Vijayawada: 33 ఏళ్ల విశేష సేవలు.. పి. కిరణ్ కుమార్ పదవీ విరమణ వేడుక
Vijayawada: సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు పి. కిరణ్ కుమార్ 33 ఏళ్ల అద్భుతమైన సర్వీస్ పూర్తి చేసుకుని పదవీ విరమణ చేశారు.
Vijayawada: 33 ఏళ్ల విశేష సేవలు.. పి. కిరణ్ కుమార్ పదవీ విరమణ వేడుక
Vijayawada: శుక్రవారం విజయవాడ ఎన్టీఆర్ పరిపాలనా భవనంలో ఉన్న కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు పి. కిరణ్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమానికి సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎస్ విశ్వనాథన్ హాజరయ్యారు.. ఈ సందర్భంగా డైరెక్టర్ కె.ఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ... 33 ఏళ్లపాటు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ శుక్రవారం సమాచార పౌర సంబంధాల శాఖలో ఆయన పదవీ విరమణ సందర్భంగా శాఖ తరఫున ఘనంగా సత్కరించారు. ఒకే సమయంలో విభిన్న విభాగాల బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేవారని ఆయన తెలిపారు. అవుట్‌డోర్ పబ్లిసిటీ, అడ్మినిస్ట్రేషన్, ఢిల్లీ విభాగాలు, ఫోటోగ్రఫీ, క్యాబినెట్ మీటింగ్ బ్రీఫింగ్స్, రిపబ్లిక్ డే శకటాల (Tableau) రూపకల్పనతో పాటు అసోసియేషన్ బాధ్యతలను కూడా ఆయన ఏకకాలంలో విజయవంతంగా నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు.
శాఖకు సంబంధించిన ప్రతి జీవో (G.O.), రూల్స్ పూర్తి హిస్టరీని ఆయన వేళ్లపై ఉంచుకునేవారన్నారు. అనేక చట్టాలు, నిబంధనల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని, నిబంధనలపై ఆయనకున్న పట్టు శాఖకు ఎంతో మేలు చేసిందని కొనియాడారు. 2023 తో పోలిస్తే, ఆ తర్వాత జరిగిన అతిపెద్ద 'పార్టనర్‌షిప్ సమ్మిట్' అని, మీడియా మేనేజ్‌మెంట్, కవరేజ్ బాధ్యతలను ఎలాంటి లోపాలు లేకుండా కిరణ్ కుమార్ విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక బ్రాండ్‌గా నిలబెట్టడంలో ఈ సమ్మిట్ విజయం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకల్లో దేశ రాజధాని వేదికగా ఎంతో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ 'ఏటికొప్పాక' శకటం డిజైన్, ప్రదర్శన వెనుక కిరణ్ కుమార్ నిరంతర శ్రమ, సృజనాత్మకత దాగి ఉన్నాయని ప్రశంసించారు. సుదీర్ఘ సర్వీస్‌లో ఉంటూనే ఆయన నిరంతరం కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపేవారన్నారు. అందులో భాగంగానే లా (Law), క్రిమినాలజీ వంటి మరెన్నో కోర్సులు చేస్తూ నిరంతరం తన నైపుణ్యాలను అప్‌స్కిల్లింగ్ (Upskilling) చేసుకున్నారని డైరెక్టర్ గుర్తుచేశారు.
ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కుటుంబం కంటే పనికే మొదటి ప్రాధాన్యత ఇచ్చి, శాఖ ఉన్నతి కోసం ఆయన నిరంతరం శ్రమించారన్నారు. 33 ఏళ్లపాటు ఆయన అందించిన అద్భుతమైన సేవలు శాఖ చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. కిరణ్ కుమార్ లోని సినియారిటీ, సిన్సియారిటీని, మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలను శాఖలోని యువ సిబ్బంది అందరూ అలవర్చుకోవాలని డైరెక్టర్ పిలుపునిచ్చారు. అధికారిక బాధ్యతల నుండి విరమణ పొందుతున్న ఆయన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా గడపాలని సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె. ఎస్ విశ్వనాథన్ తెలియజేశారు.
పదవీ విరమణ చేస్తున్న అదనపు సంచాలకులు (ఇంచార్జి) పోతుల కిరణ్ కుమార్ మాట్లాడుతూ... డెడికేషన్, డివోషన్, డిటర్మినేషన్ అనే త్రీడీ సూత్రాలతోనే తాను పనిచేశానని, పీఆర్వోలకు జర్నలిజం పరిజ్ఞానం ఎంతో అవసరమన్నారు. బోధన, చట్టంపై ఆసక్తి ఉన్నా, అనుకోకుండా జర్నలిజం పూర్తి చేసి ఈ శాఖలోకి వచ్చానని.. ఇక్కడ పనిచేయడం వల్లే నలుగురు రాష్ట్రపతులు, ముగ్గురు ప్రధానమంత్రులను కలిసే అరుదైన అవకాశం దక్కిందని గుర్తుచేసుకున్నారు. పుట్టపర్తి వేడుకలు, పుష్కరాల వంటి సమయాల్లో వివిధ ప్రణాళికలతో ట్రాఫిక్, మీడియా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు వివరించారు. వైఎస్సార్ హయాంలో కేజీ బేసిన్ కేసు కోసం తన సేవలను ప్రత్యేకంగా ఉపయోగించుకున్నారన్నారు.
విధి నిర్వహణలో నిరంతరం నిమగ్నమవ్వడం వల్ల కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయానని, తండ్రిని కూడా కోల్పోవాల్సి వచ్చిందని భావోద్వేగానికి లోనయ్యారు. తన విజయాలన్నీ టీమ్ వర్క్ వల్లే సాధ్యమయ్యాయన్నారు. శాఖలో 'పాసింగ్ క్లౌడ్' లా కాకుండా, వెళ్ళిన ప్రతిచోటా చెరగని ముద్ర వేసే 'రైనీ క్లౌడ్' లా ఉండాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఈ వింగ్‌ను నడపడానికి అందిపుచ్చుకునేలా ఉత్తమమైన వారు శాఖలో ఉన్నారన్నారు.
పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసినవారిలో జాయింట్ డైరెక్టర్లు ఐ. సూర్యచంద్రరావు, సీఐఈ ఓ. మధుసూధన, ఆర్ఐఈ కృష్ణా రెడ్డి, డాక్టర్ టి. నాగరాజ, డిప్యూటీ డైరెక్టర్లు పి. వెంకట్రాజ్ గౌడ్, డి. రమేశ్, అసిస్టెంట్ డైరెక్టర్లు ఏఎస్ వీరభద్రరావు, పి. రాజశేఖర్, డాక్టర్ కె. తిరుపాలయ్య, ఎస్వీ మోహన్ రావు, గణాంక విభాగం ఏవో పి. సుదర్శనరావు, జేఏవో ఎమ్. నాగరాజు, సీనియర్ పాత్రికేయులు, వివిధ జర్నలిస్ట్ సంఘాలు, పలువురు పబ్లిషర్స్, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొని ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, అభినందనలు తెలిపారు.




