Vijayawada: ఎన్నికలు ముగియగానే విజయవాడలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు!
Vijayawada: విజయవాడ పాయికాపురం, శాంతినగర్లో సంతకాలు ఫోర్జరీ చేసి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న అదానీ సిబ్బందిని సీపీఎం నేతలు, స్థానికులు అడ్డుకున్నారు.
Vijayawada: ఎన్నికలు ముగియగానే విజయవాడలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు!
Vijayawada: నగరపాలక సంస్థ ఎన్నికలు ముగియగానే విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలలో విద్యుత్ శాఖ అధికారులు, అదాని కంపెనీ సిబ్బంది విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును ముమ్మరం చేశారు.
పాయికాపురం, 82వ డివిజన్ లోని, శాంతినగర్ ప్రాంతంలో ఆదానీ సంస్థ కాంట్రాక్టర్లు, సూపర్వైజర్లు ఇంటింటికి తిరిగి మీటర్లు బిగింపుకు అంగీకరించకపోతే.. విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తామని బెదిరిస్తున్నారు.
మీటర్లు పెట్టుకోవడానికి అంగీకరించకపోతే భవిష్యత్తులో వేల రూపాయలు భారం పడుతుందని.. ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. మీటర్లు పెట్టడానికి అంగీకరించినట్లు వినియోగదారుల సంతకాలను అదానీ కంపెనీ వారే ఫోర్జరీ చేసి పత్రాలు పూర్తి చేస్తున్నారు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే బాబురావు, సిపిఎం నేతలు కే దుర్గారావు, సిహెచ్.శ్రీనివాస్ ,డి. విష్ణువర్ధన్, బి.రజని తదితరులు ఆ ప్రాంతానికి చేరుకుని ప్రజలతో మాట్లాడారు. వాస్తవాలు మభ్యపరిచి, బెదిరించి మీటర్లు బిగిస్తున్నట్లు స్థానికులు నేతలకు వివరంగా తెలిపారు, తమ ఆగ్రహాన్ని తెలియజేశారు.
మీటర్లు బిగిస్తున్న ప్రాంతానికి నేతలు వెళ్లి అడ్డుకున్నారు, పూర్తి చేసిన పత్రాలను పరిశీలించగా వినియోగదారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు బట్టబయలు అయింది. దీనితో స్థానిక ప్రజలు, తాము సంతకాలు పెట్టకుండా, సిబ్బంది ఫోర్జరీ చేసి సంతకాలు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదాని సంస్థ కాంట్రాక్టర్.. స్థానికులు పై దురుసుగా వ్యవహరించడంతో.. ప్రజలు ప్రతిఘటించారు.. కాంట్రాక్టర్ వైఖరిని తీవ్రంగా నిరసించారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఎం నేతలు, స్థానికులు నిరసన తెలిపారు.
అదానీ సిబ్బంది తమను బెదిరిస్తున్నారని, తమ సంతకాలను ఫోర్జరీ చేస్తున్నట్లు స్థానికులు, సిపిఎం నేతలు.. నున్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు, వారిపై చర్యలు తీసుకోవాలని రాతపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు.
దౌర్జన్యంగా మీటర్ల బిగింపు, వినియోగదారుల సంతకాల ఫోర్జరీ, కాంట్రాక్టర్ దురుసువైఖరిపై ప్రజల ఆగ్రహంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది, స్థానికులందరూ రోడ్లపైకి వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల బిగింపు, అదాని సిబ్బంది దౌర్జన్యాలపై సిపిఎం నేతలు.. విద్యుత్ శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బాబురావు, నేతలు మాట్లాడుతూ.... నగరపాలక సంస్థ ఎన్నికలు ముగియగానే విద్యుత్ స్మార్ట్ మీటర్ల ల బిగింపును మళ్ళీ పునరుద్ధరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పై మాట తప్పింది, ప్రజలను మోసగిస్తోంది.
ప్రతి పక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగలగొట్టండని పిలుపునిచ్చిన కూటమి నేతలు... నేడు మీటర్ల బిగింపుకు ఆదేశాలు ఇవ్వటం సిగ్గుచేటు. స్మార్ట్ మీటర్ల వలన భవిష్యత్తులో ప్రజలపై అనేక రూపాల్లో భారాలు పడతాయి. ఇప్పటికే స్మార్ట్ మీటర్లు బిగించిన వినియోగదారులకు కూడా అధికంగా బిల్లులు వస్తాయన్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు.
భవిష్యత్తులో ప్రీపెయిడ్ పద్ధతిలో ముందుగానే నగదు చెల్లించి విద్యుత్తు వినియోగించుకోవాలి, నగదు అయిపోగానే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. విద్యుత్ స్మార్ట్ మీటర్ వ్యయం పదివేల రూ... దశలవారీగా వినియోగదారుల నుండి వసూలు చేస్తారు.
ప్రతి గంటకు వినియోగాన్ని బట్టి విద్యుత్ టారిఫ్ నిర్ణయించే విధానాన్ని ఇప్పటికే కొన్ని కేటగిరీల వారికి ప్రవేశపెట్టారు, భవిష్యత్తులో గృహ వినియోగదారులకు కూడా పగలు కంటే రాత్రి అధికంగా విద్యుత్ బిల్లులు వసూలు చేయటానికి ప్రభుత్వం కుట్ర పన్నింది.
అదానీ సంస్థ ప్రయోజనాల కొరకు కేంద్ర మోడీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగి గత ప్రభుత్వం మీటర్ల బిగింపుకు ఒప్పందం చేసుకున్నది, అధికారంలోకి రాగానే మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పి, టిడిపి కూటమి ప్రభుత్వ స్మార్ట్ మీటర్లను కొనసాగించడం మోసపూరితం.
ఇప్పటికే విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని ప్రజల ఆందోళన చెందుతూ ఉండగా, చార్జీలు తగ్గించకుండా, మళ్లీ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై దీర్ఘకాలిక భారాలు వేయటం తగదు.
వాస్తవాలను మభ్యపరిచి, ప్రజలను భయభ్రాంతులను చేస్తూ అనైతిక, అక్రమ పద్ధతుల్లో మీటర్ల బిగింపుకు ప్రభుత్వం పూనుకోవటం శోచనీయం. కూటమి ప్రజాప్రతినిధులు దీనికి బాధ్యత వహించాలి, వారు వెంటనే స్పందించాలి, స్మార్ట్ మీటర్ల బిగింపును వారే ఆపించాలి.
వినియోగదారుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ, బెదిరిస్తూ, దౌర్జన్యాలకు పాల్పడుతున్న అదాని కంపెనీ కాంట్రాక్టర్లు, అధికారులపై పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. విద్యుత్ భారాలు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.
విజయవాడ నగరంలో ప్రజలు చైతన్యంగా ఉండి ఎక్కడికక్కడ స్మార్ట్ మీటర్ల బిగింపును అడ్డుకోవాలి, ప్రతిఘటించాలి, సిపిఎం వారికి అండగా నిలుస్తుంది.




