Off The Record: కూటమి ప్రభుత్వం దూకుడుకు వైసీపీ కళ్లెం..రంగంలోకి జగన్
Off The Record: ఏపీ రాజకీయాల్లో వైసీపీ సరికొత్త మాస్టర్ ప్లాన్! కూటమి ప్రభుత్వం దూకుడుకు కళ్లెం వేసేందుకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారు.
Off The Record: కూటమి ప్రభుత్వం దూకుడుకు వైసీపీ కళ్లెం..రంగంలోకి జగన్
Off The Record: ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నారు పెద్దలు. వైసీపీ ఇప్పుడు ఈ సూత్రం మర్మం ఏమిటో అర్థం చేసుకున్నట్లుగా వుంది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ప్రజల్లో పరపతి లేకుండా పోయింది. పార్టీ కీలక నేతలు అక్రమ, అవినీతి ఆరోపణ కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెలుతున్నారు. అప్పుడప్పుడు వైసీపీ అధినేత జగన్ బయటకు వచ్చి హడావిడి చేస్తున్నా అది ఒక్క రోజుకే పరిమితం అవుతోంది. దీంతో వైసీపీ క్యాడర్ బిక్కచచ్చి పోయింది. వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పెద్ద నేతలు కూడా తెర చాటుకు వెళ్లి పోయారు. పార్టీలో అసలు ఏం జరుగుతోందో కూడా కింది స్థాయి నేతలు, శ్రేణులకు అర్థం కావట్లేదు. ఈ విషయం మొత్తం జగన్ కు అర్థమైంది. ఇక ఇప్పుడు కూడా తాను బెంగళూరు హోస్ కే పరిమితం అయితే పార్టీ మరింతగా దీన స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని గుర్తించారట. అంతే. హడావిడిగా పార్టీలోని కొందరు పెద్దలతో భవిష్యత్ కార్యక్రమంపైన చర్చించిన జగన్ ప్రజల్లోకి వెలితే తప్ప పార్టీని బతికించుకోవటం కష్టం అనేది గుర్తించారని, దింతో త్వరలోనే జగన్ సహా పార్టీ నేతలు జనం బాట పట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పనిలో వున్నారని సమాచారం...
జనంలోకి వేలితేనే పార్టీకి జీవం ఉంటుంది. కానీ ఏ అంశాలపైన వెళ్ళాలి? ఏ పోరాటాలు చేయాలి? ఎక్కడ చేయాలి? ఎలా మొదలు పెట్టాలి? ఇదే ఇప్పుడు వైసీపీ పెద్దల ఆలోచన. మావిగన్ అంటూ వైసీపీ అధినేత జగన్ ఏపీ రాజధాని అంశంపై ప్లాన్-బి పొట్లం ఇప్పటికే విప్పిన నేపథ్యంలో దీనిపైన ప్రజల్లోకి వెలితే ఎలా ఉంటుంది అనే ఆలోచన గురించి.. పార్టీ ముఖ్యులతో జగన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల వ్యవహారం బెడిసి కొట్టటం, మరోవైపు ఏపీ రాజధానిగా అమరావతికి కేంద్రం చట్ట బద్దత కూడా ఇవ్వటం జరిగిపోయిన తర్వాత దీనిపై ప్రజల్లోకి వెలితే పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువగా వస్తుందనే అభిప్రాయం వైసీపీ పెద్దల నుంచి జగన్ కు వచ్చినట్టు సమాచారం. మావిగన్ పేరుతో ప్రజలను కొంత కాలం దృష్టి మళ్ళించి సోషల్ మీడియా లో వైసీపీ పేరు, జగన్ పేరు మారుమోగేలా చేసుకునే అవకాశం ఉందని కూడా కొందరు జగన్ కు సలహా ఇచ్చిన నేపథ్యంలో దీనికి జగన్ కూడా ఓకే అన్నట్టు పార్టీలో ప్రచారం సాగుతోంది. వ్రతం చెడినా ఫలితం దక్కాలి అన్న పాయింట్ ను దృష్టిలో పెట్టుకొని మావిగన్‌ను వైరల్ చేసే ప్రణాళిక ఇప్పుడు వైసీపీ ఎంచుకున్న మరో అస్త్రంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించిన మావిగన్ లో గుంటూరు వుంది... కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజధాని అమరావతి గుంటూరు జిల్లాలోనే వుంది. ఇక విజయవాడ, మచిలీపట్నం కూడా అమరావతికి చేరువలో వున్నాయి. దింతో ఆయా ప్రాంతాల ప్రజల మధ్య ఆధిపత్యం ఆకాంక్ష ఆలోచనలు తెచ్చే ప్రయత్నం ఇప్పుడు వైసీపీ నేతల మెదడులో మెరుస్తున్నట్లు మేధావులు అంటున్నారు. దీని వల్ల వైసీపీ రాజకీయంగా కొంత మేరకు ప్రజలలో చర్చకు దారి తీస్తుందని, జగన్ ఆలోచన కూడా ఇదేనని వారు వివరిస్తున్నారు..
కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధిపైన దృష్టి పెట్టింది. ఐతే అక్కడ జరిగే పనులను ఎప్పటికప్పుడు లోతుగా పరిశీలించి, అవకాశం వచ్చినప్పుడు ప్రభుత్వంపైన విరుచుకుపడేలా వైసీపీ ప్లాన్ చేస్తోందని వినికిడి. ఈ మేరకు అమరావతిపైన ఓ కన్ను వేసి ఉంచే బాధ్యతలు గుంటూరు, విజయవాడకు చెందిన ముగ్గురు వైసీపీ ముఖ్య నేతలకు జగన్ అప్పగించినట్టు సమాచారం. ఇక గోదావరి పుష్కరాలలోపు పోలవరం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన అంశం కూడా జగన్ పరిగణలోకి తీసుకొని దాన్ని కూడా గమనిస్తూ ఉండేలా పార్టీ నేతలకు సూచనలు ఇచ్చారట. ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఓ పది, పదిహేను నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ నేతలు కాస్త చురుగ్గా వున్నారని, 160 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఘోరంగా ఉందని నేతలు జగన్ కు తెలిపినట్లు సమాచారం. ఇదేమి పెద్ద సమస్య కాదని, పార్టీ అధికారంలో లేకపోతే క్యాడర్, దిగువ శ్రేణులు నిరుత్సాహంగానే ఉంటాయని జగన్ లైట్ తీసుకున్నట్లు పార్టీ నేత ఒకరు చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఏదో ఓ తప్పు చేసి తీరుతుందని, ఆ చాన్స్ ను వదులుకోకుండా పట్టుబిగిద్దామని వైసీపీ నేతలకు జగన్ సూచనలు ఇచ్చినట్లు సమాచారం..
ఇక జగన్ మాస్టర్ ప్లాన్... పాదయాత్రగా తెలుస్తోంది. ఈ పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు మొదలు అవుతాయని పార్టీ నేతలకు ఆయన భరోసా ఇచ్చారట. పాదయాత్ర సమయంలో చోటు చేసుకునే ప్రతీ అంశం వైరల్ అయ్యేలా ఇప్పటి నుంచే ఓ స్పెషల్ టీంను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. పాదయాత్ర సమయంలోనే పార్టీ కార్యకర్తలు, దిగువస్థాయి నాయకులతో ప్రత్యేక సమావేశాలు కూడా వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు... రెండు, మూడు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, క్యాడర్ తో ఈ సమావేశాలు వుండే అవకాశం ఉన్నట్టు పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పుకుని వచ్చారు. ఇక మరో రెండు, మూడు నెలలు మాత్రమే కూటమి దూకుడు సాగుతుందని, ఆ తర్వాత వైసీపీ ప్రభంజనం మొదలు అవుతుందని పార్టీ నేతలకు జగన్ ధీమాగా చెప్పేస్తున్నారని సమాచారం... జగన్ పాదయాత్ర మొదలు అయితే కూటమికి ఇక రోజులు దగ్గర పడినట్టేనంటూ వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మరి జగన్ పాదయాత్ర మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..? అనుకున్న మేర పార్టీకి మైలేజ్ తీసుకొస్తుందా అనేది వేడి చూడాలి.




