Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఘనంగా ‘వేదవిద్వత్ సభ’

Indrakeeladri: శ్రీ దుర్గాష్టమి పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై వేదవిద్వత్ సభ ఘనంగా జరిగింది. 450 మంది వేద పండితులను కార్యదర్శి కె. కన్నబాబు ఘనంగా సత్కరించారు.

Satyanarayana, Vijayawada
Published on: 18 Oct 2026 7:30 PM IST
Indrakeeladri
X

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఘనంగా ‘వేదవిద్వత్ సభ’

​ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో పవిత్రమైన దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం శ్రీ మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో ‘వేదవిద్వత్ సభ’ అత్యంత వైభవంగా జరిగింది. చతుర్వేద పారాయణ పండితుల సన్మాన సభగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేదమాతకు విశేష నీరాజనాలు పలికారు.

వేదోఽఖిలో ధర్మమూలం స్మృతిశీలే చ తద్విదామ్ ।

ఆచారశ్చైవ సాధూనామాత్మనస్తుష్టిరేవ చ ॥

(సకల ధర్మాలకు వేదమే మూలాధారం; వేదోక్త జీవన విధానం, ధర్మ రక్షణ సమాజానికి శాంతిని, శ్రేయస్సును చేకూరుస్తాయి.)

​ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ (దేవాదాయ శాఖ) కార్యదర్శి కె. కన్నబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు.సభా నిర్వాహకులుగా బ్రహ్మశ్రీ చింతపల్లి ఆంజనేయ ఘనపాఠి వ్యవహరించగా, వేద పారాయణానంతరం స్వస్తి, ఆశీర్వచన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి.

​వేదాలే మన సంస్కృతికి మూలస్తంభాలు – కె. కన్నబాబు

​ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు మాట్లాడుతూ.. సనాతన హిందూ ధర్మంలో వేదాలు, ఉపనిషత్తుల విశిష్టతను విపులంగా వివరించారు.

"మన సంస్కృతికి, ఆధ్యాత్మిక జీవనానికి వేదాలే మూలస్తంభాలు. సమస్త మానవాళి శ్రేయస్సును, విశ్వశాంతిని కాంక్షించే అద్భుత జీవన విజ్ఞానం వేదాలు, ఉపనిషత్తులలో నిక్షిప్తమై ఉంది."

​ప్రాచీన వేద సంప్రదాయాన్ని, ఉచ్ఛారణా శుద్ధితో కూడిన మౌఖిక పరంపరను తరతరాలుగా సజీవంగా నిలుపుతూ సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలిస్తున్న వేదపండితుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు.

దసరా శరన్నవరాత్రుల వేళ ఇంద్రకీలాద్రి క్షేత్రం వేదమంత్రోచ్ఛారణలతో ప్రతిధ్వనించడం అత్యంత శుభప్రదమని, లోకకళ్యాణార్థం పారాయణాలు నిర్వహిస్తున్న పండిత వర్గాన్ని సత్కరించుకోవడం ఎంతో సంతోషాన్నిస్తోందని ఈవో శీనా నాయక్ పేర్కొన్నారు.

వేద సంరక్షణే ధర్మ సంరక్షణ అని, ఇంద్రకీలాద్రిపై పవిత్ర దసరా మహోత్సవాల వేళ చతుర్వేద పారాయణాలతో క్షేత్రం పునీతమైందని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పేర్కొన్నారు.

​వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన 450 మంది ఘనపాఠీలు, క్రమపాఠీలు, వేదమూర్తులకు దేవస్థానం తరఫున శాలువాలు కప్పి, శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు మరియు జ్ఞాపికలను అందజేసి అత్యంత గౌరవప్రదంగా సత్కరించి సన్మానించారు.

​ఈ వేదవిద్వత్ సభలో స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ఆలయట్రస్ట్ బోర్డ్ సభ్యులు సరోజినీ దేవి, పద్మావతి ఠాకూర్,సరిత, రాఘవరాజు, శ్రీనివాసరావు,సహాయ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె. గంగాధర్, పర్యవేక్షకులు శ్రీమతి హేమ దుర్గాంబ, ఆలయ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో వేదపండితులు పాల్గొన్నారు.

​

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada