Off The Record: ఏపీలో ఈసీ వివాదం పై రచ్చ రచ్చ.. అసలు ఏం జరుగుతుంది?

Off The Record: కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతున్న వైసీపీ.. ఎన్నికల సంఘంపై దూకుడు పెంచింది. ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్ల తొలగింపుపై జగన్ ఆరోపణలు, టీడీపీ-వైసీపీ వైఖరి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Sept 2026 7:33 AM IST
Off The Record
X

Off The Record: ఏపీలో ఈసీ వివాదం పై రచ్చ రచ్చ.. అసలు ఏం జరుగుతుంది? 

Off The Record: పార్లమెంట్ సాక్షిగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి అవలంబించకుండా.. పలు కీలక అంశాల్లో బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించిందన్నది రాజకీయ వర్గాల్లో వినిపించే మాట. అయితే.. ఎన్నికల సంఘం విషయానికి వచ్చేసరికి మాత్రం వైసీపీ వైఖరి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో SIR ప్రక్రియ ప్రారంభమైన తర్వాత.. ఓటర్ల జాబితాలో తమ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ పలుమార్లు ఆరోపించింది. రాష్ట్ర ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదులు చేసింది. ఓట్ల తొలగింపు విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. జాబితా ప్రక్రియపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. అంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో సహకార వైఖరి కనిపించినా.. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా విషయంలో మాత్రం ఈసీపై వైసీపీ మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చింది.

ఇప్పుడు ఆ విమర్శలకు మరింత పదును పెంచింది. జగన్ తాజాగా ఈసీ నిర్ణయాలపై మరింత పారదర్శకత అవసరమని కోరుతున్నారు. ఎన్నికల సంఘంలోనే కమిషనర్ల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయన్న ప్రచారం నేపథ్యంలో.. అసలు ఏం జరిగింది..? ఏ నిర్ణయాలు ఎలా తీసుకున్నారు..? ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులు ఎలా జరిగాయి..? అన్నదానిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాదు.. ఎన్నికల కమిషనర్ల నియామక విధానాన్ని కూడా పునఃపరిశీలించాలని జగన్ సూచించడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

ఇక్కడే మరో ప్రశ్న తెరపైకి వస్తోంది. నిన్న మొన్నటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పెద్దగా ఘర్షణకు వెళ్లని వైసీపీ.. ఇప్పుడు ఎన్నికల సంఘం విషయంలో మాత్రం ఎందుకు ఇంత దూకుడుగా వ్యవహరిస్తోంది..? ఇది కేవలం SIR ప్రక్రియపై ఉన్న అభ్యంతరాల వల్లేనా..? లేక ఎన్నికల వ్యవస్థపై వైసీపీకి ఉన్న రాజకీయ అనుమానాలు మరింత పెరిగాయా..? అన్న చర్చ కూడా జరుగుతోంది.

మరోవైపు అధికార కూటమి వైఖరి చూస్తే పూర్తిగా భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామి. కేంద్రంలోని బీజేపీతో రాజకీయంగా కలిసి నడుస్తోంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘంపై వస్తున్న విమర్శల విషయంలోనూ టీడీపీ వైఖరి సహజంగానే భిన్నంగా కనిపిస్తోంది. అయితే టీడీపీ కూడా ఈసీపై వచ్చిన ప్రతి ప్రశ్నను కొట్టిపారేయడం లేదు. ఈసీ తన వైఖరిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో SIR ప్రక్రియ పారదర్శకంగానే జరిగిందని స్పష్టం చేస్తున్నారు. అంటే.. వైసీపీ ఈసీపై అనుమానాలు వ్యక్తం చేస్తుంటే.. టీడీపీ మాత్రం ఈసీ వివరణను స్వాగతిస్తూ.. ఏపీలో SIR ప్రక్రియ పారదర్శకంగానే జరిగిందని చెబుతోంది. ఇక్కడే రాజకీయ లెక్కలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. బీజేపీతో ఉన్న రాజకీయ అనుబంధాన్ని కొనసాగిస్తూ కేంద్ర వ్యవస్థల విషయంలో సహకార వైఖరినే కొనసాగిస్తోందా..? మరోవైపు గతంలో కేంద్రంతో పలు అంశాల్లో సహకరించిన వైసీపీ.. ఇప్పుడు ఎన్నికల సంఘం విషయంలో మాత్రం విమర్శల స్వరం పెంచడం వెనుక రాజకీయ కారణాలున్నాయా..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ఇదే సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ అంటే CJP కూడా ఈసీ వ్యవహారంపై హెచ్చరికలు చేస్తూ తన స్పందనను వెల్లడించింది. జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించింది. ఇప్పుడు ఆ హెచ్చరికలపై వైసీపీ వైఖరి ఏంటన్నదే మరో ప్రశ్నగా మారింది. CJP లేవనెత్తిన అంశాలకు వైసీపీ మద్దతుగా నిలుస్తుందా..? లేక తన రాజకీయ వాదనకే పరిమితమవుతుందా..? ఇప్పటికే జగన్ ప్రెస్‌మీట్‌లో ఈసీ వ్యవహారంపై ప్రత్యేకంగా స్పందించిన నేపథ్యంలో.. తాజా పరిణామాలపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తిగా మారింది.

అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని కేవలం జగన్ వర్సెస్ చంద్రబాబు రాజకీయ పోరాటంగా చూస్తే అసలు అంశం పక్కదారి పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ చర్చలో ఉన్నది వ్యక్తులు కాదు.. ఓటర్ల జాబితా.. ఓటు హక్కు.. ఎన్నికల ప్రక్రియపై ప్రజల నమ్మకం. ఎన్నికల సంఘంపై ఆరోపణలు వచ్చినప్పుడు.. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈసీదే. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా తమ ఆరోపణలకు ఆధారాలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అధికారం మారుతుంది.. ప్రతిపక్షం మారుతుంది.. రాజకీయ పొత్తులు మారుతాయి.. కానీ ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉండే నమ్మకం మాత్రం మారకూడదు. ఇప్పుడు ఏపీలో అదే నమ్మకంపై రాజకీయ చర్చ మొదలైంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్