Vijayawada: బ్రెయిన్ డెడ్ అయిన ఉపాధ్యాయురాలు.. ఏడుగురికి పునర్జన్మ!
Vijayawada: విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన ఆదోని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు హేమలత అవయవదానంతో కుటుంబ సభ్యులు ఏడుగురికి పునర్జన్మ ప్రసాదించారు.
Vijayawada: బ్రెయిన్ డెడ్ అయిన ఉపాధ్యాయురాలు.. ఏడుగురికి పునర్జన్మ!
విజయవాడ: మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు ఆదోనికి చెందిన 43 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయురాలు హేమలత. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఆమె, తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం మూడు రోజుల క్రితం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
వైద్యులు నిరంతరం చికిత్స అందించినప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద సమయంలోనూ కుటుంబ సభ్యులు గొప్ప మానవతా దృక్పథాన్ని ప్రదర్శించారు. హేమలత అవయవాలను దానం చేయాలని నిర్ణయించి, పలువురికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించారు.
కుటుంబ సభ్యుల అంగీకారంతో హేమలత అవయవాలను వివిధ ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఆమె రెండు కళ్లను శంకర్ ఆసుపత్రికి, రెండు ఊపిరితిత్తులను హైదరాబాద్‌కు, ఒక కిడ్నీని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి, మరో కిడ్నీని మెడ్‌స్టార్ ఆసుపత్రికి, కాలేయాన్ని కిమ్స్ ఆసుపత్రికి దానం చేశారు.
కాలేయం, ఊపిరితిత్తులు సహా అవసరమైన అవయవాలను హైదరాబాద్‌కు గ్రీన్ ఛానెల్ ద్వారా తరలించే ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా గ్రీన్ ఛానెల్ ద్వారా అవయవాలను వేగంగా గమ్యస్థానాలకు చేర్చారు.
తరగతి గదిలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన హేమలత.. మరణానంతరం కూడా పలువురికి కొత్త జీవితాన్ని అందించి ఆదర్శంగా నిలిచారు. ఆమె కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం అవయవదాన ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పింది. హేమలత భౌతికంగా దూరమైనప్పటికీ, ఆమె దానం చేసిన అవయవాల ద్వారా పలువురి జీవితాల్లో వెలుగులు నింపనున్నారు.




