Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఆదిదంపతుల దివ్య నగరోత్సవం

Indrakeeladri: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రుల 8వ రోజు ప్రదోషవేళ గంగా పార్వతీ సమేత మల్లేశ్వరుని దివ్య నగర రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది.

Satyanarayana, Vijayawada
Published on: 18 Oct 2026 6:20 PM IST
Indrakeeladri
X

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఆదిదంపతుల దివ్య నగరోత్సవం

​​ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో 8వ రోజైన ఆదివారం సాయంత్రం ఆదిదంపతుల దివ్య నగర రథోత్సవం భక్తిప్రపత్తుల నడుమ అత్యంత వైభవోపేతంగా జరిగింది.

​ఇంద్రకీలాద్రిపై జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారు దుష్టశిక్షణ, భక్త సంరక్షణకారిణి అయిన సాక్షాత్తు శ్రీ దుర్గా దేవి దివ్యాలంకారంలో భక్తులకు కరుణామృత దృష్టితో దర్శనమిస్తుండగా, పరమ పవిత్రమైన ప్రదోషకాల సమయంలో కొండపై కొలువుదీరిన శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తులకు అర్చక బృందం శాస్త్రోక్తంగా విశేష పూజలు,హారతులు నిర్వహించారు.

అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ గంగా పార్వతీ (దుర్గా) సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల పవిత్ర నగరోత్సవం ఘనంగా ప్రారంభమైంది.

నగరోత్సవం ముందుకు కదులుతుండగా సన్నాయి మేళాలు, నాదస్వరాలు, కేరళ పంచవాద్యాల దరువులు, శాక్సోఫోన్ సుస్వరాలు వీధుల్లో ఆధ్యాత్మిక తరంగాలను సృష్టించాయి. మహిళా భక్తుల లయాన్విత కోలాటాలు, జానపద కళాకారుల నృత్య విన్యాసాలు ఊరేగింపు ముంగిట ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

​శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం నుండి ప్రారంభమైన ఈ దివ్య శోభాయాత్ర రథం సెంటర్, వన్ టౌన్ వినాయక గుడి, కెనాల్ రోడ్డు, పవిత్ర కృష్ణా తీరాన ఉన్న దుర్గా ఘాట్ మీదుగా ఘాట్ రోడ్డు ద్వారా సాగింది. వేలాది మంది భక్తులు "జై భవానీ.. జై జై భవానీ", "ఓం దుర్గాయై నమః" అంటూ చేసిన జయజయధ్వానాలతో ఇంద్రకీలాద్రి పురవీధులు మార్మోగాయి.

​ సర్వాంగసుందరంగా విద్యుద్దీపాలు, సుగంధ పుష్పమాలికలతో ముస్తాబు చేసిన రథంపై కొలువుదీరిన ఆదిదంపతులను దర్శించుకునేందుకు పురవీధుల్లో భక్తులు బారులు తీరారు. మార్గమధ్యంలో భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ, కొబ్బరికాయలు కొడుతూ స్వామి, అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో ఘన నీరాజనాలు పలికారు. నగరోత్సవం కొండపైకి చేరుకున్న అనంతరం ఆలయ రాజగోపురం ముంగిట ఉత్సవ మూర్తులను ఆసీనులను చేసి, స్థానాచార్యుల పర్యవేక్షణలో వేద పండితులు, అర్చకులు వేదోక్తంగా దివ్య "ఆస్థాన సేవ" నిర్వహించి హారతులు సమర్పించారు.

శ్రీ ​దుర్గాదేవి అలంకార దినాన ప్రదోషవేళ గంగా పార్వతీ సమేత పరమేశ్వరుడిని నగరోత్సవంలో దర్శించుకోవడం వల్ల సమస్త శత్రుపీడలు, దుష్టగ్రహ దోషాలు, భయాలు నశించి కుటుంబంలో విజయం, శాంతి, సర్వతోముఖాభివృద్ధి లభిస్తాయని భక్తుల విశ్వాసం.

​ఈ మహోత్సవంలో ఆలయ అర్చకులు,ఆలయ ఉద్యోగులు మరియు అశేష భక్తజనం పాల్గొని ఆదిదంపతుల కృపాకటాక్షాలను పొందారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada