Vijayawada: వైద్య రంగాన్ని వ్యాపారమయం చేసే పీపీపీ విధానాన్ని ఆపాలి!
Vijayawada: నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసే పీపీపీ విధానాన్ని విరమించుకోవాలని మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ బుధవారం డిమాండ్ చేసింది.
Vijayawada: వైద్య రంగాన్ని వ్యాపారమయం చేసే పీపీపీ విధానాన్ని ఆపాలి!
Vijayawada: రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ తో ప్రైవేటుపరం చేయాలని ఆలోచనలను వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వమే 10 మెడికల్ కళాశాలలను పూర్తి చేయాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈనెల 18వ తేదీన విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ప్రధాన వక్తగా మాజీ మంత్రివర్యులు వైయస్సార్ సిపి సీనియర్ నేత పేర్ని నాని ప్రసంగించారు.
వారితోపాటు మీడియా సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ కో- కన్వీనర్, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, శాసనమండలి మాజీ సభ్యులు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కె.ఎస్. లక్ష్మణరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రామ్ భూపాల్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నాసర్ జి, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.
పేర్ని నాని ప్రసంగిస్తూ పిపిపి పేరుతో ప్రజల సొమ్మును, సమాజ సంపదను కొద్దిమంది బడా సంస్థలకు కట్టబెడితే పౌర సమాజం మౌనంగా ఉండదని,మాలో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీని నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వం మెడికల్ కళాశాలలను రక్షించుకోవడానికి కలిసి వచ్చే రాజకీయ పార్టీలు,విద్యార్థి, యువజన, పౌర సంఘాలతో కలిసి ఐక్యంగా ఉద్యమిస్తామని తెలిపారు.
షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల,మైనార్టీ వర్గాల, అగ్రవర్ణాలలోని పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో ఉంచడానికి, సామాన్య ప్రజానీకానికి ఆధునిక వైద్యం సకాలంలో అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 17 ప్రభుత్వం మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టి 7 మెడికల్ కళాశాలలను పూర్తిచేసి,వందలాది వైద్య విద్యార్థులకు, వేలాది ప్రజానీకానికి తోడ్పడిందని నిర్మాణంలో ఉన్న మిగిలిన 10 ప్రభుత్వ కళాశాలను వెంటనే నేటి ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు.
10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు దాదాపు 500 ఎకరాల పట్టణ భూమి ఉందని, 25 శాతం భవనాలు పూర్తి అయినాయని, గత 30 నెలలుగా వీటిపై ఎలాంటి వ్యయం చేయకుండా నిర్మాణాలు ఆపి డబుల్ ఇంజన్ సర్కార్ భారీ స్కాం కు తెరలేపిందన్నారు.
జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ నేటి ప్రభుత్వం పి పి పి పేరుతో ఎకరానికి వంద రూపాయలు లీజ్ తో 500 ఎకరాలను బడా సంస్థలకు 66 సంవత్సరాలు పాటు ఇవ్వాలని,ఒక్కొక్క మెడికల్ కాలేజీ సిబ్బందికి సంవత్సరానికి 120 కోట్ల రూపాయలను జీతాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని భావిస్తుందని,ఇవి కాక వయోబిలిటీ గ్యాప్ ఫండ్ పేరుతో మరో 1600 కోట్ల ప్రజల సొమ్మును బడా సంస్థలకు ధారాదత్తం
చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. సంవత్సరానికి 2 వేల కోట్ల చొప్పున రాబోవు 3 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేస్తే 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పూర్తి అవుతాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కేవలం ఒక్క శాతం మాత్రమే వైద్య రంగానికి వెచ్చిస్తుందని, అభివృద్ధి చెందిన పెట్టుబడి దారి వ్యవస్థ గల అమెరికా స్థూల జాతీయోత్పత్తిలో 14 శాతం, జర్మనీ 11 శాతం, ఆస్ట్రియా 9 శాతం, ఫ్రాన్స్ 10 శాతం, కెనడా 8 శాతం వెచ్చిస్తుంటే భారతదేశం 1.4 శాతం మాత్రమే వ్యయం చేస్తుందన్నారు. శాసనమండలి మాజీ సభ్యులు, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కె.ఎస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ పిపిపి పేరుతో వైద్య రంగాన్ని ప్రైవేటుపరం చేయడాన్ని సహించలేమని, కోట్లాది మంది ప్రజల అగ్రహానికి గురిగాక తప్పదన్నారు.
ఈవెంట్స్ పేరుతో వందలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్న నేటి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉంచడానికి దోహదపడే నిర్మాణంలో ఉన్న పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. ప్రజా ఆరోగ్యం మరియు వైద్య విద్యను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని పిపిపి విధానాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. రామ్ భూపాల్ ప్రసంగిస్తూ బాగా వెనుకబడిన ప్రాంతాలైన ఆధోని, మార్కాపురం, పార్వతీపురం, పెనుగొండ, నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తి అయితే లక్షలాది మంది పేద రోగులకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. భూములు, భవనాలు,జీతాలు అన్ని ప్రభుత్వమే భరిస్తూ మెడికల్ కళాశాలల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రజాప్రయోజనాలకు విరుద్ధమన్నారు.
ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాసర్ జి ప్రసంగిస్తూ పిపిపి విధానం వలన ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేని పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు.
ప్రైవేట్ సంస్థలు రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయవని తద్వారా సామాజిక న్యాయం దక్కదన్నారు. 3 వేల కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయిలు ఉన్నాయని 6 వేల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజారోగ్యాన్ని రక్షించడం రాజ్యం బాధ్యత అన్నారు. ఈ సమావేశంలో దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్ పాల్గొన్నారు.




