Vijayawada: అస్సాం సీఎంకు విజయవాడ దసరా ఉత్సవాల ఆహ్వానం

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌కు హాజరుకావాలని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మను మంత్రి సత్యకుమార్, ఎంపీ చిన్ని ఆహ్వానించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 24 Sept 2026 9:49 PM IST
Vijayawada
X

Vijayawada: అస్సాం సీఎంకు విజయవాడ దసరా ఉత్సవాల ఆహ్వానం

Vijayawada: (అస్సాం/విజయవాడ) విజయవాడ దసరా నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యక్తిగతంగా ఆహ్వానం అందించారు. అస్సాం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి సత్యకుమార్, ఎంపీ చిన్ని.. విజయవాడ దసరా ఉత్సవాల విశిష్టతను వివరించారు.

ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకుని, విజయవాడ దసరా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని అస్సాం సీఎంను కోరారు. ఈ సందర్భంగా దసరా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు.విజయవాడ నగర సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటే లక్ష్యంతో నిర్వహించనున్న *‘విజయవాడ ఉత్సవ్‌’*కు కూడా హాజరుకావాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను మంత్రి సత్యకుమార్, ఎంపీ చిన్ని ఆహ్వానించారు.

విజయవాడ ఉత్సవ్‌ ఆహ్వాన పత్రికను కూడా ఈ సందర్భంగా అందజేశారు.ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయం, విజయవాడ నగరానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత, నగర సాంస్కృతిక ప్రత్యేకతలను ప్రతిబింబించేలా విజయవాడ ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి, ఎంపీ వివరించారు. విజయవాడ దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌ ద్వారా నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా మరింతగా పరిచయం చేయనున్నట్లు తెలిపారు.

అస్సాం ముఖ్యమంత్రితో పాటు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అశోక్ సింఘాల్, సీఎస్ డాక్టర్ రవి కోటలను కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని కూడా విజయవాడ దసరా నవరాత్రి ఉత్సవాలు, ‘విజయవాడ ఉత్సవ్‌’కు ఆహ్వానించారు.

విజయవాడను ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా మరింతగా అభివృద్ధి చేయడంతో పాటు దేశవ్యాప్తంగా నగరానికి ఉన్న ప్రత్యేకతను చాటే కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) చొరవ తీసుకుంటున్నారు.

దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడకు వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆధ్యాత్మికతతో పాటు నగర సాంస్కృతిక వైభవాన్ని పరిచయం చేసేలా కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.