Vijayawada: విజయవాడ సరస్ మేళాలో కలెక్టర్ సమీక్ష!

Vijayawada: విజయవాడ పున్నమి ఘాట్‌లో జాతీయ సరస్ మేళా–2026. 'ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త' లక్ష్యంగా మహిళలను ప్రోత్సహించాలని కలెక్టర్ పిలుపు!

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 21 Oct 2026 5:53 PM IST
Vijayawada
X

Vijayawada: విజయవాడ సరస్ మేళాలో కలెక్టర్ సమీక్ష!

Vijayawada: విజయవాడ పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా–2026 లో భాగంగా, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఎస్సెల్రేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ స్టాల్‌ (బయ్యర్–సెల్లర్ మీట్ గ్యాలరీ) లో బుధవారం మెప్మా, సెర్ప్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తుల కళాకారులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించి, వాటి తయారీ విధానం, నాణ్యత, మార్కెటింగ్ అవకాశాలు, విక్రయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మహిళలు తయారు చేసిన బ్యాగులు, చెక్క బొమ్మలు, చెక్కతో రూపొందించిన వీణలు తదితర హస్తకళా ఉత్పత్తులను పరిశీలించిన కలెక్టర్, కళాకారుల నైపుణ్యాన్ని, ఉత్పత్తుల నాణ్యతను అభినందించారు.

వినూత్నమైన ఉత్పత్తులను రూపొందిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్న మహిళలకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” (One Family, One Entrepreneur) లక్ష్యంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలను వ్యాపార రంగం వైపు మరింతగా ప్రోత్సహించాలని తెలిపారు. మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం, కొనుగోలుదారులతో నేరుగా వ్యాపార సంబంధాలు ఏర్పడేలా చూడడం, వారి వ్యాపారాలను విస్తరించేందుకు అవసరమైన సహకారం అందించడం కీలకమని పేర్కొన్నారు.

వచ్చే ఏడాది సరస్ మేళా నాటికి ప్రస్తుత సంఖ్యకు రెట్టింపు స్థాయిలో మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మహిళలకు నైపుణ్యాభివృద్ధి, వ్యాపార నిర్వహణ, ఉత్పత్తుల నాణ్యత పెంపు, మార్కెటింగ్ వంటి అంశాల్లో తగిన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.

మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించినప్పుడే వారి కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, తద్వారా సమాజం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. జాతీయ సరస్ మేళా వంటి వేదికలు మహిళా సంఘాల ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావడంతో పాటు, వారి వ్యాపారాభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.

కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ వి. శ్రీనివాసరావు రావు, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (SME) ఏపీ డైరెక్టర్లు షీలా శ్రీనివాస్, భవ్య శర్మ, సెర్ప్ అదనపు సీఈఓ ఆర్. శ్రీరాములు నాయుడు, ఎన్టీఆర్ జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాంచార రావు తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.