Off The Record: రాయలసీమ వైసీపీలో జోష్ నింపిన జగన్!

Off The Record: రాయలసీమ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు వైసీపీ వ్యూహాలు. కౌంటర్ ప్లాన్‌తో రంగంలోకి అధికార కూటమి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Sept 2026 8:56 AM IST
Off The Record
X

Off The Record: రాయలసీమ వైసీపీలో జోష్ నింపిన జగన్!

Off The Record: పార్టీ ఆవిర్భావం నుంచి మంచి పట్టున్న రాయలసీమలో వైసీపీ గత సార్వత్రిక ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఎదురులేని విజయం సాధించడంతో రాయలసీమలోనూ ఆ పార్టీ అత్యధిక స్థానాలు సొంతం చేసుకుంది. చావుతప్పి కన్నులొట్ట పోయిందన్న చందంగా మొత్తం 53 అసెంబ్లీ, ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో వైసీపీకి కేవలం ఆరు అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలు దక్కాయి. ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనూ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల, బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు మంత్రాలయం, ఆలూరు, పుంగనూరు, తంబల్లపల్లె నియోజకవర్గాల్లోనే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపొందారు. మిగిలినన వాటిలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్ర వ్యప్తంగా కేవలం 11 స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ స్థానిక సంస్థల్లో పట్టు నిలుపుకోవాలని భావిస్తోందట. అందుకోసం ఇప్పటికే పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారట.

ఇటీవల జగన్ పులివెందులకు వచ్చిన సందర్భంలోనూ కేడర్‌కు ఇదే విషయం చెప్పారట. నాలుగు రోజుల కిందట సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ చేసిన వాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంపడానికైనా... చావడానికైనా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన చేసిన వాఖ్యలు పార్టీ కేడర్‌లో కొంత ఉత్సాహాన్ని నింపినా... అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన పలమనేరులో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మున్సిపల్ పోరులో పార్టీ సత్తాచాటాలని.. అందుకు సమాయత్తం కావాలని కేడర్‌కు ఆయన పలు సూచనలు చేశారట.

శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లోనూ ఆ పార్టీ రాయలసీమ జిల్లాల కోఆర్టినేటర్ మిథున్ రెడ్డి నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ పోరులో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలి.. లీడర్లు, కేడర్ ఏ విధంగా పనిచేయాలి అన్న విషయాలపై నేతలకు ఎంపీ ఆదేశాలు ఇచ్చారట. మున్సిపల్ పోరును నాయకులు సీరియస్‌గా తీసుకోవాలని... గెలుపునకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని చెప్పారట. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా సీమలోని అన్ని నియోకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి గెలుపు కోసం అనుసరించాల్సిన విదివిధానాలపై చర్చించనున్నారట. వచ్చే మున్సిపల్, పంచాయతీ, జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల విధానం ప్రవేశ పెట్టడం తమకు లాభిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారట.

మున్సిపల్ ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలే రావాలని, అన్ని చోట్ల కూటమి అభ్యర్థులే విజయం సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ పార్టీ అధిష్టానం పదే పదే చెబుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు, క్షేత్రస్థాయిలో నేతలు ఆ స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా దృష్టి సారించడం లేదట. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు అధికార కూటమిలో చాలా మంది ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో... పార్టీ అధిష్టానానికి ఎలాంటి నివేదికలు పంపుతారో అన్న ఆందోళనలో ఉన్నారట. కొన్ని నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేలు మున్సిపల్ ఎన్నికల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం బెటర్ అని స్థానిక పార్టీ నేతలు భావిస్తున్నారట. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ పార్టీ పెద్దలు మాత్రం సీమలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని.. ఓటుతో మరోమారు వైసీపీని చావుదెబ్బ కొట్టాలని భావిస్తున్నారట.

కడప, పులివెందుల, పుంగనూరు వంటి మున్సిపాలిటీల్లో కచ్చితంగా టీడీపీ జెండా ఎగరాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోందట. పార్టీకి పట్టున్న అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, నంద్యాల వంటి జిల్లలతోపాటు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల్లో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వరాదని ఇప్పటికే పార్టీ పెద్దలు నేతలకు స్పష్టం చేశారట. ప్రభుత్వ విధానాలు, కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని.. గత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్నఇబ్బందులను, కూటమి వచ్చాక అందుతున్న సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కూటమి పార్టీలు భావిస్తున్నాయట. అక్కడి వరకూ బాగానే ఉన్నా ఎమ్మెల్యేలు, జిల్లాస్థాయి నేతలు ఇప్పటికీ మున్సిపల్ పోరుపై చాలా నియోజకవర్గాల్లో దృష్టి సారించలేదట. ద్వితియ శ్రేణి నేతలు, పార్టీలో దీర్ఘకాలంగ పనిచేసిన వారితో నెలకొన్న విబేధాలు స్థానిక ఎన్నకల్లో ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన పార్టీ కేడర్‌లో వ్యక్తం అవుతోంది. బీసీలకు 34 ‎శాతం రిజర్వేషన్ల అమలు, ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, ఛైర్మన్ల ఎంపిక జరగనున్న నేపథ్యంలో చాలామంది సీటు ఆశిస్తున్నారు. ఏ మున్సిపాలిటీలో రిజర్వేషన్ ఏ వర్గానికి ఉంటుంది అన్నది క్లారిటీ రావాల్సి ఉందని.. ఆలోగా క్షేత్రస్థాయిలో టీడీపీ ఎన్నికల కసరత్తు జరగాలని టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. మరి లోకల్ ఫైట్.. సీమలో ఎవరికి అనుకూలిస్తుదో.. చూడాలి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story