Vijayawada: సహజ ప్రసవాన్ని ప్రోత్సహిద్దాం.. తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుదాం!

Vijayawada: సొసైటీ ఆఫ్ మిడ్‌వైవ్స్ ఇండియా పిలుపు మేరకు విజయవాడ రామవరప్పాడు రింగ్ వద్ద సహజ ప్రసవాలపై అవగాహన వాక్‌థాన్‌ను యం. రాజుబాబు ప్రారంభించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 22 Nov 2026 8:59 PM IST
Vijayawada
X

Vijayawada: సహజ ప్రసవాన్ని ప్రోత్సహిద్దాం.. తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుదాం!

Vijayawada: ఒక శిశువు జననం అనేది కొత్త జీవితానికి, కొత్త తరానికి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి నాంది అని, ప్రసవం అనేది తల్లికి గౌరవప్రదంగా, సురక్షితంగా, ఆత్మవిశ్వాసంతో జరిగేలా చూడటం మనందరి బాధ్యత అని ఏపీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోన్–II , అధ్యక్షులు యం. రాజుబాబు పేర్కొన్నారు.

సొసైటీ ఆఫ్ మిడ్‌వైవ్స్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం విజయవాడలోని ఏలూరు రోడ్డు, రామవరప్పాడు రింగ్ సెంటర్ వద్ద ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, విజయవాడ ప్రిన్సిపాల్ ఎస్. నాగ శేషమ్మ అధ్యక్షతన సహజ ప్రసవాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాక్‌థాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యం. రాజుబాబు జెండా ఊపి వాక్‌థాన్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాజుబాబు మాట్లాడుతూ, పూర్వకాలంలో ఎక్కువగా సహజ ప్రసవాల ద్వారానే శిశువులకు జన్మనిచ్చేవారని, నేటికీ అనేక మంది మహిళలు సహజ ప్రసవాల అనంతరం ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. సహజ ప్రసవం అనేది తల్లి శరీరంలోని సహజ ప్రసవ ప్రక్రియ ద్వారా బిడ్డకు జన్మనివ్వడమని వివరించారు.

తల్లి ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యానికి పునాది అని, కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీలకు సరైన పోషకాహారం అందించడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించడం, అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించడం వంటి అంశాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరమన్నారు. గర్భిణీ స్త్రీకి వైద్య చికిత్స ఎంత ముఖ్యమో, కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు, ఆదరణ, ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత కూడా అంతే ముఖ్యమని తెలిపారు.

మనం నిర్వహిస్తున్న ఈ వాక్‌థాన్ కేవలం కొన్ని కిలోమీటర్లు నడవడం మాత్రమే కాదని, ఇది తల్లుల ఆరోగ్యం కోసం వేస్తున్న అడుగని, సురక్షిత ప్రసవం కోసం చేస్తున్న ప్రయత్నమని , మహిళల గౌరవం కోసం ఇస్తున్న సందేశమని , రాబోయే తరాల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం చేపడుతున్న సామాజిక ఉద్యమమని అయన అభివర్ణించారు.

సహజ ప్రసవాలపై ప్రతి ఇంట్లో మహిళలకు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించాలని, ఈ సందేశాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి తీసుకెళ్లడంలో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని రాజుబాబు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, విజయవాడ ప్రిన్సిపాల్ ఎస్. నాగ శేషమ్మ మాట్లాడుతూ, సొసైటీ ఆఫ్ మిడ్‌వైవ్స్ ఇండియా పిలుపు మేరకు నిర్వహించిన ఈ వాక్‌థాన్ ప్రధాన ఉద్దేశం సహజ ప్రసవాన్ని ప్రోత్సహించడం, గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, అనవసరమైన సిజేరియన్ ప్రసవాలను తగ్గించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, మిడ్‌వైవ్స్ (Midwives) సేవల ప్రాముఖ్యతను తెలియజేయడం అని వివరించారు.

తల్లి లేదా బిడ్డ ప్రాణాలకు, ఆరోగ్యానికి ప్రమాదం ఉన్న సందర్భాల్లో సిజేరియన్ శస్త్రచికిత్స తప్పనిసరి కావచ్చని, అటువంటి పరిస్థితుల్లో వైద్యుల నిర్ణయాన్ని గౌరవించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. అయితే వైద్యపరంగా అవసరం లేకపోయినా, కొంతమంది కుటుంబాలు మంచి రోజు, మంచి సమయం, మంచి నక్షత్రం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే సిజేరియన్ చేయించుకోవాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇటువంటి నిర్ణయాల విషయంలో వైద్యుల సలహాలను పాటించాలని, ప్రసవ విధానం తల్లి, బిడ్డల ఆరోగ్య భద్రత ఆధారంగానే నిర్ణయించబడాలని సూచించారు.

సహజ ప్రసవాన్ని ప్రోత్సహించడంలో మిడ్‌వైవ్స్ సేవలు, శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని, గర్భిణీ స్త్రీలకు గర్భధారణ సమయంలోనే కాకుండా ప్రసవ సమయంలో, ప్రసవానంతరం కూడా తగిన వైద్య సంరక్షణ అందించాల్సిన అవసరం ఉందని ఆమె వివరించారు.

ఈ వాక్‌థాన్ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ హాస్టల్ విద్యార్థులతో పాటు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, పిన్నమనేని సిద్ధార్థ నర్సింగ్ కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కె. భారతి, లెక్చరర్ మరియు సొసైటీ ఆఫ్ మిడ్‌వైవ్స్ వాక్‌థాన్ కో-ఆర్డినేటర్, ఏపీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోన్–II కార్యదర్శి కె.వి.వి. నాగమురళి, వివిధ కళాశాలలకు చెందిన మహిళా ప్రతినిధులు ఉమా మహేశ్వరి, మాధవి, సీతా మహాలక్ష్మి, విజయకుమారి, కల్పన, ఎ. ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.