Vijayawada: కృష్ణా కరకట్ట నివాసితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి
Vijayawada: కృష్ణా కరకట్ట నివాసితులకు వెంటనే ఇళ్ల పట్టాలు, రూ. 5 లక్షల ఇళ్ల నిర్మాణ సాయం అందించాలని సీపీఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Vijayawada: కృష్ణా కరకట్ట నివాసితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి
విజయవాడ: ప్రభుత్వం పేదలకు పట్టాల పండుగ, పట్టాభిషేకం అని హడావిడి చేస్తున్నారు. కానీ కృష్ణా కరకట్టపై ఉన్న ప్రజలు ఎన్నొ ఆశలతో కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారు. ఎన్నికల్లో గెలిపిస్తే పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఈ ప్రాంత ఇళ్ళకు పట్టాలు లేవు, ఇళ్ళపై హక్కు లేదు.
ప్రతి సంవత్సరం వరదల్లో ఇళ్ళు మునిగిపోయి, ఇళ్ళు దెబ్బతిని సామాన్లు కోల్పోయినా పొట్ట చేతపట్టుకుని పనుల కోసం కట్టలపైనే నివాసం ఉన్నారు. వరదల్లో రూపాయి ఆర్ధిక సహాయం కూడా ప్రభుత్వం చేయలేదు. దెబ్బతిన్న ఇళ్ళ పునర్నిర్మాణానికి అప్పులు చేసుకుని కట్టుకున్నారు.
ఒకప్పుడు తెలుగుదేశంతో పాటు అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు వీరిని ఎలా తొలగించాలా అని చూసారు. సిపిఎం, జనం పోరాటాలతోనే ఈ ప్రాంత ఇళ్ళ తొలగింపు ఆగింది. ప్రజాపోరాటాల వలన ఈ ప్రాంతంలో ఇళ్ళు నిలబడ్డాయి.
కృష్ణా నదిపై రక్షణగోడ (రిటైనింగ్‌వాల్) నిర్మాణం చేపట్టాలని అడిగితే కమ్యూనిస్టులు, జనం పోట్లాడితే నదిలో గోడ సాధ్యం ఎలా అవుతుంది అన్నారు. ఈ రోజు గోడ నిర్మాణం పూర్తయ్యింది. ఇది మీ గొప్పతనం కాదు ప్రజలు, కమ్యూనిస్టులు సిపిఎం పోరాట ఫలితం.
గోడ కట్టారు, వరద ముంపు లేదు, అయినా ఈ ప్రాంత ఇళ్ళకు పట్టాలు ఇవ్వడం కుదరదు అంటున్నారు. మాస్టర్ ప్లాన్‌లో 100 అడుగుల రోడ్డు వేస్తామంటున్నారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గోడ నిర్మాణం చేసింది వరదల నుండి ప్రజలను కాపాడడానికా? ఇళ్ళు తొలగించి రోడ్లు వేసుకోవడానికా?
ఉండవల్లిలో కృష్ణా కరకట్ట పక్కన పెద్ద పెద్ద నాయకులు, కోటీశ్వరులు పెద్ద భవంతులు, విశ్రాంతి భవనాలు, ప్యాలెస్‌లు కట్టుకుంటే నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. 50 సంవత్సరాలుగా తాటాకులు, రేకుల షెడ్డులో ఎండలకు మాడిపొతున్నాం అప్పు చేసి కప్పు మార్చుకుంటాం అంటే వారికి ఎందుకు అనుమతి ఇవ్వరు. పట్టాలు ఇచ్చి వారికి ఇంటిపై వారికి శాశ్వత హక్కు కల్పించడానకి అభ్యంతరం ఏంటి.
కృష్ణా నది ప్రక్కన పెద్దపెద్ద బంగ్లాలు ఉన్నాయి. పదిహేను సంవత్సరాల క్రితం వచ్చిన ముఖ్యమంత్రి గారి ఇళ్ళు కూడా నది ఒడ్డునే ఉన్నది. దానికి పట్టా ఉంది కానీ 50 ఏళ్ళుగా ఉంటున్న ప్రజలకు పట్టాలు ఇవ్వడం లేదు. కాలువ కట్టలపై స్థలాలో పెద్ద భవంతులు నిర్మిచుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు. కానీ పేద వాళ్ళ ఇళ్ళ విషయంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది.
టిడిపి ప్రజాప్రతినిధులు.. పట్టాల సభకు రావాలని బొట్టు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నారు. ఏళ్ళ తరబడి కృష్ణా కరకట్ట ప్రజలతో ఓట్లు వేయించుకుంటున్నారు. తారకరామానగర్, భూపేష్‌గుప్తా నగర్, కృష్ణా కరకట్ట ప్రజలు వారికి గుర్తు రావడంలేదా? ముఖ్యమంత్రితో మాట్లాడి పట్టాలు ఇప్పించలేరా?
కృష్ణా కరకట్ట ప్రజలకు వారి ఇళ్ళకు శాశ్వత హక్కు కల్పించాలని, రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చి, ఇతరులకు ఇచ్చినట్లే 5లక్షల ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నాము.
ఎన్నో యేళ్ళుగా ప్రభుత్వాలు మారుతున్నా, ప్రజా ప్రతినిధులుగా ఎన్నేళ్ళు పనిచేసినా కృష్ణా కరకట్ట ప్రజల సమస్య పరిష్కారం చేయలేదు. అందుకే కృష్ణా కరకట్ట ప్రజల ఇళ్ళకు పట్టాలు ఇవ్వాలి. పట్టాలు సాధించుకునేంత వరకు ప్రజలతో కలిసి పోరాటాలు నిర్వహిస్తాం.
ఈ కార్యక్రమంలో తూర్పు నగర కార్యదర్శి పి.కృష్ణ, నగర కార్యదర్శి వర్గ సభ్యులు తమ్మిన చంద్రశేఖర్, స్థానిక నాయకులు వరప్రసాద్, వై. కృష్ణ, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




