Vijayawada: ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలి: ఎంపీ కేశినేని శివనాథ్
Vijayawada: క్వాంటం టెక్నాలజీ, ఏఐ యుగంలో యువత ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని కేబీఎన్ కాలేజీ ముఖాముఖిలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు.
Vijayawada: ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలి: ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ: క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్నే మార్చుతున్న నేపథ్యంలో యువతలోని మేధాశక్తిని సద్వినియోగం చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. యువతలో చైతన్యం, నైపుణ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ఉద్యోగార్థులుగా ఉన్న యువతను భవిష్యత్తులో ఉద్యోగాలను సృష్టించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు.
కొత్తపేటలోని కేబీఎన్ కళాశాలలో గురువారం నిర్వహించిన ‘యువతతో ముఖాముఖి’ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో నేరుగా సంభాషించారు. విద్య, ఉపాధి, సాంకేతిక రంగం, క్రీడలు, పారిశ్రామిక అవకాశాలు తదితర అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామని శివనాథ్ పేర్కొన్నారు. వేలాది ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా చేపడుతున్నప్పటికీ, దీనిపై కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న విమర్శలు వాస్తవాలను పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్లేనని ఆయన వ్యాఖ్యానించారు. మరో మూడు డీఎస్సీల నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ, యువత ఎలాంటి అపోహలకు లోనుకాకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు.
క్వాంటం హబ్‌గా అమరావతి
అత్యాధునిక సాంకేతిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ముందంజలో నిలిపేందుకు అమరావతి ప్రాంతాన్ని క్వాంటం హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎంపీ వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వనరులు, అవసరాలు, మానవ వనరుల లభ్యతను పరిగణనలోకి తీసుకుని ప్రాంతీయ సమతుల్యతతో పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
గతంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల వైపు యువత వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, భవిష్యత్తులో రాష్ట్రంలోనే ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో సాంకేతిక, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తరించేలా అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు.
క్రీడలకూ సముచిత ప్రాధాన్యం
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని శివనాథ్ సూచించారు. అత్యుత్తమ క్రీడా ప్రతిభను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ నియామక నిబంధనలు ఉన్నాయని, వాటి ప్రకారమే నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. డీఎస్సీ నియామకాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో అధికారులు నిబంధనలను వివరించినప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా విమర్శలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
30 కళాశాలల్లో యువతతో ముఖాముఖి
యువత సమస్యలు, ఆకాంక్షలు, ఆలోచనలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు త్వరలో సుమారు 30 కళాశాలలను సందర్శించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. యువతతో నిరంతర సంభాషణ ద్వారా వారి అవసరాలను తెలుసుకుని, విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో అవకాశాలను విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో హిందూ హైస్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి. నారాయణరావు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎం. వేంకటేశ్వరరావు, డాక్టర్ కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




