Off The Record: ఉమ్మడి విజయనగరం వైసీపీలో నైరాశ్యం.. నేతల మౌనం - క్యాడర్‌లో కలవరం!

Off The Record: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలువురు ఫ్యాన్ పార్టీ లీడర్లు.. రాజకీయ నిస్తేజంలో ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 May 2026 11:31 AM IST
Off The Record
X

Off The Record: ఉమ్మడి విజయనగరం వైసీపీలో నైరాశ్యం.. నేతల మౌనం - క్యాడర్‌లో కలవరం!

Off The Record: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలువురు ఫ్యాన్ పార్టీ లీడర్లు.. రాజకీయ నిస్తేజంలో ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండే నేతలు.. ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవుతున్నారన్న చర్చ నడుస్తోంది. ప్రతిపక్షంలోకి రాగానే తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారట. ప్రజా క్షేత్రంలోని సమస్యలపై గలమెత్తే పరిస్థితి బూతద్ధం

పెట్టి చూసినా కనిపించడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇలా లీడర్ల తీరు వల్ల.. కేడర్‌లోనూ నైరాశ్యం అలుముకుంటోందట. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సంసిద్ధం చేసే బాధ్యతను విస్మరిస్తున్నారా అన్న డౌట్స్ నెలకొన్నాయి పార్టీలో. దీంతో నిరంతరం ప్రజల్లో ఉండాలని ఉమ్మడి విజయనగరం జిల్లాలో కాస్త స్తబ్దుగా మాజీ ప్రజా ప్రతినిధులను.. వైసీపీ ముఖ్య లీడర్లు అలెర్ట్ చేయడం వంటి చర్యలు తీసుకుంటుండగా... కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కు అన్న చందంగా వ్యవహరిస్తున్నారట.

జిల్లాకు చెందిన మరికొందరు ఫ్యాన్ లీడర్లు మాత్రం అడపా దడపా పార్టీ సమావేశాలు నిర్వహించి

నియోజకవర్గంలో విస్తృత స్థాయి గ్రామ కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారట. తద్వారా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించుకుంటుంటే.. మరి కొందరు

కేవలం సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలకు పరిమితం అవుతున్నారట.

కొందరు నేతలైతే.. స్థానికంగా అస్సలు ఉండకపోవడం, పార్టీ క్యాడర్ కు దూరం అవుతున్నారన్న విమర్శలు పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది.

విజయనగరం నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పూర్తిస్థాయిలో యాక్టివ్ రాజకీయాల్లో కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. ప్రజా సమస్యలపై స్పందించడంలో ఆయన వెనుకబడుతున్నారనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరోవైపు నెల్లిమర్ల నియోజకవర్గంలోనూ మాజీ ఎమ్మెల్యే కొండ అప్పలనాయుడు రాజకీయంగా మౌన వ్యూహాన్ని అనుసరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. నియోజకవర్గ భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై స్పష్టత లేకపోవడంతో పార్టీని పటిష్టం చేయడంలో నిరుత్సాహంతో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక శృంగవరపుకోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుపై కూడా స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తవలసలో నివాసం ఉన్నప్పటికీ ఎక్కువ సమయం విశాఖపట్నం లేదా అమెరికాలో గడుపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి ప్రజలకు చుట్టం చూపులా ఇలా వచ్చి.. అలా వెళ్లిపోతున్నారనే వాయిస్ వినిపిస్తోంది. మరోవైపు జిందాల్ అంశం వంటి కీలక సమస్యలపై స్పందించక పోవడం, ఈ విషయంలో అధికార పార్టీపై స్థానికంగా వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో విఫలమవుతున్నారనే అభిప్రాయాలు కార్యకర్తల్లో వినిపిస్తున్నాయి.

మన్యం జిల్లా వైసిపీ క్యాడర్ లో కొంతమేర నిరుత్సాహం అలుముకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పార్టీలో స్పీడ్ తగ్గించారన్న టాక్ చక్కర్లు కొడుతుంది. ఎక్కువ సమయం విశాఖలో గడపడం, కూటమి ప్రభుత్వంలోని మంత్రుల కామెంట్స్ కు కేవలం సోషల్ మీడియా వేధికగా మాత్రమే రాజకీయ విమర్శలు చేస్తూ.. పార్టీలో కాలం గడుపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇక పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావుపై కూడా ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి.

గతంలో గ్రామ గ్రామాన తిరిగే నాయకుడిగా పేరున్న ఈయన… ఎన్నికల ఓటమి తర్వాత నియోజకవర్గంలో కంటే పట్టణ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక సమస్యలపై స్పందన తగ్గిందని, విజయనగరం కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్వతీపురం ఎమ్మెల్యే కొంతమంది అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాల్లో కూడా మాజీ ఎమ్మెల్యే జోగారావు నుంచి గట్టిగా స్పందన రాకపోవడం చర్చనీయమైంది.

ప్రజా సమస్యలపై గొంతెత్తి, పోరాడాల్సిన నాయకులే నిరుత్సాహానికి వెళితే.. పార్టీ క్యాడర్ లో ధైర్యం ఎలా నింపగలరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి రానున్న రోజుల్లో ఈ మాజీ ఎమ్మెల్యేలు అధికార కూటమి విమర్శలను తిప్పికొట్టి మళ్లీ ప్రజాక్షేత్రంలో ఉత్సాహంతో ముందుకెళ్లి సమస్యలపై పోరాడగలరా అన్నది చూడాల్సి ఉంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story