రుందంతో భారత్ కు రావడానికి చైనా అధినేత జిన్ పింగ్ సన్నద్ధమవుతున్నారు.
భారత్ -చైనా సరిహద్దు వివాదాలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. అంతేకాదు రానున్న రోజుల్లో ఈ గొడవలు మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలన్న చిత్తశుద్ధి చైనాకు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
అంతేకాదు భారత్ నిజాయితీని చైనా నమ్మడం లేదు. దీంతో సరిహద్దు వివాదాలకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి చైనాది వంకర బుద్ధి. పొరుగుదేశాలతో చేసుకున్న ఒప్పందాలను గౌరవించాలన్న చిత్తశుద్ధి ఆ దేశానికి లేదు.
అసలు ఉండదు కూడా. పొరుగు దేశాలతో చేసుకున్న ఒప్పందాలను గౌరవించాలన్న సోయ చైనా పాలకులకు లేకుండా పోయింది. విస్తరణ కాంక్ష ముందు పొరుగుదేశాలతో చేసుకున్న సైనిక ఒప్పందాలు చైనా పాలకుల కంటికి కనిపించడంలేదు. దీంతోనే సమస్యలు పుట్టుకొస్తున్నాయి.డ్రాగన్ కంట్రీ విస్తరణ కాంక్షకు పొరుగుదేశాలు బలవుతున్నాయి.
ఇదిలా ఉంటే, పొరుగు దేశాలతో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి చైనా 2022లో ఓ చట్టాన్ని చేసింది.భారత్ తో సరిహద్దు గొడవలకు సంబంధించి చైనా ప్రత్యేకంగా చట్టం చేయడం ఇదే తొలిసారి అంటున్నారు మిలటరీ నిపుణులు. చైనా చేసిన ఈ ప్రత్యేక చట్టం ఫలితంగా రానున్న రోజుల్లో భారత్ అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయి.
వాస్తవానికి మొత్తం 14 దేశాలతో దాదాపు 22 వేల కిలోమీటర్ల మేర సరిహద్దును చైనా దేశం పంచుకుంటోంది.అయితే దాదాపుగా అన్ని దేశాలతో చైనా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుంది.ఇప్పటికీ భారత్ అలాగే భూటాన్‌తోనే చైనాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి.
భారత్ విషయానికి వస్తే చైనాతో 3,488 కిలోమీటర్ల మేర భూ సరిహద్దు ఉంది. ఇది మూడు సెక్టార్ ల ద్వారా వెళుతుంది. వెస్ట్రన్ సెక్టార్ అంటే జమ్మూ కాశ్మీర్, సెంట్రల్ సెక్టార్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉంటుంది. నార్త్ సెక్టార్ అంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ల ప్రాంతాల నుంచి వెళుతుంది.
చైనా, భారత్ మధ్య చాలాకాలంగా సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య స్పష్టమైన హద్దులు లేవంటున్నారు నిపుణులు. దీంతో వాస్తవాధీన రేఖనే ... ఇప్పటివరకు యథాతథ స్థితిని కొనసాగించడానికి ప్రామాణికంగా రెండు దేశాలు పెట్టుకున్నాయి.
2020 జూన్‌లో అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలోని సరిహద్దుల్లో కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు చైనా శ్రీకారం చుట్టింది. యాన్-లిన్షి రైల్వే లైన్ ప్రాజెక్ట్ గా ఇది చైనాలో పాపులర్ అయింది. అంతేకాదు అనేక భారత్ భూభాగాలు తమవే అంటోంది చైనా.
ఈ విషయంలో పచ్చి అబద్ధాలు మాట్లాడటానికి కూడా చైనా వెనుకాడటం లేదు. ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో అనేక అసత్యాలను చైనా ప్రచారం చేస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమన్నది చైనా చేస్తున్న ప్రధాన అసత్యం.
అయితే చైనా వాదనను అనేకసార్లు భారత్ ఖండించింది. అయినప్పటికీ చైనా బుద్ధి మారడం లేదు. టిబెట్ విషయంలో కూడా సిగ్గు ఎగ్గూ లేకుండా నూటికి నూరు శాతం అబద్దాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్ అంశంపై రెండు దేశాల మధ్య వివాదం కొత్తగా ఏర్పడింది కాదు. చాలా సంవత్సరాలుగా ఈ వివాదం నడుస్తోంది. యాన్-లిన్షి రైల్వే ప్రాజెక్టు చేపట్టడం వెనక సైనికపరమైన లక్ష్యాలు ఉండొచ్చని భారత్ కు చెందిన రక్షణరంగ నిపుణులు అనుమానిస్తున్నారు.
ఈ రైల్వే లైన్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్ లోని సరిహద్దు ప్రాంతానికి చైనా చాలా సులభంగా ఆయుధాలను, క్షిపణులను తరలించ వచ్చని మిలటరీ అధికారులు అంటున్నారు. దీంతో సిచువాన్ -టిబెట్ రైల్వే ప్రాజెక్ట్ వివాదాస్పదంగా మారింది.
కాగా సరిహద్దు ప్రాంతాల్లో చైనా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడాన్ని భారత్ నిశితంగా గమనిస్తోంది.రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి సరిహద్దుల్లో చైనా చేపట్టిన నిర్మాణాలు ప్రధాన కారణమంటున్నారు రక్షణరంగ నిపుణులు.
అయితే చైనాతో ఎన్ని సరిహద్దు వివాదాలు తలెత్తినా వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఇప్పటివరకు మనదేశం భావిస్తూ వచ్చింది. ఈ విషయంలో భారత్ నిజాయితీగా ప్రవర్తించింది. అయితే భారత్ నిజాయితీ చైనాకు పనికిరావడం లేదు ఇదిలా ఉంటే, 2022లో తీసుకువచ్చిన సరిహద్దు చట్టాన్ని దేశ సార్వభౌమాధికారంతో చైనా ముడిపెట్టింది.
దీంతో సరిహద్దు వివాదాల తీవ్రత పెరిగినట్లయింది. ఈ నేపథ్యంలో వివాదం అంటూ తలెత్తితే ...అది చైనా చేసిన కొత్త చట్టం ప్రకారమే పరిష్కారమవుతుంది. భారత్-చైనా సరిహద్దు ల్లో తలెత్తిన వివాదాలు రోజు రోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.
చర్చల ద్వారా ఈ వివాదాలను సద్దుమణిగేలా చేయడానికి భారత్ ప్రయత్నించింది. అయితే చైనా డబుల్ గేమ్ ఆడటం తో ఇక భారత్ కూడా దూకుడుగా వ్యవహరించక తప్పని పరిస్థితి వచ్చింది. ఎలాంటి పరిస్థితికైనా భారత్ సన్నద్ధం అవుతోంది.
ఇందులో భాగంగా భారత్ వ్యూహాత్మకంగా కీలక ప్రాంతమైన ఈస్ట్రన్ కమాండ్ పై ఫోకస్ పెట్టింది. గాల్వాన్ లోయ సంఘటన తరువాత....భారత్ సైన్యం వైఖరిలో మార్పు వచ్చింది. డిఫెన్స్ పక్కన పెట్టి....అఫెన్స్ లోకి దిగడానికి రెడీ అవుతోంది.
మొదటగా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ఈస్ట్రన్ కమాండ్ పై ఫోకస్ పెట్టింది. ఈస్ట్రన్ కమాండ్ కు బలగాలు ఎప్పుడంటే అప్పుడు చేరుకోవడం కష్టం. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తేజ్‌పూర్, గువహటిల నుంచి రోడ్డు మార్గంలో బలగాలు చేరుకోవాలంటే కనీసం ఏడెనిమిది గంటలు పడుతుంది.
పైగా ఈస్ట్రన్ సెక్టార్ అంతా కొండలు, లోయలతో నిండి ఉంది.దీంతో ఈస్ట్రన్ కమాండ్ లో ఎత్తయిన కొండలను అవలీలగా ఎక్కగలిగే సిబ్బందితో కూడిన మౌంటెయిన్ స్ట్రైక్ కోర్‌ను సైన్యం మోహరించింది.
అలాగే... సరిహద్దులకు దగ్గర్లో ఉన్న అన్ని ఫార్వర్డ్ ఆపరేషనల్ బేస్‌లను అప్రమత్తం చేసింది. అత్యాధునిక రాడార్లు, మానవరహిత విమానాలను పెద్దసంఖ్యలో మొహరించింది. దీర్ఘకాలిక అవసరాలకు తగ్గట్టు అదనంగా మందుగుండు, ఆహారం, చమురు నిల్వ చేసేందుకు భూగర్భ గోదాములను కూడా ఏర్పాటు చేస్తోంది.




