Vijayawada: ఇంద్రకీలాద్రి దసరా వైభవం..సోషల్ మీడియాలో 2.29 కోట్ల వీక్షణలు!

Vijayawada: ఇంద్రకీలాద్రిపై జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సోషల్ మీడియాలో 2.29 కోట్ల వీక్షణలు నమోదయ్యాయని దుర్గగుడి చైర్మన్ గాంధీ, ఈవో శీనా నాయక్ వెల్లడించారు.

Satyanarayana, Vijayawada
Published on: 5 Nov 2026 5:55 PM IST
Vijayawada
X

Vijayawada: ఇంద్రకీలాద్రి దసరా వైభవం..సోషల్ మీడియాలో 2.29 కోట్ల వీక్షణలు!

Vijayawada: ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా జరిగిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సామాజిక మాధ్యమాల ద్వారా దేశ విదేశాల్లోని భక్తుల చెంతకు చేరాయని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సంయుక్తంగా వెల్లడించారు.

అక్టోబర్ 11 నుంచి 25 వరకు 15 రోజుల వ్యవధిలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దివ్య అలంకారాలు, ప్రత్యక్ష ప్రసారాలు, విశేష పూజలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను సామాజిక మాధ్యమాలలో 2.29 కోట్ల మంది వీక్షించారని తెలిపారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా ఉత్సవాల వేళ డిజిటల్ మాధ్యమాలలో భక్తుల నుండి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌లో 50 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 42.5 లక్షలు, యూట్యూబ్‌లో 25.7 లక్షలకు పైగా వీక్షణలు నమోదయ్యాయని వివరించారు.

ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా ప్రసారమైన రోజువారీ విశేష అలంకార దర్శనాలు, శత చండీ యాగం, లక్ష కుంకుమార్చన వంటి సేవల ప్రత్యక్ష ప్రసారాలను లక్షలాది మంది భక్తులు వీక్షించారని, ఒక్కో అలంకార ప్రత్యక్ష ప్రసారానికి సగటున 33 వేల నుంచి 57 వేల వరకు వీక్షణలు వచ్చాయని తెలిపారు.

అలాగే నగరకోత్సవ ఊరేగింపులోని గిరిజన ధింసా నృత్యం, కోలాటాలు, కేరళ వాయిద్యాలు, దసరా కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు, కృష్ణానది పవిత్ర నవ హారతులు మరియు తెప్పోత్సవం వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పారు.

​భక్తులకు అందుబాటులో ఉన్న దేవస్థాన అధికారిక సోషల్ మీడియా ఖాతాలు:

​యూట్యూబ్ (YouTube): Kanakadurga temple (@Kanakadurgatemple)

​ఇన్‌స్టాగ్రామ్ (Instagram): kanakadurgammatemple, kanakadurgamma_temple_vja

​ఫేస్‌బుక్ (Facebook): Kanaka Durgamma, Kanakadurga Temple, Sri Kanakadurga Temple, Sree Durga Malleswara Swami Varla Devastanam, Kanaka Durga Temple Vijayawada

​వాట్సాప్ చానల్ (WhatsApp Channel): kanakadurgamma_temple_vja

​ఎక్స్ / ట్విట్టర్ (X - Twitter): @KanakaDurgaVJY

​థ్రెడ్స్ (Threads): @kanakadurgamma_official_ap

​టెలిగ్రామ్ (Telegram): Kanaka Durga VJY | Official Temple Updates (t.me/KanakaDurgaVJY)

​ప్రత్యక్షంగా క్షేత్రానికి రాలేకపోయిన భక్తులు డిజిటల్ వేదికల ద్వారా అమ్మవారి విశేష పూజాదికాలను దర్శించుకుని పునీతులయ్యారని వివరించారు.

దేవస్థానం విశేషాలను సంప్రదాయ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాతో పాటు దేవస్థానం అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు చేరవేస్తామని చైర్మన్, ఈవో వెల్లడించారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada