Mangalagiri: స్థానిక సమరానికి 30 రోజుల రోడ్‌మ్యాప్: నాదెండ్ల మనోహర్!
Mangalagiri: స్థానిక సంస్థల ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ రూపొందించిన 30 రోజుల ప్రణాళికను అమలు చేస్తామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Mangalagiri: స్థానిక సమరానికి 30 రోజుల రోడ్‌మ్యాప్: నాదెండ్ల మనోహర్!
మంగళగిరి: ‘నేటి నుంచి 30 రోజులపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అనుసరించాల్సిన ప్రణాళికను జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధం చేశారు. దీన్ని మనమంతా తు.చ. తప్పకుండా పాటించాలి. ప్రజల్లోకి తీసుకెళ్లాల’ని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖమాత్యులు, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే నాయకులకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వనని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాల కోసం చేయని ఆకృత్యం లేదు.. వ్యవస్థలను, అధికారాన్ని అడ్డం పెట్టుకొని 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని టార్గెట్ చేశారని చెప్పారు. అప్పట్లో సిద్ధం చెప్పిన వ్యక్తే... నేడు యుద్దం అంటున్నారని, జనసేన పార్టీ ఎప్పుడూ యుద్ధానికి సిద్ధమని తేల్చి చెప్పారు. 2024 ఎన్నికల్లో యుద్ధం చేసిన జనసేనకు ప్రజల మద్దతు లభించిందని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం శుక్రవారం మంగళగిరి సీకే కన్వెక్షన్ సెంటర్ లో జరిగింది. సమావేశంలో 2021లో జనసేన పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో ఉన్నవారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు సమావేశం ప్రారంభంలోనే ఆత్మీయంగా శ్రీ మనోహర్ గారు సన్మానించారు. 1000 మందికి సభావేదికపై సన్మానాలు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘అప్పట్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు యువత, మహిళలు ముందుకు వచ్చి కష్టాల కోర్చి ఎన్నికల్లో నిలబడి, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు. ఆనాడు అంతటి యుద్ధ వాతావరణంలోనూ 2 జడ్పీటీసీలు, 177 ఎంపీటీసీలు, 1209 సర్పంచులు, 1576 ఉప సర్పంచులు, 4,456 వార్డు మెంబర్లను జనసేన పార్టీ గెలుచుకుంది.
స్థానిక ఎన్నికల్లో నిలబడ్డాం… కలబడ్డాం
జనసేన పార్టీ బలం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికీ చెబుతున్నదొక్కటే. మేం లొంగిపోలేదు. పోటీకి గైర్హాజరు కాలేదు. మేం నిలబడ్డాం. కలబడ్డాం. ప్రజాస్వామ్యాన్ని బతికించుకునేందుకు కదం తొక్కాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పోరాట స్ఫూర్తి మనం అందిపుచ్చుకున్నాం. అదే స్ఫూర్తి నేడు రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన తీసుకొచ్చింది. వైసీపీని అధ:పాతాళానికి తొక్కుతామని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తామని చెప్పిన మాటను ప్రజలు నిజం చేశారు. ఆశీర్వదించారు.
జనసేనకు పోరాటాలు కొత్త కాదు
జనసేన పార్టీ ఎల్లపుడూ పోరాటాలు చేసింది. ప్రజల వైపు నిలిచింది. ఉద్దానం నుంచి ఇసుక కొరతతో ఇబ్బందులుపడుతున్న భవన నిర్మాణ కార్మికుల కోసం, మత్స్యకారుల జీవనానికి శాపంగా నిలిచిన 217 జీవో రద్దు చేయాలని మత్స్యకార భరోసా యాత్ర చేసిన అండగా నిలిచాం. రోడ్ల సమస్య మీద కానీ, ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు సహాయం చేసే విషయంలోగానీ జనసేన పార్టీ రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లింది.
రాజధాని రైతాంగానికి మద్దతుగా ముళ్లకంచెలు దాటి పోరాడారు. మూడు పార్టీలు కలిసి ఉంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని నమ్మిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు దానికి చొరవ తీసుకున్నారు. ప్రజల మద్దతును కూడగట్టారు. కూలాలు, మతాలు చూడకుండా సామాన్య వ్యక్తులను ఎన్నికల రణరంగంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మన నాయకుడి కృషి, పోరాటం వల్లనే రిజిస్టర్ పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీగా జనసేన నిలిచింది.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువతకు ప్రాధాన్యం ఇచ్చారు
యువ నాయకత్వం అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకం కావాలి. జనసేన పార్టీ తరఫున ఉద్యమి సభ్యత్వం చేసినపుడు మీ దృష్టికి వచ్చిన విషయాలను ఎన్నికల్లో ప్రస్తావించేలా, సమస్యలు తీర్చేలా ప్రణాళికతో ముందుకు రండి. యువతరం ఎప్పుడూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంది. ఆయన చూపుతున్న పాలన సంస్కరణలు, చేస్తున్న అభివృద్ది ప్రస్థానం వారు గమనిస్తున్నారు.
2019 ఎన్నికల్లోనూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాధారణ యువతకు అవకాశాలు కల్పించారు. తర్వాత 2021 స్థానిక ఎన్నికల్లోనూ యువత బరిలో నిలిచి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పోరాడారు. పంచాయతీరాజ్ శాఖను దేశంలోనే నంబర్ 1గా చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పాలన, పల్లె పండుగ, గ్రామసభలు, వేల కిలోమీటర్ల రోడ్లు పనులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద యువత ఆశలను రెట్టింపు చేస్తున్నాయి.
జనసైనికుల పోరాటం, ఆత్మగౌరవం నిలబెట్టేలా ఎన్నికలు
రాబోయే రోజుల్లో ఎలా స్థానిక సంస్థలకు సిద్దమవుదాం అని ఇటీవల జరిగిన సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒక్కటే. జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్దామని నిర్ణయించారు. పొత్తులో ఉన్నపుడు కొన్ని విషయాల పట్ల కొన్ని నిర్ణయాలు ఉంటాయి. మనం ఎక్కడ బలంగా ఉన్నామనేది కచ్చితంగా స్థానిక నాయకత్వం తెలుసుకోవాలి. మన బలం ఎంత..? దానికి గల కారణాలు..? సామాజిక అంశాలు, స్థానిక సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయండి.
అక్కడి మన బలాబలాలపై ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకోండి. సర్వేలు చేయించండి. కచ్చితంగా బలంగా ఉన్న చోట మనం పోటీ చేస్తే గెలిచేలా వ్యూహాలు రూపొందించుకోవాలి. ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామంవారీగా జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమయ్యేలా చూడాలి. రిజర్వేషన్లు, స్థానిక బలాబలాలు అన్నీ బేరీజు వేసుకొని, నాయకత్వాన్ని పెంచే దిశగా జనసేన అడుగులు వేస్తుంది. ఏ అభ్యర్థులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరు నిలబెడతారో వారికి తగిన ప్రాధాన్యం ఇస్తాం. మొదట యువతరం, తర్వాత మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడమే జనసేన సిద్ధాంతం.
జనసేన బలాన్ని చూపిద్దాం
కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు రూ.1.46 లక్షల కోట్ల సంక్షేమం చేశాం. ప్రతి పథకాన్ని కొనసాగిస్తూ, అభివృద్దిని ముందుకు తీసుకెళుతున్నాం. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూటమి ప్రభుత్వానికి మరింత దన్నుగా నిలబడాలి. అలాగే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని మోదీ గారికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. కేంద్రం సహకారం రాష్ట్రానికి బలంగా మారింది. దీన్ని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలి. నాయకుల్లో బాధ్యత పెరగాలి. క్షేత్రస్థాయి పరిస్థితులకు తగినట్లుగా నాయకత్వం బాధ్యత తీసుకోవాలి.
జనసేన పార్టీ ఎప్పుడూ కన్వినియంట్ పాలిటిక్స్ చేయదు. పారదర్శక రాజకీయాలు మాత్రమే చేస్తుంది. జనసేన బలాన్ని స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా మరింత చూపించాలి. దానికి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్దాం. పొత్తుల్లో భాగంగా ఎక్కడ సర్దుబాట్లు ఉంటాయి..? ఎక్కడ పోటీ అనేది తెలుసుకోవాలి. 2024 ఎన్నికల్లో త్యాగం చేసిన చోట్ల కూడా తగిన అవకాశాలు కల్పించాలి. అక్కడ కూడా నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేలా పనిచేయాలి.
సెప్టెంబరు 2న జనసేన యువజన విభాగం ఏర్పాటు
జనసేన పార్టీ యువత కోసం మరో అద్భుతమైన వేదికను తీసుకురాబోతోంది. పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీన జనసేన పార్టీ యువజన విభాగాన్ని మొదలుపెట్టబోతున్నాము. సెప్టెంబర్ 2వ తేదీన ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ యువజన విభాగం ఆవిష్కరణ చేయబోతున్నాం. యువతను పార్టీలోకి తీసుకురావాలి. స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి. వారికి మంచి వేదికను ఇవ్వాలనే బలమైన లక్ష్యంతో యువజన విభాగం పనిచేస్తుంది.
యువత సమస్యలు, వారి రాజకీయ ఆకాంక్షలు, ఆలోచనలకు ప్రతీకగా యువజన విభాగం నిలుస్తుంది. యువజన విభాగం ఏర్పాటుకు సంబంధించి ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామస్థాయిల్లో ర్యాలీలు, ఆవిష్కరణలు చేయాలి. దేశమే ఫస్ట్.. మిగిలినవన్నీ నెక్స్ట్ అనే తరహాలో యువజన విభాగం సేవలు విస్తృతం చేయాలనేది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. యువత రాజకీయాల్లోకి రావలసిన అవసరాన్ని గుర్తించి వారి కోసం బలంగా ఈ విభాగం పనిచేస్తుంది.
2029 ఎన్నికల్లో జనసేన పార్టీ మరింత బలంగా ముందుకు వెళ్లాలి. ప్రతి ఒక్కరూ నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఒక దేశ ప్రధాని స్వయంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లి పరామర్శించారు అంటే మన పార్టీ అధ్యక్షుల వారికి కేంద్ర నాయకత్వం ఇచ్చే గౌరవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వం, కూటమిపై ప్రభుత్వం మద్దతుగా మనం ముందుకు సాగాలి.
సోషల్ మీడియాను మంచి కోసం, మంచి పనిని పదిమందికి తెలియజేయడం కోసం ఉపయోగించుకోండి. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే వీధి పోరాటాలు, రాజకీయాలు, చైతన్యం. మన ప్రాంతంలో జరిగే రాజకీయ పోరు. దీనిలో జనసేనను అత్యున్నతంగా నిలబెట్టేలా మనమంతా కలిసికట్టుగా పనిచేద్దాం’’ అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, ఎంపీలు శ్రీ వల్లభనేని బాలశౌరి, శ్రీ లింగమనేని రమేష్, శ్రీ టి ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.




