Indrakeeladri: కన్నులపండువగా దుర్గా మల్లేశ్వరుల దివ్య నగరోత్సవం

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి తొలిరోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దివ్య నగరోత్సవం, రావిచెట్టు వద్ద ఆస్థాన సేవ అత్యంత వైభవంగా జరిగాయి.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 11 Oct 2026 8:06 PM IST
Indrakeeladri
X

Indrakeeladri: కన్నులపండువగా దుర్గా మల్లేశ్వరుల దివ్య నగరోత్సవం

ఇంద్రకీలాద్రి: శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాల తొలి రోజైన ఆదివారం సాయంత్రం జగన్మాత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దివ్య నగరోత్సవం అత్యంత నేత్రపర్వంగా జరిగింది.

కొండపై కొలువుదీరిన శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం (శివాలయం) నుండి ఉత్సవమూర్తుల పల్లకీ ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, సాంప్రదాయ మంగళవాయిద్యాలు, కేరళ వాయిద్యాల దివ్య ఘోష, శాక్సాఫోన్ నాదం, భక్తుల కోలాటాలు మరియు గరగ నృత్యాల నడుమ నగరోత్సవం ఆద్యంతం శోభాయమానంగా సాగింది.

ఈ ఊరేగింపులో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ,సభ్యులు, ఆలయ అధికారులు మరియు వందలాది మంది భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. కొండపై నుండి బయలుదేరిన ఈ ఊరేగింపు కనకదుర్గానగర్, రథం సెంటర్, వినాయకుడి గుడి, కెనాల్ రోడ్డు మరియు ఘాట్ రోడ్డు మీదుగా భక్తుల జయజయధ్వానాల నడుమ తిరిగి కొండపైకి చేరుకుంది.

అనంతరం ఇంద్రకీలాద్రిపై గల పవిత్ర అమ్మవారి రావిచెట్టు ప్రాంగణం వద్ద స్వామి, అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా విశేష పూజలు నిర్వహించి, ఆస్థాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. దారిపొడవునా భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామివార్ల కృపకు పాత్రులయ్యారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.