Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఘనంగా అర్చక సత్కారము
Indrakeeladri: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రులలో భాగంగా దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ అధ్యక్షతన 'అర్చక సత్కారము' అత్యంత ఘనంగా జరిగింది.
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఘనంగా అర్చక సత్కారము
ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని శనివారం (ఆశ్వయుజ శుద్ధ సప్తమి) సాయంత్రం కొండపై ఉన్న శ్రీ మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో ‘అర్చక సత్కారము’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ సభాధ్యక్షతన జరిగిన ఈ సన్మాన సభలో ఉత్సవాల వేళ నిరంతరం వైదిక క్రతువులు నిర్వహిస్తున్న అర్చక స్వాములను ఘనంగా సత్కరించారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర మల్లేశ్వర శాస్త్రి, బ్రహ్మశ్రీ లింగంభొట్ల దుర్గాప్రసాద్ శర్మ, బ్రహ్మశ్రీ కుందుర్తి కనక సుందర శర్మల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా సాగింది.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ మాట్లాడుతూ.. సమాజ సంక్షేమంలో, ఆలయ సంప్రదాయాల పరిరక్షణలో అర్చకుల పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్నారు. "ఆలయాల్లో పూజాధికాలు సజావుగా సాగడమే కాకుండా, సమస్త మానవాళి ఆయురారోగ్యాలు, సుభిక్షం కోసం ప్రతిరోజూ సంకల్పం చేసి హోమాలు, జపాలు నిర్వహించేది అర్చకులే. లోక కళ్యాణార్థం శ్రమించే అర్చక స్వాములను గౌరవించుకోవడం మన బాధ్యత."
తరతరాలుగా వస్తున్న వేద సంస్కృతిని, ఆలయ సాంప్రదాయాలను సజీవంగా నిలబెడుతున్నది వైదిక, అర్చక వర్గమేనని కొనియాడారు.
అనంతరం వేదికపై అర్చక స్వాములకు దేవస్థానం తరఫున శాలువాలు కప్పి, ప్రసాదాలు అందజేసి సముచిత రీతిలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా దేవాదాయ కమిషనర్ కు అర్చకులు ఆశీస్సులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అర్చక స్వాములు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.




