Vaddeswaram: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కేఎల్‌యూలో శిక్షణ
Vaddeswaram: పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో కేఎల్ డీమ్డ్ వర్సిటీలో ‘స్కిల్ పలావర్ 2026-27’ మూడో విడత విజయవంతంగా ముగిసింది.
Vaddeswaram: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కేఎల్‌యూలో శిక్షణ
Vaddeswaram: విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దే లక్ష్యంతో కేఎల్ డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం నిర్వహించిన ‘స్కిల్ పలావర్ 2026–27’ మూడో విడత విజయవంతంగా ముగిసింది. విశ్వవిద్యాలయ నైపుణ్యాభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో అక్టోబరు 10వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. విద్యార్థులు పాఠ్యాంశాల్లో నేర్చుకున్న సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టేలా ప్రాజెక్టుల రూపకల్పనకు అవకాశం కల్పించారు.
స్కిల్ పలావర్‌లో భాగంగా మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్–డెవ్‌ఆప్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్–ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), సెమీకండక్టర్లు–మైక్రోఎలక్ట్రానిక్స్ (వీఎల్‌ఎస్‌ఐ), మెకానికల్–ఏరోస్పేస్ ఇంజినీరింగ్ (క్యాడ్/క్యామ్), బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (బీఐఎం), రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్‌పీఏ) రంగాల్లో విద్యార్థులు ప్రాజెక్టులు చేపట్టారు. ఆయా రంగాల్లోని సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను రూపొందించడంతోపాటు, బృందాలుగా పనిచేస్తూ పరిశ్రమల అవసరాలకు తగిన పరిష్కారాలను అభివృద్ధి చేశారు.
హ్యాకథాన్‌లో భాగంగా ప్రథమ సంవత్సరం బీటెక్ ఆనర్స్ విద్యార్థులకు డిజిటల్ డిజైన్ అండ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ (డీడీసీఏ) అంశంపై ప్రత్యేకంగా బిల్డథాన్ నిర్వహించారు.
విద్యార్థుల బృందాలు ఎంపిక చేసిన సమస్యలపై ప్రాజెక్టులను రూపొందించాయి. మార్గదర్శకుల సాయంతో వాటిని అభివృద్ధి చేస్తూ, పరిశ్రమల నిపుణులతో చర్చించి సాంకేతిక అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకున్నాయి. అనంతరం ప్రాజెక్టులను నిపుణుల ముందు ప్రదర్శించాయి. వాటి పనితీరు, సాంకేతిక నాణ్యత, ఆచరణ సాధ్యత, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉన్న అంశాలను నిపుణులు పరిశీలించి సూచనలు అందించారు.
సమాచార సాంకేతికత, క్లౌడ్ మౌలిక సదుపాయాలు, డేటా ఇంజినీరింగ్, సైబర్ భద్రత, సెమీకండక్టర్ డిజైన్, ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్, ఆటోమేషన్ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులు మూల్యాంకనంలో పాల్గొన్నారు.
వారిలో సీజీఐ లీడ్ అనలిస్ట్ వంశీకృష్ణ, ఐబీఎం సీనియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పెషలిస్ట్ వి. శ్రీధర్, క్లౌడాలివ్ డేటా ఇంజినీర్ ఎస్. వెంకట నారాయణ, లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ ఇండియా సీనియర్ డేటా ఇంజినీర్ జె. రాజశేఖర్, ఇన్వెస్కో సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అండ్ ఇంజినీరింగ్ మేనేజర్ రోహిత్, కాస్ట్‌కో ఆపరేషన్స్ సూపర్‌వైజర్ శ్రీకాంత్ ఎ., సైనాప్సిస్ ఆర్ అండ్ డీ ఇంజినీర్ ఎస్. చిన్న వెంకట నారాయణరెడ్డి, బోయింగ్ టెక్నికల్ లీడ్ హరికృష్ణ, ఇన్‌స్కేప్ డిజైన్ స్టూడియో ఆర్కిటెక్ట్, మేనేజింగ్ పార్ట్‌నర్ ప్రవీణ్ కృష్ణ టి., టిటెక్ డిజిటల్ అనలిటిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ సీనియర్ ఆర్‌పీఏ డెవలపర్ శ్రీనివాసులు, హెచ్‌టీసీ గ్లోబల్ సర్వీసెస్ ఎల్2 అసోసియేట్ హరిహరన్ రవిచంద్రన్, ఆధ్వ్యా స్కిల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వ్యవస్థాపకుడు, సీఈఓ జి. అనీష్‌కుమార్ ఉన్నారు.
పరిశ్రమల నిపుణుల భాగస్వామ్యంతో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే సవాళ్లు, వృత్తిపరమైన ప్రమాణాలు, పరిష్కారాల సాధ్యాసాధ్యాలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందన్నారు. నిపుణుల సూచనలతో తమ ప్రాజెక్టుల్లోని లోపాలను గుర్తించి, వాటిని మరింత మెరుగుపరుచుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు.
కేఎల్‌ఈఎఫ్ నైపుణ్యాభివృద్ధి, విద్యార్థుల పురోగతి విభాగం డీన్ డాక్టర్ ఎ. శ్రీనాథ్, ఎఫ్‌ఈడీ డైరెక్టర్ డాక్టర్ ఎ. జగదీష్ నాయకత్వంలో కార్యక్రమం నిర్వహించారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఎఫ్‌ఈడీ ప్రిన్సిపల్ డాక్టర్ వి. కృష్ణారెడ్డి సహకారం అందించారు. విభాగాధిపతులు, అధ్యాపక సమన్వయకర్తలు, కోర్సు సమన్వయకర్తలు, అధ్యాపకులు, ప్రాజెక్టు మార్గదర్శకులు కార్యక్రమ నిర్వహణ, విద్యార్థులకు మార్గనిర్దేశం, ప్రాజెక్టుల మూల్యాంకనంలో భాగస్వాములయ్యారు.
మారుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడంలో అనుభవాధారిత విద్య కీలకమని విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ జి. పార్థసారథి వర్మ పేర్కొన్నారు. స్కిల్ పలావర్ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చుకోవచ్చని తెలిపారు. సాంకేతిక నైపుణ్యాలతోపాటు బృంద స్ఫూర్తి, సృజనాత్మకత, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చని వివరించారు.
విద్యా ప్రణాళికలో ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం, పరిశ్రమల భాగస్వామ్యం, ఆచరణాత్మక నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమల నిపుణులను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఈ కార్యక్రమం వాస్తవ ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాల పెంపునకు తోడ్పడిందని పేర్కొన్నాయి. ఈ కార్యక్రమం లో కెఎల్ యూనివర్సిటీ వైస్ చాన్సులర్ డాక్టర్ జి. పార్ధసారధి వర్మ, ప్రో వైస్ చాన్సులర్లు డాక్టర్ ఎన్. వెంకట్ రామ్, డాక్టర్ కె. రాజశేఖర రావు,రిజిస్ట్రార్ డాక్టర్ కె. పవన్ కుమార్, స్కిల్ డెవలెప్ మెంట్ డీన్ డాక్టర్ ఎ. శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.




