Kondapalli: కొండపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కన్నెగంటి అమూల్య ప్రమాణం!

Kondapalli: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా కన్నెగంటి అమూల్య, వైస్ చైర్మన్‌గా అక్కల రామ్మోహనరావు ప్రమాణం చేశారు. అభివృద్ధికి రూ.96 కోట్లు కేటాయించామని ఎమ్మెల్యే తెలిపారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 23 Nov 2026 1:43 PM IST
Kondapalli
X

Kondapalli: కొండపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కన్నెగంటి అమూల్య ప్రమాణం!

కొండపల్లి: కొండపల్లి మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ఆకాంక్షించారు. అవినీతికి ఏమాత్రం తావులేకుండా నీతి, నిజాయితీలతో వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకమైన పాలన అందించాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు సూచించారు.

కొండపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా కన్నెగంటి అమూల్య గారు, వైస్ చైర్మన్‌గా జనసేన పార్టీ సీనియర్ నాయకులు అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రమాణ స్వీకార అధికారిగా ఆర్డీవో శ్రీనివాస్ గారు హాజరయ్యారు. కొండపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు గారితో పాటు ఇతర అధికారులు, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్‌పర్సన్ కన్నెగంటి అమూల్య గారిని, వైస్ చైర్మన్ అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారిని ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. కొండపల్లి మున్సిపాలిటీ ఏర్పాటుకు సంబంధించిన తన ఆకాంక్షలను, పట్టణ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యాచరణను వివరించారు.

గతంలో ఇబ్రహీంపట్నం, కొండపల్లి గ్రామాలు గ్రామపంచాయతీలుగానే కొనసాగుతున్న సమయంలో, వాటికంటే చిన్న గ్రామాలు సైతం మున్సిపాలిటీలుగా ఏర్పడి అభివృద్ధిలో ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తించి, ఈ ప్రాంతాన్ని కూడా పట్టణాభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రితో మాట్లాడి కొండపల్లి మున్సిపాలిటీ ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు. అయితే తొలి ఎన్నికల అనంతరం కోర్టు వివాదాలు, ఇతర కారణాల వల్ల పాలకవర్గం సకాలంలో పూర్తిస్థాయిలో పరిపాలనా బాధ్యతలు చేపట్టలేకపోయిందని, ఫలితంగా చివరి ఏడాదిన్నర కాలం మాత్రమే పాలన సాగిందని పేర్కొన్నారు. తాను ఆశించిన స్థాయిలో మున్సిపాలిటీ అభివృద్ధి జరగలేదని అన్నారు.

ప్రస్తుతం కొత్త పాలకవర్గం ఏర్పడటంతో కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని, 40 మంది కౌన్సిలర్ల సమష్టి కృషితో పట్టణాన్ని శరవేగంగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఈసారి ఎన్నికైన కౌన్సిలర్లలో దాదాపు 80 శాతం మంది యువతరం ఉండటం సంతోషకరమని తెలిపారు. యువ నాయకత్వం, అనుభవం కలిసివచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధే లక్ష్యం.

ఎన్నికల సమయంలో రాజకీయాలు సహజమని, ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు సూచించారు. ఏ పార్టీ నుంచి ఎన్నికైనప్పటికీ తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు బాధ్యతాయుతంగా సేవలందించాలని, ప్రతి వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కోరారు. ప్రాంతం, గ్రామం, ప్రజల పట్ల సేవాభావం, అంకితభావంతో వ్యవహరిస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఒక శాసనసభ్యుడిగా నూతన పాలకవర్గానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని భరోసా ఇచ్చారు.

కొండపల్లి అభివృద్ధికి రూ.96 కోట్ల నిధులు

కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం గతంలో వివిధ కారణాల వల్ల నిర్దిష్టంగా నిధులు కేటాయించలేకపోయామని, ప్రస్తుతం వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.96 కోట్ల నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు వెల్లడించారు. ఈ నిధులతో పట్టణంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాల్సిన బాధ్యత నూతన పాలకవర్గంపై ఉందన్నారు.

నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి రూ.4 కోట్లు.

ప్రస్తుతం వినియోగంలో ఉన్న మున్సిపల్ కార్యాలయం గతంలో గ్రామపంచాయతీ అవసరాలకు అనుగుణంగా నిర్మించినదని, విస్తరించిన కొండపల్లి మున్సిపాలిటీ పరిపాలనా అవసరాలకు అది సరిపోదని ఎమ్మెల్యే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు వివరించారు. అందుకే నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణం కోసం వీటీపీఎస్ అధికారులను సంప్రదించి సుమారు ఒక ఎకరం స్థలం కోరినట్లు తెలిపారు. స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టేందుకు దాదాపు రూ.4 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే టెండర్లు పిలవడంతో పాటు కాంట్రాక్టర్ ఎంపిక కూడా పూర్తయిందని తెలిపారు.

అవసరమైతే అదనంగా మరో రూ.1 నుంచి రూ.2 కోట్ల వరకు ఇతర నిధుల నుంచి సమకూర్చి, అన్ని హంగులతో కూడిన అందమైన నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ప్రస్తుత పాలకవర్గం హయాంలోనే నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.

కొండపల్లి మున్సిపాలిటీని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు నూతన పాలకవర్గం సమష్టిగా, బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు పిలుపునిచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శకత, జవాబుదారీతనం, అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాలన సాగించాలని సూచించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.