Vijayawada: ఏపీ అందాలు వెండితెరపై.. చెన్నై లవ్ స్టోరీ'కి ప్రభుత్వ ప్రోత్సాహం

Vijayawada: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రంలోని నాలుగో పాటను విజయవాడలో విడుదల చేశారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 5 July 2026 8:24 AM IST
Vijayawada
X

Vijayawada: ఏపీ అందాలు వెండితెరపై.. చెన్నై లవ్ స్టోరీ'కి ప్రభుత్వ ప్రోత్సాహం

Vijayawada: ఆంధ్రప్రదేశ్‌ను సినిమా చిత్రీకరణకు అనువైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మరో ఉదాహరణగా 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా నిలిచిందన్నారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.. ఈ చిత్రంలోని నాలుగో పాట ను విజయవాడ లో విడుదల చేశారు..ఈ కార్యక్రమం లో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు పాల్గొని చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధిపై ప్రభుత్వ దృక్పథాన్ని స్పష్టంగా తెలియజేశాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సినిమా పరిశ్రమకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు కందుల దుర్గేష్ . చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన ప్రతి చర్యను ప్రభుత్వం చేపడుతోందని, షూటింగ్ అనుమతులను సింగిల్ విండో విధానంలో వేగంగా మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇదే విధంగా పరిశ్రమ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్‌లో స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్ కేంద్రాలు వంటి సినిమా మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా అండ ఉంటుందని హామీ ఇచ్చారు.

'చెన్నై లవ్ స్టోరీ' చిత్ర విశేషాలను ప్రస్తావిస్తూ, ఈ సినిమా ద్వారా ఆంధ్రప్రదేశ్ సహజ సౌందర్యాన్ని అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారని మంత్రి అభినందించారు. చీరాల, బాపట్ల, సూర్యలంక బీచ్‌లతో పాటు రాష్ట్రంలోని పలు అందమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరగడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర పర్యాటక రంగానికి కూడా ఇలాంటి సినిమాలు మంచి ప్రచారం తీసుకువస్తాయని అభిప్రాయపడ్డారు. మణిశర్మ అందించిన సంగీతం, దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన కథ, హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

తొలిప్రేమ గొప్పదే కానీ అదే జీవితం కాదు" అనే కొత్త కోణంలో ఈ ప్రేమకథను తెరకెక్కించామని తెలిపారు చిత్ర నిర్మాతలు ఎస్.కె.ఎన్., సాయి రాజేష్, ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, మూడు పాటలకు మంచి స్పందన లభించిందన్నారు దర్శకుడు రవి నంబూరి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ భాగం షూటింగ్ నిర్వహించామని, అనుమతుల విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించిందని వెల్లడించారు. సింగిల్ విండో విధానం వల్ల చిత్రీకరణ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయిందని, ఇందుకు మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'చెన్నై లవ్ స్టోరీ' భారీ విజయాన్ని సాధించాలని మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. సినిమా విజయంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను చిత్రీకరణ కేంద్రంగా మరింత మంది నిర్మాతలు ఎంచుకోవాలని, తద్వారా రాష్ట్రంలో సినిమా రంగానికి కొత్త అవకాశాలు, ఉపాధి, పెట్టుబడులు పెరుగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మొత్తంగా ఈ కార్యక్రమం సినిమా ప్రచారంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను సినీ పరిశ్రమకు ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలబెట్టే ప్రభుత్వ ప్రయత్నాలకు మరో నిదర్శనంగా మారింది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story