AP: పోలీసింగ్‌లో ఏఐ డ్రోన్ పోర్టల్, ‘సేఫ్‌స్టే’ యాప్‌ ప్రారంభం: డీజీపీ!

AP: పోలీసింగ్‌లో సరికొత్త టెక్నాలజీ: ఏఐ ఆధారిత డ్రోన్ పోర్టల్ (CDMP), ‘సేఫ్‌స్టే’ యాప్‌లను గుంటూరులో ప్రారంభించిన ఏపీ డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 22 Sept 2026 11:39 PM IST
AP
X

AP: పోలీసింగ్‌లో ఏఐ డ్రోన్ పోర్టల్, ‘సేఫ్‌స్టే’ యాప్‌ ప్రారంభం: డీజీపీ!

AP: సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లడమే లక్ష్యమని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా పేర్కొన్నారు. ప్రజలు సురక్షితంగా ఉన్నామనే భావనతోపాటు.. పోలీసులు తమ కోసం పనిచేస్తున్నారనే భరోసా కల్పించేలా సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా పోలీసింగ్‌లో మరో రెండు అధునాతన సాంకేతిక సేవలకు మంగళవారం శ్రీకారం చుట్టారు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో AI ఆధారిత సెంట్రలైజ్డ్‌ డ్రోన్‌ మానిటరింగ్‌ పోర్టల్‌ (CDMP) ను ప్రారంభించారు. ‘సేఫ్‌స్టే’ యాప్‌, లోగోను ఆవిష్కరించారు.

‘‘గత ఏడాదిన్నరగా పోలీసింగ్‌లో సాంకేతికతను పెద్దఎత్తున ప్రవేశపెడుతున్నాం. కొత్త టెక్నాలజీ తీసుకురావడమే కాదు.. దాని ప్రయోజనం నేరుగా ప్రజలకు చేరాలి. నేరాల నివారణ, కేసుల ఛేదన, దర్యాప్తు.. ఇలా ప్రతి విభాగంలోనూ సాంకేతికతను సమర్థంగా వినియోగించాలి. ప్రజలకు భద్రత, భరోసా కల్పించడమే మా లక్ష్యం’’ అని డీజీపీ పేర్కొన్నారు.

‘సేఫ్‌స్టే’తో బస వివరాలు రియల్‌టైమ్‌లో..

రాష్ట్రంలోని పీజీలు, హోటళ్లలో బస చేస్తున్న వారి వివరాలను పోలీసులకు రియల్‌టైమ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు *‘సేఫ్‌స్టే’*ను రూపొందించారు. ఆయా ప్రాంతాల్లోని పీజీలు, హోటళ్లలో బస చేస్తున్న వారి వివరాలతోపాటు ఆక్యుపెన్సీ సమాచారాన్ని పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుంది. ప్రజా భద్రత, నేరాల నివారణ, దర్యాప్తు అవసరాలకు ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది.

ఒకే డ్యాష్‌బోర్డ్‌పై డ్రోన్ల లైవ్‌ ఫీడ్స్‌..

రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అవసరాలకు వినియోగిస్తున్న డ్రోన్లను ఒకే వేదికపై పర్యవేక్షించేందుకు *సెంట్రలైజ్డ్‌ డ్రోన్‌ మానిటరింగ్‌ పోర్టల్‌ (CDMP)*ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న డ్రోన్ల లైవ్‌ ఫీడ్స్‌ను ఒకే సెంట్రలైజ్డ్‌ డ్యాష్‌బోర్డ్‌ ద్వారా అధికారులు పర్యవేక్షించవచ్చు. AI ఆధారిత మానిటరింగ్‌తోపాటు అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్‌ సదుపాయాన్ని ఇందులో పొందుపరిచారు.

అధికారుల స్థాయికి అనుగుణంగా సమాచారాన్ని పొందేందుకు రోల్‌-బేస్డ్‌ యాక్సెస్‌ కంట్రోల్‌ (RBAC) లాగిన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. యూట్యూబ్‌ వంటి పబ్లిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాంలపై ఆధారపడకుండా డ్రోన్‌ ఫీడ్స్‌ను సురక్షితంగా పర్యవేక్షించేలా CDMPని తీర్చిదిద్దారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతోపాటు అవసరమైన చోట వేగంగా స్పందించేందుకు ఇది దోహదపడనుంది.

టెక్నాలజీని అందిపుచ్చుకోకపోతే వెనుకబడతాం...

వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసు శాఖ సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా పేర్కొన్నారు. ఆహారం నుంచి నిత్యావసర వస్తువుల వరకు అనేక సేవలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే అందుతున్నాయని.. సాంకేతికత ప్రజల జీవితాలను సులభతరం చేసిందన్నారు. అదే తరహాలో పోలీసింగ్‌నూ సులభతరం, సమర్థవంతం చేయాలన్నారు.

‘‘ప్రజలు పోలీసు సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదు. పోలీసు సేవలు వారి ముంగిటకే చేరాలి. పోలీసులు తమ కోసం పనిచేస్తున్నారనే నమ్మకం ప్రజల్లో కలగాలి’’ అని స్పష్టం చేశారు.

మహిళల భద్రత నుంచి డ్రగ్స్‌ నియంత్రణ వరకు..

కొత్త సాంకేతిక వ్యవస్థలను రోజువారీ పోలీసింగ్‌లో విస్తృతంగా వినియోగించనున్నట్లు డీజీపీ తెలిపారు. మహిళల భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ, ట్రాఫిక్‌ నిర్వహణ, నేర దర్యాప్తు, ముందస్తు నేర నివారణ చర్యల్లో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. క్షేత్రస్థాయి పోలీసింగ్‌కు టెక్నాలజీని అనుసంధానించడం ద్వారా స్పందన వేగం, పోలీసు కార్యకలాపాల సామర్థ్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

యువ మేధావులే మా బృందం....

పోలీసింగ్‌కు అవసరమైన సాంకేతిక పరిష్కారాల రూపకల్పనలో విద్యాసంస్థలు, యువ సాంకేతిక నిపుణులు అందిస్తున్న సహకారాన్ని డీజీపీ అభినందించారు. పోలీసు శాఖతో కలిసి పనిచేస్తున్న యువ ఆవిష్కర్తలను తమ బృందంలో భాగంగానే భావిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తు పోలీసింగ్‌ అవసరాలకు అనుగుణంగా మరిన్ని వినూత్న సాంకేతిక పరిష్కారాలను రూపొందించాలని సూచించారు.

పోలీసు అధికారులు, సాంకేతిక నిపుణులు, విద్యాసంస్థల సమన్వయంతో రానున్న రోజుల్లో మరిన్ని ఆధునిక అప్లికేషన్లను తీసుకొస్తామని డీజీపీ తెలిపారు. సాంకేతికతతో పోలీసుల విధులను సులభతరం చేయడం, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం, వారిలో భద్రత-భరోసా పెంపొందించడమే అంతిమ లక్ష్యమని హరీష్‌కుమార్‌ గుప్తా స్పష్టం చేశారు.

హోటల్ రంగ ప్రతినిధులు

ఈ సందర్భంగా హోటల్ రంగ ప్రతినిధులు మాట్లాడుతూ, హోటల్‌కు వచ్చే అతిథులకు Accommodation, Hospitalityతో పాటు Safety కల్పించడం తమ బాధ్యత అని తెలిపారు. SAFE STAY AP ద్వారా Guest – Hotel – Police వ్యవస్థల మధ్య డిజిటల్ కనెక్టివిటీ ఏర్పడటం హోటల్ రంగానికి, ముఖ్యంగా అతిథుల భద్రత మరియు అత్యవసర సహాయానికి ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అతిథులకు మంచి సేవలతో పాటు వారు హోటల్‌లో సురక్షితంగా ఉన్నామనే నమ్మకం కల్పించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, IPS గారితో పాటు పోలీస్ ఉన్నతాధికారులు, హోటల్ రంగ ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, విద్యాసంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.